5g auction: కొనసా...గుతున్న 5జీ వేలం.. 23 రౌండ్ల బిడ్లు పూర్తి

5జీ వేలం (5g auction) ప్రక్రియ శనివారం కూడా కొనసాగుతుందని టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు.

Published : 29 Jul 2022 22:23 IST

దిల్లీ: 5జీ వేలం (5g auction) ప్రక్రియ శనివారం కూడా కొనసాగుతుందని టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం వరకు 23 రౌండ్లకు గానూ రూ.1,49,855 కోట్ల విలువైన బిడ్లు దాఖలయ్యాయని మంత్రి వెల్లడించారు. రెండ్రోజుల్లోనే ఈ వేలం ప్రక్రియ పూర్తవుతుందని తొలుత భావించగా.. నాలుగు రోజులు పూర్తయినా ఓ కొలిక్కి రాకపోవడం గమనార్హం. కంపెనీల మధ్య ఆరోగ్యకరమైన పోటీ కొనసాగుతోందని మాత్రం ప్రభుత్వం చెబుతోంది.

బిడ్ల విలువ పరంగా చూస్తే.. గత మూడు రోజుల్లో పెద్దగా పెరిగిందేమీ లేదు. వేలం ప్రారంభమైన తొలిరోజైన మంగళవారం రూ.1.45 లక్షల కోట్ల బిడ్లు దాఖలు కాగా.. బుధవారానికి అది రూ.1,49,454 కోట్లకు పెరిగింది. గురువారం రూ.1,49,623 కోట్లకు, శుక్రవారం రూ.1,49,855 కోట్లకు పెరగడం గమనార్హం. గ్రామీణ ప్రాంతాల్లో సైతం సేవలందించేందుకు టెలికాం కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయని మంత్రి గురువారం పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం టెలికాం వినియోగదారులు పెరగడంతో టెలికాం కంపెనీలు అధిక జనాభా ఉన్న ప్రాంతాల్లోని స్పెక్ట్రమ్‌ను దక్కించుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయని దీనిని బట్టి తెలుస్తోంది. ఉత్తర్‌ప్రదేశ్‌ తూర్పు ప్రాంతంలో 4జీ స్పెక్ట్రమ్‌లోని 1,800 మెగా హెర్ట్జ్స్‌ బ్యాండ్‌ కోసం టెలికాం కంపెనీల మధ్య తీవ్ర పోటీ నెలకొందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే వేలం ప్రక్రియ ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని