Debt Mutual Fund: డెట్‌ మ్యూచువల్‌ ఫండ్‌ మదుపర్లకు షాక్‌.. ఇకపై ఆ ప్రయోజనం ఉండదు

Debt Mutual Funds: కనీసం 35 శాతం ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేయని డెట్‌ మ్యూచువల్‌ ఫండ్ల (Debt Mutual Funds)కు ఇకపై ఎల్‌టీసీజీ ప్రయోజనం ఉండదు.

Published : 24 Mar 2023 17:47 IST

దిల్లీ: డెట్‌ మ్యూచువల్‌ ఫండ్ల (Debt Mutual Funds)పై ఇస్తున్న ‘దీర్ఘకాల మూలధన లాభాల పన్ను (LTCG)’ ప్రయోజనాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ఇకపై వీటిలో చేసే మదుపుపై వచ్చే రాబడిపై ఆదాయ పన్ను శ్లాబుల ప్రకారం ట్యాక్స్‌ చెల్లించాల్సి ఉంటుంది. ఆర్థిక బిల్లు 2023 సవరణల్లో భాగంగా ఈ ప్రతిపాదనకు శుక్రవారం పార్లమెంటు ఆమోదం లభించింది.

కనీసం 35 శాతం ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేయని డెట్‌ మ్యూచువల్‌ ఫండ్ల (Debt Mutual Funds)కు ఇకపై ఎల్‌టీసీజీ ప్రయోజనం ఉండదు. ప్రస్తుతం డెట్‌ మ్యూచువల్‌ ఫండ్లలో మూడేళ్ల కంటే ఎక్కువ కాలం మదుపు చేస్తే వాటిని దీర్ఘకాల పెట్టుబడిగా పరిగణిస్తున్నారు. ఇండెక్సేషన్‌తో కలిపి 20 శాతం ఎల్‌టీసీజీ పన్ను వేస్తున్నారు. ఇండెక్సేషన్‌ లేకుండా అయితే 10 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇకపై ఈ ఫండ్లలో మదుపు చేసిన వారందరూ ఆదాయ పన్ను శ్లాబుల ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ చర్యతో మార్కెట్‌ అనుసంధాన డిబెంచర్లు.. డెట్‌ ఫండ్లపై వేసే పన్నుల్లో సమానత్వం వస్తుంది.

వాస్తవానికి ఎల్‌టీసీజీ ప్రయోజనం వల్లే డెట్‌ మ్యూచువల్‌ ఫండ్ల (Debt Mutual Funds)కు దేశంలో ఆదరణ పెరిగింది. ఇప్పుడు దాన్ని ఎత్తివేయడంతో ఈ తరహా ఫండ్లకు ప్రాధాన్యం తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు బ్యాంకు డిపాజిట్లను పెంచడం కూడా ప్రభుత్వ లక్ష్యమై ఉంటుందని తెలిపారు. ఇకపై డెట్‌ మ్యూచువల్‌ ఫండ్లకు బదులు చాలా మంది బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ఎంచుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నిర్ణయం తర్వాత స్టాక్‌ మార్కెట్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థల షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని