Tax on petrol diesel exports: పెట్రోల్‌, డీజిల్‌ ఎగుమతులపై పన్ను.. రిలయన్స్‌ షేర్లు ఢమాల్‌!

విదేశాలకు ఎగుమతి చేసే పెట్రోల్ (petrol)‌, డీజిల్ (diesel)‌, విమాన ఇంధనం (ATF)పై ‘ఎక్స్‌పోర్ట్‌ ట్యాక్స్’ విధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది....

Updated : 01 Jul 2022 18:20 IST

దిల్లీ: విదేశాలకు ఎగుమతి చేసే పెట్రోల్ (petrol)‌, డీజిల్ (diesel)‌, విమాన ఇంధనం (ATF)పై ‘ఎక్స్‌పోర్ట్‌ ట్యాక్స్’ విధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. అలాగే దేశీయంగా ఓఎన్‌జీసీ, వేదాంత వంటి కంపెనీలు ఉత్పత్తి చేసే ముడి చమురుపై విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ (windfall tax)గా వ్యవహరించే అదనపు పన్నును విధిస్తున్నట్లు వెల్లడించింది.

లీటర్‌ పెట్రోల్‌, ఏటీఎఫ్‌ ఎగుమతిపై రూ.6, లీటర్‌ డీజిల్‌పై రూ.13 ఎగుమతి పన్ను (export tax) విధిస్తున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. మరోవైపు దేశీయంగా ఉత్పత్తి అయ్యే ఒక్కో టన్ను ముడి చమురుపై సంస్థలు రూ.23,250 అదనపు పన్ను చెల్ల్లించాల్సి ఉంటుందని తెలిపింది. దేశీయంగా ప్రభుత్వరంగ సంస్థలైన ఓఎన్‌జీసీ, ఆయిల్‌ ఇండియా సహా ప్రైవేటు కంపెనీలైన కెయిర్న్‌ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, వేదాంత కంపెనీలు ఏటా 29 మిలియన్‌ టన్నుల ముడి చమురును ఉత్పత్తి చేస్తున్నాయి. దీనిపై తాజాగా కేంద్ర ప్రభుత్వం అదనపు పన్ను విధించడంతో సర్కార్‌ ఖజానాకు ఏటా రూ.67,425 కోట్ల ఆదాయం సమకూరనుంది.

విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ అంటే..

ఎలాంటి మూలధన పెట్టుబడి, వ్యాపార విస్తరణ లేకుండా పొందే అనూహ్య లాభాలపై విధించే అదనపు పన్నును విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ (windfall tax)గా వ్యవహరిస్తారు. ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో రష్యా చమురుపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీంతో భారత్‌కు రష్యా రాయితీ ధరతో చమురును విక్రయిస్తోంది. ఫలితంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, నయారా ఎనర్జీ వంటి ప్రైవేటు చమురు శుద్ధి సంస్థలు సైతం తక్కువ ధరకే ముడి చమురును పొందుతున్నాయి. ఆపై దీన్ని శుద్ధి చేసి ఐరోపా, అమెరికా దేశాలకు సాధారణ ధరకు విక్రయించి భారీ ఎత్తున లాభాలు గడిస్తున్నాయి. కొన్ని ప్రభుత్వరంగ సంస్థలూ ఇదే వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి. సంస్థలు ఆర్జిస్తున్న ఈ అనూహ్య లాభాల నుంచి ఆదాయం సమకూర్చుకోవాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం విండ్‌ఫాల్‌ ట్యాక్స్ విధించింది. ఫలితంగా వచ్చిన ఆదాయాన్ని సామాన్యులకు ఇంధనంపై రాయితీ కల్పించేందుకు అవకాశం ఏర్పడుతుంది.

మరోవైపు లాభాలను గడించే క్రమంలో ప్రైవేటు చమురు శుద్ధి సంస్థలు దేశీయ అవసరాలను తుంగలో తొక్కుతున్నాయి. ఫలితంగా రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ వంటి రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో పెట్రోల్‌ పంపుల్లో కొరత ఏర్పడింది. దీన్ని నివారించడంలో భాగంగానూ ఎగుమతి పన్ను, విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ను అమల్లోకి తెచ్చినట్లు స్పష్టమవుతోంది. చమురును ఎగుమతి చేస్తున్న కంపెనీలు తమ విక్రయాల్లో దాదాపు 50 శాతం దేశీయ మార్కెట్లకు విక్రయించనున్నట్లు స్వీయ ధ్రువీకరణ ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది.

రిలయన్స్‌, ఓఎన్‌జీసీ షేర్లు ఢమాల్‌..

కేంద్ర ప్రభుత్వం విధించిన తాజా ఎగుమతి పన్ను, విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ నేపథ్యంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఓఎన్‌జీసీ షేర్లు పెద్ద ఎత్తున నష్టాలు చవిచూశాయి. రిలయన్స్‌ షేర్లు ఏకంగా 7 శాతానికి పైగా నష్టపోగా.. ఓఎన్‌జీసీ షేర్లు ఓ దశలో 13 శాతం పతనాన్ని చవిచూశాయి. జామ్‌నగర్‌లో ఉన్న రిలయన్స్‌ చమురు శుద్ధి కేంద్రం నుంచి వివిధ దేశాలకు చమురు ఎగుమతి అవుతోంది. దీంతో ప్రభుత్వం తాజా నిర్ణయం వల్ల కంపెనీ ఆదాయంపై ప్రభావం పడే అవకాశం ఉంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని