Nirmala Sitharaman: ధరల పెరుగుదలపై ప్రభుత్వం ఫోకస్‌: నిర్మలా సీతారామన్‌

Nirmala Sitharaman on Inflation: ద్రవ్యోల్బణంపై నిర్మలా సీతారామన్‌ స్పందించారు. ఇప్పటికే కొన్ని చర్యలు తీసుకున్నామని, మున్ముందూ చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

Published : 20 Feb 2023 15:47 IST

జైపుర: ద్రవ్యోల్బణం (Inflation) కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, మున్ముందూ దృష్టి సారించనున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) అన్నారు. పప్పు ధాన్యాల సాగును ప్రోత్సహించడంతో పాటు కొన్ని వస్తువులపై దిగుమతి సుంకాన్ని తగ్గించి వాటి అందుబాటును పెంచడం ఇందులో భాగమేనన్నారు. బడ్జెట్‌ అనంతరం జైపురలో భాగస్వామ్యపక్షాలతో సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడారు.

వస్తువుల ధరల పెరుగుదలను అదుపులోకి ఉంచడానికి పప్పు ధాన్యాల సాగును ప్రోత్సహిస్తున్నామని, రాబోయే సీజన్‌కు పంట చేతికి రానుందని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. తాత్కాలికంగా కొరతను అధిగమించేందుకు కంది, పెసర వంటి పప్పు ధాన్యాల దిగుమతులపై సుంకాన్ని ఒక అంకెకు లేదా పూర్తిగానో తొలగించామని పేర్కొన్నారు. దీనివల్ల పప్పు ధాన్యాల లభ్యత పెరిగి.. అవి చౌకగా లభ్యమవ్వడానికి దోహదపడిందని మంత్రి తెలిపారు.

వంట నూనెలపై గడిచిన మూడేళ్లుగా దిగుమతి సుంకం సున్నాగా ఉందని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ముడి పామాయిల్‌, రిఫైన్డ్‌ పామాయిల్‌ తగినంతగా అందుబాటులోకి వచ్చిందని పేర్కొన్నారు. జనవరి నెలకు టోకు ధరల ద్రవ్యోల్బణం 4.73 శాతానికి తగ్గింది. ఇది రెండేళ్ల కనిష్ఠం కాగా.. రిటైల్‌ ద్రవ్యోల్బణం మూడు నెలల గరిష్ఠ స్థాయి పెరిగి 6.52 శాతంగా నమోదైంది. ఆర్‌బీఐ వడ్డీ రేట్లు పెంచినప్పటికీ రిటైల్‌ ద్రవ్యోల్బణం పెరగిన నేపథ్యంలో నిర్మలా సీతారామన్‌ దీనిపై స్పందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని