Toll plazas: 6 నెలల్లో GPS ఆధారిత టోల్‌ వ్యవస్థ: గడ్కరీ

GPS-based toll system: జీపీఎస్‌ ఆధారిత టోల్‌ ఫీజు విధానాన్ని ఆరు నెలల్లో అందుబాటులోకి తెస్తామని గడ్కరీ వెల్లడించారు. దీనివల్ల సమయం మరింత ఆదా కావడంతో పాటు ప్రయాణించిన దూరానికే ఛార్జీ వసూలు చేసే వెసులుబాటు ఉంటుందని చెప్పారు.

Published : 24 Mar 2023 18:34 IST

దిల్లీ: జాతీయ రహదారులపై టోల్‌ ఫీజు వసూలుకు జీపీఎస్‌- ఆధారిత వ్యవస్థను (GPS-based toll system) ఆరు నెలల్లో తీసుకొస్తామని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ (Nithin gadkari) తెలిపారు. ప్రస్తుతం ఉన్న టోల్‌ ప్లాజాల స్థానే వీటిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీనివల్ల ట్రాఫిక్‌ ఇబ్బందులను తప్పడంతో పాటు, ప్రయాణించిన దూరానికే ఫీజు వసూలు చేయడం వీలుపడుతుందని చెప్పారు. ఈ మేరకు పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడారు.

ప్రస్తుతం టోల్‌ ఫీజు వసూళ్ల ద్వారా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI)కు ఏటా రూ.40వేల కోట్లు ఆదాయం వస్తోందని, రాబోయే రెండు మూడేళ్లలో ఈ మొత్తం రూ.1.40 లక్షల కోట్లకు పెరగనుందని గడ్కరీ అంచనా వేశారు. వాహనం ఆగకుండానే నంబర్‌ ప్లేట్లను రీడ్‌ చేసే ప్రాజెక్ట్‌పై  ప్రస్తుతం రవాణా శాఖ పనిచేస్తోంది. 2018-19 నాటికి టోల్‌ ప్లాజాల వద్ద ఒక్కో వాహనం సగటున 8 నిమిషాల పాటు వేచి ఉండాల్సి వచ్చేదని, ఫాస్టాగ్‌ అమల్లోకి వచ్చాక ఆ సమయం సగటున 47 సెకన్లకు తగ్గిందని మంత్రి వివరించారు. అయితే, ఇప్పటికీ నగర శివార్లలో ముఖ్యంగా రద్దీ సమయాల్లో వేచి ఉండే సమయం మరింత ఎక్కువ ఉంటోంది.

అలాగైతే మనమే నంబర్‌ 1

జమ్మూకశ్మీర్‌లో ఇటీవల గుర్తించిన లిథియం నిల్వలను సమర్థంగా వినియోగించుకుంటే భారత ఆటోమొబైల్‌ రంగం ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుకుంటుందని గడ్కరీ అన్నారు. ప్రస్తుతం ఏటా 1200 టన్నుల లిథియంను దిగుమతి చేసుకుంటున్నామని తెలిపారు. 2022లోనే జపాన్‌ను దాటి మూడో అతిపెద్ద ఆటోమొబైల్‌ మార్కెట్‌గా భారత్‌ అవతరించిందని, లిథియంను సమర్థంగా వినియోగిస్తే అమెరికా, చైనాను దాటి అగ్రస్థానంలో నిలవడం ఖాయమని చెప్పారు. దేశం అభివృద్ధి చెందాలంటే తగిన మౌలిక సదుపాయాలు ఉండాలన్న గడ్కరీ.. భవిష్యత్‌లో ప్రజా రవాణాను, విద్యుత్‌ బస్సులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు