Export Tax: ఆ లక్ష్యంతోనే ఇంధన ఎగుమతులపై పన్ను: సీతారామన్‌

పెట్రోల్‌ (petrol), డీజిల్‌ (diesel), విమాన ఇంధనం (ATF) ఎగుమతులపై పన్ను (Export Tax) విధింపు ప్రకటనపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitaraman) స్పందించారు....

Published : 01 Jul 2022 20:16 IST

దిల్లీ: పెట్రోల్‌ (petrol), డీజిల్‌ (diesel), విమాన ఇంధనం (ATF) ఎగుమతులపై పన్ను (Export Tax) విధింపు ప్రకటనపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitaraman) స్పందించారు. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ప్రతి 15 రోజులకు ఒకసారి వీటిని సమీక్షిస్తామని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయని.. చమురు ధరల ఊగిసలాటకు హద్దుల్లేకుండా పోయాయని వివరించారు. 

పన్ను విధించడం ద్వారా ఎగుమతులను దెబ్బతీయడం తమ ఉద్దేశం కాదని సీతారామన్‌ తెలిపారు. దేశీయ అవసరాలకు సరిపడా ఇంధనాన్ని అందుబాటులో ఉంచడమే తమ ప్రధాన లక్ష్యమని వివరించారు. ఇక్కడి ప్రజల అవసరాలను పణంగా పెట్టి లాభాలను ఆర్జించడం సమంజసం కాదని భావించామన్నారు. అందుకే ఎగుమతులపై పన్నుతో పాటు చమురు ఉత్పత్తి కంపెనీలకు ‘విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌’గా వ్యవహరించే అదనపు పన్ను విధించాల్సి వచ్చిందన్నారు.

విదేశాలకు ఎగుమతి చేసే పెట్రోల్ (petrol)‌, డీజిల్ (diesel)‌, విమాన ఇంధనం (ATF)పై ‘ఎక్స్‌పోర్ట్‌ ట్యాక్స్’ విధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. అలాగే దేశీయంగా ఓఎన్‌జీసీ, వేదాంత వంటి కంపెనీలు ఉత్పత్తి చేసే ముడి చమురుపై విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ (windfall tax)ను విధిస్తున్నట్లు వెల్లడించింది. లీటర్‌ పెట్రోల్‌, ఏటీఎఫ్‌ ఎగుమతిపై రూ.6, లీటర్‌ డీజిల్‌పై రూ.13 ఎగుమతి పన్ను (export tax) విధిస్తున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. మరోవైపు దేశీయంగా ఉత్పత్తి అయ్యే ఒక్కో టన్ను ముడి చమురుపై సంస్థలు రూ.23,250 అదనపు పన్ను చెల్ల్లించాల్సి ఉంటుందని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని