New Pension System: ఎన్‌పీఎస్‌పై కేంద్రం కమిటీ.. మరింత మెరుగుపర్చేందుకు సూచనలు!
New Pension System ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ఎన్‌పీఎస్‌పై కమిటీని ఏర్పాటు చేసింది.
దిల్లీ: నూతన పింఛన్ వ్యవస్థ (NPS) మరింత మెరుగుపర్చే అంశంపై కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. దీనికి కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి నేతృత్వం వహిస్తారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో తెలిపారు. ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ఈ కమిటీ కృషి చేస్తుందని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా భాజపాయేతర పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాలు తిరిగి పాత పింఛను వ్యవస్థ (OPS) వైపు వెళ్తున్న విషయం తెలిసిందే. మరికొన్ని రాష్ట్రాలూ అదే బాటలో పయనిస్తున్నాయి. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాలు తాము పాత పింఛను వ్యవస్థను అమలు చేయనున్నట్లు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశాయి. ఈ తరుణంలో కేంద్రం ఎన్‌పీఎస్ (NPS)పై కమిటీని ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
2004 జనవరి 1 తర్వాత చేరిన ఉద్యోగులకు పాత పింఛను వ్యవస్థ (OPS)ను అమలు చేసే ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోవడం లేదని ఇటీవలే కేంద్రం పార్లమెంటుకు తెలియజేసింది. ఓపీఎస్ ప్రకారం.. రిటైర్ అయిన ఉద్యోగులు తమ చివరి వేతనంలో సగం నెలవారీ పింఛనుగా పొందుతారు. డీఏ పెరిగినప్పుడల్లా పింఛను మొత్తం పెరుగుతూ ఉండేది. మరోవైపు కొత్త పింఛను వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్‌పీఎస్, అటల్ పెన్షన్ యోజన నిర్వహణలోని ఆస్తుల విలువ 2023 మార్చి 4 నాటికి రూ.8.81 లక్షల కోట్లకు చేరింది.
సాయుధ బలగాలను మినహాయించి 2004 జనవరి 1 తర్వాత చేరిన ప్రభుత్వ ఉద్యోగులందరికీ కేంద్రం ఎన్‌పీఎస్‌ను అమలు చేస్తోంది. మెజారిటీ రాష్ట్ర ప్రభుత్వాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలు సైతం తమ ఉద్యోగులకు ఎన్‌పీఎస్‌ను వర్తింపజేశాయి. పీఎఫ్‌ఆర్‌డీఏ (Pension Fund Regulatory and Development Authority) సమాచారం ప్రకారం.. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ మినహా దేశంలో 26 రాష్ట్రాలు ఎన్‌పీఎస్‌ను నోటిఫై చేశాయి. 2009 మే 1 తర్వాత ఎన్‌పీఎస్‌ను ప్రతి భారత పౌరుడు స్వచ్ఛందంగా తీసుకునే వెసులుబాటును కేంద్రం కల్పించింది. తర్వాత 2015 జూన్ 1 నుంచి అటల్ పెన్షన్ యోజన పథకాన్ని తీసుకొచ్చింది. దీంతో సామాజిక భద్రతా పథకాలకు మరింత ఆదరణ పెరిగింది.
పెన్షన్ మార్కెట్ అభివృద్ధి, నియంత్రణకు కేంద్ర పీఎఫ్‌ఆర్‌డీఏను 2003లో ఏర్పాటు చేసింది. తొలుత దీన్ని ప్రత్యేకంగా ప్రభుత్వ ఉద్యోగుల కోసం మాత్రమే ఏర్పాటు చేశారు. తర్వాత దీని సేవలను స్వయం ఉపాధి పొందే వారి దగ్గరి నుంచి ప్రతి భారత పౌరుడు, ఎన్‌ఆర్‌ఐలకు కూడా విస్తరించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
కుర్రాళ్లు కేక.. ఫైనల్లో పాకిస్థాన్‌పై విజయం
-
Politics News
భీమవరంలో ఫ్లెక్సీ వార్
-
India News
42 ఏళ్ల వయసులో అదృశ్యమై... 33 ఏళ్ల తర్వాత ఇంటికి!
-
Ts-top-news News
సిద్దిపేట శివారులో.. త్రీడీ ప్రింటింగ్ ఆలయం
-
India News
‘స్క్విడ్ గేమ్’ పోటీలో విజేతగా భారతీయుడు
-
Politics News
పార్టీని విలీనం చేయను.. పొత్తులు పెట్టుకోను