EV Fire Incidents: ఈవీ కంపెనీలకు గడ్కరీ వార్నింగ్‌.. నాణ్యత లోపిస్తే భారీ జరిమానా!

Electric Scooter: విద్యుత్‌ వాహనాల్లో మంటలు చెలరేగడం, బ్యాటరీలు పేలిపోవడం వంటి ఘటనలపై కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ స్పందించారు. విద్యుత్‌ వాహనాల తయారీలో నాణ్యత పాటించాలని సూచించారు.

Updated : 21 Apr 2022 19:46 IST

దిల్లీ: విద్యుత్‌ వాహనాల్లో మంటలు చెలరేగడం, బ్యాటరీలు పేలిపోవడం వంటి ఘటనలపై కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ స్పందించారు. విద్యుత్‌ వాహనాల తయారీలో తప్పక నాణ్యత పాటించాలని సూచించారు. లేకుంటే భారీ జరిమానాలు విధిస్తామన్నారు. దాంతోపాటు వాహనాలను రీకాల్‌ చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. వాహనదారుల భద్రతకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం వరుస ట్వీట్లు చేశారు.

ఓ వైపు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా పెరగడంతో ప్రజలు ఎలక్ట్రిక్‌ వాహనాలపై మొగ్గు చూపుతున్నారు. దీనికి తోడు ప్రభుత్వం రాయితీ ఇస్తుండటంతో వీటి కొనుగోళ్లు ఊపందుకున్నాయి. అయితే, ఇటీవల కాలంలో విద్యుత్‌ వాహనాల్లో మంటలు చెలరేగడం, బ్యాటరీలు పేలిపోవడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా నిజామాబాద్‌లో కూడా విద్యుత్తు వాహనం బ్యాటరీ పేలి ఒకరు మరణించారు. ఈ నేపథ్యంలోనే గడ్కరీ స్పందించారు. గత రెండు నెలలుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ‘ఈవీ పేలుడు’ ఘటనలు తన దృష్టికి వచ్చినట్లు పేర్కొన్నారు. వీటిలో కొంతమంది ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు గాయపడినట్లు మంత్రి తెలిపారు.

ఈ ఘటనలపై ఇప్పటికే నిపుణుల కమిటీ ఏర్పాటు చేశామని, ఆ కమిటీ సిఫార్సులు చేస్తుందని గడ్కరీ తెలిపారు. వాటి ఆధారంగా ఎలక్ట్రిక్‌ వాహనాలకు మార్గదర్శకాలను జారీ చేస్తామన్నారు. వాహన తయారీలో కంపెనీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే భారీ జరిమానాలు విధించడంతో పాటు.. లోపమున్న వాహనాలను వెనక్కి రప్పించాల్సి ఉంటుందని గడ్కరీ తెలిపారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని కంపెనీలు కూడా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఒకవేళ లోపాన్ని గుర్తిస్తే వెంటనే వాహనాలను వెనక్కి రప్పించి సరిచేయాలని మంత్రి సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని