Vizag Steel plant: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో ముందుకే: దీపమ్‌ కార్యదర్శి

Vizag Steel plant sale: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ విక్రయించే విషయంలో కేంద్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదని మరోసారి తేలింది. ఈ ప్లాంట్‌ వ్యూహాత్మక విక్రయానికి సంబంధించి ముందుడుగులు పడుతున్నాయని దీపమ్‌ (DIPAM) కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే తెలిపారు.

Published : 09 Dec 2022 20:02 IST

దిల్లీ: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ (Vizag Steel plant) విక్రయించే విషయంలో కేంద్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదని మరోసారి తేలింది. ఈ ప్లాంట్‌ వ్యూహాత్మక విక్రయానికి సంబంధించి అడుగులు పడుతున్నాయని, అందులో భాగంగా లావాదేవీ నిర్మాణం ఎలా అనేదానిపై పనిచేస్తున్నామని దీపమ్‌ (DIPAM) కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే తెలిపారు. ఈ మేరకు సీఐఐ గ్లోబల్‌ ఎకనమిక్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు.

‘రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (విశాఖ స్టీల్‌ ప్లాంట్‌)లో కేంద్రానికి ఉన్న నూరు శాతం వాటాలను వ్యూహాత్మకంగా విక్రయించేందుకు 2021 జనవరిలోనే ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. కేబినెట్‌ ఆమోదం తెలిపింది కాబట్టి ఇక ఈ విషయంలో మేం ముందుకెళ్తున్నాం. ప్రస్తుతానికి లావాదేవీ నిర్మాణం ఎలా అనే దానిపై పనిచేస్తున్నాం’’ అని తుహిన్‌కాంత పాండే తెలిపారు. ఈ ఏడాది సెన్సెక్స్‌, నిఫ్టీ కంటే బీఎస్‌ఈ CPSE, ఎన్ఎస్‌ఈ CPSE సూచీలే రెండింతలు రాణించాయని పాండే పేర్కొన్నారు. 

స్టీల్‌ ప్లాంట్‌ను విక్రయించొద్దని ఓ వైపు కార్మిక సంఘాలు ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ విక్రయాన్ని అడ్డుకుని తీరుతామని వారు పేర్కొంటున్నారు. స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించే బదులు స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌లో విలీనం చేయాలని కార్మిక సంఘాలు కోరాయి. అందుకు ఆర్థిక మంత్రిత్వ నిరాకరించింది. వ్యూహాత్మకమైన వాటిని వ్యూహాత్మకం కాని వాటిలో విలీనం అనే ప్రశ్నే ఉండబోదని స్పష్టంచేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని