‘ప్రైవేటును ప్రోత్సహిస్తూనే పేదలకు అండగా ఉంటాం’

వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అవసరాలను తీర్చడానికి వాణిజ్య-వ్యాపారాలకు ఇచ్చే రుణాలను మరింత విస్తరించాల్సిన అవసరముందని ప్రధాని నరేంద్ర మోదీ

Published : 26 Feb 2021 22:23 IST

ప్రధాని మోదీ ఉద్ఘాటన

దిల్లీ: వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అవసరాలను తీర్చడానికి వాణిజ్య-వ్యాపారాలకు ఇచ్చే రుణాలను మరింత విస్తరించాల్సిన అవసరముందని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఆర్థిక సాంకేతిక, అంకుర సంస్థలకు ఇచ్చే ఆర్థిక సహకారాన్ని వాటి అవసరాలకు అనుగుణంగా రూపొందించాలని పిలుపునిచ్చారు. ప్రైవేటు రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని తెలిపారు. అయినప్పటికీ.. పేదలకు మద్దతుగా నిలిచేందుకు బ్యాంకింగ్, బీమా రంగాల్లో ప్రభుత్వం రంగ ఉనికి ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కొవిడ్ మహమ్మారి సమయంలో 90 లక్షల సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి పరిశ్రమల(ఎంఎస్‌ఎంఈ)కు అండగా నిలిచేందుకు రూ.2.4 లక్షల కోట్ల విలువైన రుణాలు అందజేశామని తెలిపారు. బడ్జెట్‌లో ఆర్థిక సేవల రంగానికి చేసిన ప్రతిపాదనలపై శుక్రవారం ఏర్పాటు చేసిన వెబినార్‌లో మోదీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

కిసాన్ క్రెడిట్ సదుపాయంతో చిన్న రైతులు, పశు పశుపోషణలో ఉన్న వారికి లబ్ధి చేకూరిందని మోదీ తెలిపారు. అయితే, ఈ విభాగానికి దన్నుగా నిలిచేందుకు మరింత వినూత్న ఆర్థిక పథకాలపై ప్రైవేటు రంగం దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్థిక సేవల రంగ భవిష్యత్తుపై ప్రభుత్వానికి స్పష్టమైన అవగాహన ఉందని.. దాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరోవైపు బ్యాంకింగ్‌ వ్యవస్థలో ఉన్న పాతకాలపు విధానాలకు స్వస్తి పలకాల్సిన అవసరం ఉందన్నారు. బడ్జెట్‌లో ప్రతిపాదించిన ఆస్తుల పునర్‌వ్యవస్థీకరణ సంస్థలు(ఏఆర్‌సీ) మొండిబకాయిల సమస్యల్ని పరిష్కరించడంలో దోహదం చేస్తాయని తెలిపారు. తద్వారా బ్యాకింగ్‌ వ్యవస్థ మరింత పటిష్ఠంగా తయారవుతుందన్నారు.

ఇవీ చదవండి...

లగేజ్‌ లేకపోతే.. విమాన టికెట్‌పై డిస్కౌంట్‌

ఆరోగ్య బీమా తీసుకుంటున్నారా..?

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని