నాన్‌- బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థ‌ల‌పై ఫిర్యాదుల‌కు...

బ్యాంకింగేత‌ర ఆర్థిక సంస్థ‌ల‌తో స‌మ‌స్య‌లు ఏర్ప‌డితే ఫిర్యాదు చేసేందుకు ఎవ‌రిని సంప్ర‌దించాలో తెలుసుకుందాం..

Published : 15 Dec 2020 21:47 IST

బ్యాంకింగ్‌, బీమా రంగాల్లో వినియోగ‌దారుల ఫిర్యాదుల‌ను స్వీక‌రించే వ్య‌వ‌స్థ లాంటిది బ్యాంకింగేత‌ర ఆర్థిక సంస్థ (నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్‌, NBFC) ల‌కు లేదు. మ‌రి వినియోగ‌దారులు త‌మ ఫిర్యాదుల‌ను ఎవ‌రికి ఇవ్వాలి? బ్యాంకింగేత‌ర సంస్థ‌ల‌కూ ఓ అంబుడ్స్‌మ‌న్ ను తెచ్చే యోచ‌న‌లో ఆర్‌బీఐ ఉంది. అయితే అప్ప‌టిలోగా స‌మ‌స్య‌లు ఏర్ప‌డితే ఫిర్యాదు చేసేందుకు అనేక మార్గాలు ముందున్నాయి. ఎన్‌బీఎఫ్‌సీల‌కు వ్య‌తిరేకంగా ఫిర్యాదు చేసే విధానాన్ని తెలుసుకునే ముందు అస‌లు అవేమిటో తెలుసుకుందాం… ఆ త‌ర్వాత ఫిర్యాదు విధానాన్ని చ‌ర్చిద్దాం…

ఎన్‌బీఎఫ్‌సీ అంటే…

ఆర్‌బీఐ నిర్వ‌చ‌నం ప్ర‌కారం NBFC కంపెనీల చ‌ట్టం, 1956 కింద రిజిస్ట్రేష‌న్ పొంది ఉండాలి. స‌ద‌రు కంపెనీ రుణాలు, అడ్వాన్సులు, షేర్లు, బాండ్లు, డిబెంచ‌ర్లు, లీజింగ్‌, హైరింగ్‌-ప‌ర్చేసింగ్‌, బీమా, చిట్స్ త‌దిత‌ర వ్యాపారాల్లో కార్య‌క‌లాపాలను నిర్వ‌హించుకునేదై ఉండాలి. అయితే ఏదైనా సంస్థ ప్ర‌ధాన వ్యాపారం… వ్య‌వ‌సాయం, పారిశ్రామికం, వ‌స్తువుల కొనుగోలు-అమ్మ‌కాలు, స్థిరాస్తి లాంటివి ఉన్న‌ట్ల‌యితే వాటిని ఎన్‌బీఎఫ్‌సీలుగా ప‌రిగ‌ణించ‌జాల‌రు. ఇవి కాకుండా ఏదైనా సంస్థ ప్ర‌ధాన వ్యాపారం… డిపాజిట్ల‌ను ఏక‌మొత్తంలో లేదా వాయిదాల్లో స్వీక‌రించేట‌ట్ట‌యితే దానిని బ్యాంకింగేత‌ర ఆర్థిక సంస్థ‌గా వ్య‌వ‌హ‌రిస్తారు.

కొన్ని ప్ర‌ముఖ ఎన్‌బీఎఫ్‌సీలు …

హౌజింగ్ డెవ‌ల‌ప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేష‌న్‌, రిల‌య‌న్స్ క్యాపిట‌ల్‌, ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్‌, రూర‌ల్ ఎల‌క్ట్రిఫికేష‌న్ కార్పొరేష‌న్‌, చోళ‌మండ‌లం ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఫైనాన్స్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌, బ‌జాజ్ ఫైనాన్స్ లిమిటెడ్‌, భార‌త్ ఫైనాన్షియ‌ల్ ఇన్‌క్యూల‌జ‌న్ లిమిటెడ్‌, ఈక్విటాస్ హోల్డింగ్ లిమిటెడ్‌, ఉజ్జీవ‌న్ ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్ లిమిటెడ్‌.

ఫిర్యాదు విధానం

ర‌క‌ర‌కాల ఎన్‌బీఎఫ్‌సీలు ర‌క‌ర‌కాల సేవ‌ల‌నందిస్తుంటాయి. ప్ర‌తి ఎన్‌బీఎఫ్‌సీ త‌ప్ప‌నిస‌రిగా ఓ ఫిర్యాదుల‌ స్వీక‌ర‌ణ అధికారిని నియ‌మించుకోవాల్సిందిగా ఆర్‌బీఐ ఆదేశించింది. ఆ అధికారి పేరు, సంప్ర‌దించాల్సిన నెంబ‌రు త‌దితర వివ‌రాలు ఎన్‌బీఎఫ్‌సీ ప‌రిస‌ర ప్రాంతాల్లో ప్ర‌ద‌ర్శ‌న‌కు ఉంచాలి. ఇలా ఉంచ‌డం వ‌ల్ల ఫిర్యాదుదారు నేరుగా ఆ అధికారిని సంప్ర‌దించే అవ‌కాశం క‌లుగుతుంది.

ఆర్‌బీఐ వ‌ద్ద‌కు…

ఫిర్యాదుల స్వీక‌ర‌ణ అధికారి మీ స‌మ‌స్య‌ను స‌రైన విధంగా ప‌రిష్క‌రించ‌లేక‌పోతే… స‌మీపంలోని ఆర్‌బీఐ కార్యాల‌యాన్ని సంప్ర‌దించ‌వ‌చ్చు. ఎన్‌బీఎఫ్‌సీ సంస్థ ప‌రిధిలోకి వ‌చ్చే ఆర్‌బీఐ కార్యాల‌య వివ‌రాలు ప్ర‌ద‌ర్శించాల్సి బాధ్య‌త ఆ సంస్థ‌దే.

బ్యాంకుల‌తో అనుబంధంగా ఉన్న‌వాటికి…

బ్యాంకింగేత‌ర ఆర్థిక సంస్థ‌లు సైతం క్రెడిట్ కార్డుల‌ను జారీచేస్తుంటాయి. ముఖ్యంగా బ్యాంకుల‌కు అనుబంధంగా ప‌నిచేసే ఎన్‌బీఎఫ్‌సీలు ఈ ప‌నిచేస్తుంటాయి. ఏదైనా ఎన్‌బీఎఫ్‌సీ క్రెడిట్ కార్డు సేవ‌లనందిస్తుంటే అప్పుడు ఫిర్యాదు విధానంలో చిన్న మార్పు ఉంటుంది. అదేమిటంటే… ఎన్‌బీఎఫ్‌సీ వ‌ద్ద ఫిర్యాదు చేసి 30 రోజులైనా స‌రైన ప‌రిష్కారం ల‌భించ‌క‌పోతే అప్పుడు బ్యాంకింగ్ అంబుడ్స్‌మ‌న్ సంప్ర‌దించాలి. మాములు ప‌రిస్థితిలో ఆర్‌బీఐని సంప్ర‌దించాలి. ఇక్క‌డ మాత్రం బ్యాంకింగ్ అంబుడ్స్‌మ‌న్‌ను. అన్ని బ్యాంకు వెబ్‌సైట్ల‌లో బ్యాంకింగ్ అంబుడ్స్‌మ‌న్ సంప్ర‌దింపు వివ‌రాలు ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని