GST collections: జూన్‌లోనూ భారీగా జీఎస్‌టీ వసూళ్లు.. గతేడాదితో పోలిస్తే 56% జంప్‌

వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు మరోసారి భారీ ఎత్తున నమోదయ్యాయి....

Published : 01 Jul 2022 15:47 IST

దిల్లీ: వస్తు సేవల పన్ను (GST collections) వసూళ్లు మరోసారి భారీ ఎత్తున నమోదయ్యాయి. 2022 జూన్‌లో జీఎస్‌టీ వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 56 శాతం పెరిగి రూ.1.44 లక్షల కోట్లకు చేరినట్లు కేంద్ర ఆర్థికశాఖ శుక్రవారం వెల్లడించింది. మే నెల రూ.1.41 లక్షల కోట్లు వసూలవ్వగా.. జూన్‌లో అంతకుమించి పన్ను వసూళ్లు నమోదయ్యాయి.

2022 మార్చి నుంచి జీఎస్‌టీ వసూళ్లు రూ.1.40 లక్షల కోట్లపైనే నమోదవుతుండడం విశేషం. మరోవైపు 2021 ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు రెండు నెలలు మినహాయించి అన్ని నెలల్లో వసూళ్లు రూ.లక్ష కోట్లను మించాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో జీఎస్‌టీ వసూళ్లు రికార్డు స్థాయిలో రూ.1.67 లక్షల కోట్లుగా నమోదైన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈ నెల వసూళ్లే రెండో అత్యధికం. పన్ను ఎగవేతదారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవడానికి తోడు వ్యాపార కార్యకలాపాలు పుంజుకోవడం వల్ల వసూళ్లు పెరిగినట్లు ఆర్థిక శాఖ తెలిపింది.  

2022 జూన్‌ జీఎస్‌టీ పంపకాల తీరిదీ..

గత నెలలో వసూలైన రూ.1.44 లక్షల కోట్ల స్థూల వసూళ్లలో సీజీఎస్‌టీ కింద (కేంద్రానికి) రూ.25,306 కోట్లు, ఎస్‌జీఎస్‌టీ కింద (రాష్ట్రాలకు) రూ.32,406 కోట్లు, ఐజీఎస్‌టీ కింద రూ.75,887 కోట్లు, సెస్‌ వాటా రూ.11,018 కోట్లుగా ఉంది. ఐజీఎస్‌టీలో వచ్చిన మొత్తంలో రూ.29,588 కోట్లు సీజీఎస్‌టీ కింద, రూ.24,235 కోట్లు ఎస్‌జీఎస్‌టీ సర్దుబాటుచేసింది. ఫలితంగా కేంద్రానికి రూ.68,394 కోట్లు, రాష్ట్రాలకు రూ.70,141 కోట్లు దక్కాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని