GST collections: మరోసారి భారీగా జీఎస్టీ వసూళ్లు

GST collections in May: మే నెలలో రూ.1.57 లక్షల కోట్ల మేర జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఇది 12 శాతం అధికం.

Updated : 01 Jun 2023 17:13 IST

దిల్లీ: దేశంలో మరోసారి వస్తు, సేవల పన్ను వసూళ్లు (GST Collections) భారీగా నమోదయ్యాయి. మే నెలకు గానూ మొత్తం రూ.1,57,090 కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ (Finance ministry) గురువారం తెలిపింది. గతేడాది మే నెలతో పోలిస్తే ఈ మొత్తం 12 శాతం అధికం. గతేడాది ఈ మొత్తం రూ.1,40,885 కోట్లుగా ఉంది.

మొత్తం జీఎస్టీ వసూళ్లలో సీజీఎస్టీ కింద రూ.28,411 కోట్లు కాగా.. ఎస్‌జీఎస్టీ కింద రూ. 35,828 కోట్లు, ఐజీజీఎస్టీ కింద రూ.81,363 కోట్లు వసూలైనట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. సెస్సుల రూపంలో మరో రూ.11,489 కోట్లుగా వసూలైనట్లు తెలిపింది. అంతకుముందు ఏప్రిల్‌ నెలలో అత్యధికంగా రూ.1.87 లక్షల కోట్ల మేర వసూళ్లు నమోదైన సంగతి తెలిసిందే.

తెలుగు రాష్ట్రాల వసూళ్లు ఇలా..

జీఎస్టీ వసూళ్ల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి. గతేడాది మే నెలలో ఆంధ్రప్రదేశ్‌ రూ.3047 కోట్ల మేర జీఎస్టీ వసూళ్లు సాధించగా.. ఈ ఏడాది మే నెలలో రూ.3373 కోట్లు వచ్చాయి. 11 శాతం  వృద్ధి నమోదైంది. తెలంగాణ గతేడాది రూ.3982 కోట్ల మేర వసూళ్లు సాధించగా.. ఈ ఏడాది మే నెలలో 13 శాతం వృద్ధితో రూ.4507 కోట్ల వసూళ్లు నమోదు చేసింది. ఈ విషయంలో ఎప్పటిలానే 16 శాతం వృద్ధితో మహారాష్ట్ర 23,536 కోట్ల మేర వసూళ్లను సాధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని