GST collection: అదరగొట్టిన జీఎస్టీ వసూళ్లు.. వరుసగా ఆరో నెలా ₹1.40 లక్షల కోట్లపైనే

GST collection in august 2022: దేశంలో వస్తు సేవల పన్ను వసూళ్లు (GST) మరోసారి రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఆగస్టు నెలకు గానూ రూ.1,43,612 కోట్లుగా నమోదైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

Published : 01 Sep 2022 13:11 IST

దిల్లీ: దేశంలో వస్తు సేవల పన్ను వసూళ్లు (GST) మరోసారి రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఆగస్టు నెలకు గానూ రూ.1,43,612 కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. గతేడాదితో పోలిస్తే 28 శాతం వృద్ధి నమోదు కాగా.. జులై నెలతో పోల్చినప్పుడు 4 శాతం వృద్ధి కనిపించింది. గతేడాది ఆగస్టులో జీఎస్టీ వసూళ్లు రూ.1,12,020 కోట్లుగా నమోదయ్యాయి. జీఎస్టీ వసూళ్లు రూ.1.40 లక్షల కోట్లపైన నమోదు అవ్వడం వరుసగా ఇది ఆరోసారి కావడం గమనార్హం.

ఆగస్టు నెల జీఎస్టీ వసూళ్లలో రూ.24,710 కోట్లు సీజీఎస్టీ కాగా.. రూ.30,951 కోట్లు ఎస్‌జీఎస్టీ రూపంలో వచ్చాయి. రూ.77,782 కోట్లు ఐజీఎస్టీ రూపంలో వసూలు కాగా.. సెస్సుల రూపంలో మరో రూ.10,168 కోట్లు సమకూరినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి ఐదు నెలల్లో రూ.7.46 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైంది. గతేడాది తొలి ఐదు నెలలతో పోలిస్తే ఈ మొత్తం 33 శాతం అధికం. ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుందని చెప్పడానికి ఈ అంకెలు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. జీఎస్టీ కౌన్సిల్‌ తీసుకున్న పలు చర్యలు, ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం.. భారీ స్థాయిలో జీఎస్టీ వసూళ్లకు దోహదం చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఏపీ, తెలంగాణలో ఇలా..

ఇక రాష్ట్రాల పరంగా వసూళ్లు చూసినప్పుడు ఏపీలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది వసూళ్లు 22 శాతం మేర పెరిగాయి. గతేడాది ఆగస్టులో ఏపీలో రూ.2,591 కోట్లుగా ఉన్న వసూళ్లు ఈ ఏడాది రూ.3,173 కోట్లకు పెరిగాయి. అదే సమయంలో తెలంగాణలో గతేడాది రూ.3,526 కోట్లుగా ఉన్న వసూళ్లు 10 శాతం వృద్ధితో రూ.3,871 కోట్లుగా నమోదయ్యాయి. వృద్ధి పరంగా ఏపీ, వసూళ్ల పరంగా తెలంగాణ ముందంజలో నిలిచాయి. రాష్ట్రాలన్నింటిలో కెల్లా మహారాష్ట్ర అత్యధిక వసూళ్లు సాధించింది. గతేడాది రూ.15,175 కోట్లుగా ఉన్న ఆ రాష్ట్ర జీఎస్టీ వసూళ్లు..  ఈ ఏడాది రూ.18,863 కోట్లకు పెరిగాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని