GST Collections: భారీగా జీఎస్టీ వసూళ్లు.. మళ్లీ ₹1.50 లక్షల కోట్లపైనే

GST collections in October: దేశంలో వస్తు, సేవల పన్ను (GST) వసూళ్లు మరోసారి భారీగా నమోదయ్యాయి. అక్టోబర్‌ నెలకు గానూ రూ.1,51,718 కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

Published : 01 Nov 2022 13:10 IST

దిల్లీ: దేశంలో వస్తు, సేవల పన్ను (GST) వసూళ్లు మరోసారి భారీగా నమోదయ్యాయి. అక్టోబర్‌ నెలకు గానూ రూ.1,51,718 కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. గతేడాదితో పోలిస్తే వసూళ్లు 16.6 శాతం మేర పెరగడం గమనార్హం. గతేడాది ఇదే సమయంలో రూ.1.30 లక్షల కోట్ల మేర జీఎస్టీ వసూళ్లు జరిగాయి. తాజా వసూళ్లలో సీజీఎస్టీ కింద రూ.26,039 కోట్లు.. ఎస్‌జీఎస్టీ కింద రూ. 33,396 కోట్లు వసూలైనట్లు కేంద్రం తెలిపింది. ఐజీఎస్టీ కింద రూ.81,778 కోట్లు సమకూరినట్లు పేర్కొంది. రూ.10,505 కోట్లు సెస్సుల రూపంలో వసూలైనట్లు వెల్లడించింది.

జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఈ ఏడాది ఏప్రిల్‌లో అత్యధిక వసూళ్లు నమోదయ్యాయి. ఆ నెలలో రూ.1.67 లక్షల కోట్లు జీఎస్టీ వసూళ్లు జరిగాయి. వసూళ్ల పరంగా అక్టోబర్‌ నెల రెండో స్థానంలో నిలిచింది. మరోవైపు రూ.1.4 లక్షల కోట్లపైన జీఎస్టీ వసూళ్లు నమోదవ్వడం ఇది వరుసగా ఎనిమిదోసారి. జీఎస్టీ అమల్లోకి వచ్చాక తొమ్మిదో సారి కావడం గమనార్హం.

ఏపీ 24 శాతం.. తెలంగాణ 11 శాతం

ఇక తెలుగు రాష్ట్రాల జీఎస్టీ వసూళ్ల విషయానికొస్తే.. ఏపీలో గతేడాది ఇదే నెలలో రూ.2,879 కోట్లు వసూళ్లు జరగ్గా.. ఈ ఏడాది రూ.3,579 కోట్లు వసూలైనట్లు కేంద్రం తెలిపింది. గతేడాదితో పోలిస్తే జీఎస్టీ వసూళ్లలో 24% వృద్ధి నమోదైంది. తెలంగాణలో గతేడాది అక్టోబర్‌లో రూ.3,854 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది 11 శాతం అధికంగా రూ.4,284 కోట్ల వసూళ్లు జరిగినట్లు కేంద్రం తెలిపింది. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్ర ఈ విషయంలో ముందుంది. ఆ రాష్ట్రం గతేడాది రూ.19,355 కోట్ల జీఎస్టీ వసూళ్లను నమోదు చేయగా.. ఈ ఏడాది 19 శాతం వృద్ధితో రూ.23,037 కోట్ల వసూళ్లను సాధించి తొలి స్థానంలో నిలిచింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని