GST Collection: వరుసగా ఏడో నెల.. జీఎస్టీ వసూళ్లు ₹1.40 లక్షల కోట్లపైనే

సెప్టెంబరు నెలకు గానూ వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం విడుదల చేసింది. 

Published : 01 Oct 2022 14:26 IST

దిల్లీ: దేశంలో వస్తు సేవల పన్ను వసూళ్లు (GST) మరోసారి రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. సెప్టెంబరు నెలకు గానూ రూ.1,47,686  కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ శనివారం వెల్లడించింది. గతేడాది సెప్టెంబరు నెలతో పోలిస్తే 26శాతం వృద్ధి నమోదైంది. కాగా.. జీఎస్టీ వసూళ్లు రూ.1.40 లక్షల కోట్లపైన నమోదవ్వడం వరుసగా ఇది ఏడోసారి కావడం విశేషం. జీఎస్టీ కౌన్సిల్‌ తీసుకున్న పలు చర్యలు, ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం.. భారీ స్థాయిలో జీఎస్టీ వసూళ్లకు దోహదం చేసినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది.

సెప్టెంబరు నెల జీఎస్టీ వసూళ్లలో సీజీఎస్టీ రూ.25,271 కోట్లు కాగా.. రూ.31,813 కోట్లు ఎస్‌జీఎస్టీ రూపంలో వచ్చాయి. ఇంటిగ్రేటెడ్‌ జీఎస్టీ రూ.80,464 కోట్లు, సెస్‌ రూపంలో మరో రూ.10,137 కోట్లు సమకూరినట్లు ఆర్థికశాఖ వెల్లడించింది. గత నెలలో దిగుమతుల ద్వారా వచ్చిన ఆదాయం 39శాతం పెరిగిందని, ఇక దేశీయ లావాదేవీల ఆదాయంలో 22శాతం వృద్ధి నమోదైందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

తెలుగు రాష్ట్రాల్లో ఇలా..

ఇక రాష్ట్రాల పరంగా వసూళ్లు చూసినప్పుడు తెలంగాణలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది వసూళ్లు 12శాతం పెరిగాయి. తెలంగాణలో 2021 సెప్టెంబరులో రూ.3,494కోట్లుగా ఉన్న ఈ వసూళ్లు.. గత నెలలో రూ.3,915కోట్లుగా నమోదయ్యాయి. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో జీఎస్టీ వసూళ్లలో 21శాతం వృద్ధి కన్పించింది. ఏపీలో గతేడాది సెప్టెంబరులో రూ.2,595కోట్లుగా ఉన్న వసూళ్లు.. గత నెలలో రూ.3,132కోట్లకు పెరిగాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని