GST compensation cess: జీఎస్టీ పరిహార సెస్సు మరో నాలుగేళ్లు

జీఎస్టీ పరిహార సెస్సు (GST compensation cess) విధింపు గడువును ప్రభుత్వం మరో నాలుగేళ్లు పొడిగించింది....

Published : 25 Jun 2022 14:12 IST

దిల్లీ: జీఎస్టీ పరిహార సెస్సు (GST compensation cess) విధింపు గడువును ప్రభుత్వం మరో నాలుగేళ్లు పొడిగించింది. దీంతో మార్చి 31, 2026 వరకు పరిహార సెస్సు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు కొత్త నిబంధనలను శనివారం కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫై చేసింది.

వాస్తవానికి ఈ నెల 30తో సెస్సు విధింపునకు స్వస్తి పలకాల్సి ఉంది. కానీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన భేటీ అయిన జీఎస్టీ మండలి (GST Council) మాత్రం దీన్ని మరింతకాలం వసూలు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రాలకు పరిహారం చెల్లించేందుకు కేంద్రం గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో రుణాలు తీసుకుంది. దీంతో అవి తీరే వరకు సెస్సును కొనసాగించాలని మండలి తీర్మానించింది. మరోవైపు జీఎస్టీ అమలు వల్ల రాష్ట్రాలు ఆదాయాలు కోల్పోతే కేంద్రం చెల్లించాల్సిన పరిహార గడువు మాత్రం ఈ నెల 30తో ముగియనున్నట్లు సీతారామన్‌ గతంలోనే స్పష్టం చేశారు.

రాష్ట్రాలకు పరిహారం చెల్లించడానికి కేంద్రం 2020-21లో రూ.1.1 లక్షల కోట్లు, 2021-22లో రూ.1.59 లక్షల కోట్లు అప్పుగా తీసుకుంది. గత ఆర్థిక సంవత్సరం రూ.7,500 కోట్లు వడ్డీ కింద చెల్లించింది. మరో రూ.14,000 కోట్లు ఈ ఏడాది చెల్లించాల్సి ఉంది. 2023-24 నుంచి అసలును చెల్లించడం ప్రారంభించి మార్చి 2026 వరకు పూర్తి చేయాల్సి ఉంది.

సెస్సు కొనసాగింపు వల్ల పొగాకు, సిగరెట్లు, హుక్కా, ఏరేటెడ్‌ వాటర్స్‌, ప్రీమియం మోటార్‌ సైకిళ్లు, విమానాలు వంటి వాటి ధరలు అధికంగా ఉండనున్నాయి. మరోవైపు ఈ నిర్ణయం వల్ల వ్యాపారాలపై భారం కొనసాగుతుందని వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని