GST: ఇక మూడు శ్లాబులే.. జీఎస్టీ కౌన్సిల్‌ మొగ్గు..?

వస్తు, సేవల పన్ను (GST) శ్లాబుల హేతుబద్ధీకరణ సహా మరికొన్ని కీలక మార్పులకు జీఎస్టీ మండలి (GST Council) సిద్ధమవుతున్నట్లు సమాచారం....

Updated : 06 Mar 2022 16:56 IST

దిల్లీ: వస్తు, సేవల పన్ను (GST) శ్లాబుల హేతుబద్ధీకరణ సహా మరికొన్ని కీలక మార్పులకు జీఎస్టీ మండలి (GST Council) సిద్ధమవుతున్నట్లు సమాచారం. తద్వారా ఆదాయాలు పెరిగి రాష్ట్రాలు కేంద్రంపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఓ నివేదికను పలు రాష్ట్రాల ఆర్థిక మంత్రుల బృందం ఈ నెలాఖరులో మండలికి సమర్పించనున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ ఉన్నతాధికారి తెలిపారు.

5% నుంచి 8%..

ప్రస్తుతం జీఎస్టీలో 5, 12, 18, 28 శాతం పన్ను శ్లాబులు ఉన్నాయి. దీంట్లో 5 శాతం శ్లాబును 8 శాతానికి పెంచాలని మంత్రుల బృందం సూచించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 12 శాతం పన్ను రేటును పూర్తిగా తొలగించి.. ఆ పరిధిలో ఉన్న వస్తువులను 18 శాతం శ్లాబులోకి తీసుకురావాలని ప్రతిపాదించినట్లు సమాచారం. ప్రస్తుతం అత్యవసర వస్తువులన్నీ అతి తక్కువ పన్ను శ్లాబైన ఐదు శాతం పరిధిలో ఉన్నాయి. విలాస వస్తువులకు 28 శాతం జీఎస్టీ వర్తిస్తోంది. కొన్ని అత్యంత విలాసవంతమైన వస్తువులు, ‘సిన్‌ గూడ్స్‌’పై అదనంగా సెస్‌ కూడా విధిస్తున్నారు. ఫలితంగా వచ్చిన ఆదాయాన్ని జీఎస్టీ అమలు వల్ల నష్టపోతున్న రాష్ట్రాలకు పరిహారంగా అందజేస్తున్నారు.

ఆదాయం ఎంత పెరుగుతుంది?

5 శాతం శ్లాబుని 8 శాతానికి పెంచడం వల్ల ప్రభుత్వానికి ఏటా అదనంగా రూ.1.50 లక్షల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని మంత్రుల బృందం నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జీఎస్టీ లెక్కల ప్రకారం.. అతి తక్కువ పన్ను శ్లాబును 1 శాతం పెంచితే అదనంగా రూ.50 వేల కోట్ల ఆదాయం సమకూరుతుంది. మరోవైపు జీఎస్టీ మినహాయింపు వర్తిస్తున్న వస్తువుల సంఖ్యను సైతం తగ్గించాలని మంత్రుల బృందం ప్రతిపాదించినట్లు సమాచారం. ప్యాక్‌ చేయని, బ్రాండెడ్‌ కాని ఆహార, డైరీ ఉత్పత్తులకు ప్రస్తుతం జీఎస్టీ నుంచి మినహాయింపు లభిస్తోంది.

జూన్‌తో పరిహారానికి స్వస్తి..

ఈ ప్రతిపాదనలకు సంబంధించిన నివేదికపై చర్చించేందుకు జీఎస్టీ మండలి ఈ నెలాఖరు లేదా వచ్చే నెల ఆరంభంలో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. జీఎస్టీ అమలు వల్ల రాష్ట్రాలు కోల్పోయే ఆదాయాన్ని కేంద్రం ప్రస్తుతం పరిహారం కింద చెల్లిస్తోంది. ఈ ప్రక్రియకు జూన్‌తో గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు ఇకపై నిధుల కోసం కేంద్రంపై ఆధారపడకుండా.. స్వయంసమృద్ధి సాధించాలన్న ఉద్దేశంతనే ఈ మార్పులను ప్రతిపాదించినట్లు సమాచారం.

గతేడాదే కమిటీ ఏర్పాటు..

జులై 1, 2017న జీఎస్టీ చట్టం అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ఐదేళ్లు అంటే జూన్‌, 2022 వరకు జీఎస్టీ అమలు వల్ల ఆదాయాన్ని నష్టపోయిన రాష్ట్రాలకు పరిహారం చెల్లిస్తామని కేంద్రం తెలిపింది. దీనికి 2015-16 నాటి రాష్ట్రాల ఆదాయాన్ని ఆధారంతో ఏటా 14 శాతం వృద్ధిని పరిగణనలోకి తీసుకొని నష్టాన్ని లెక్కిస్తామని తెలిపింది. అయితే గత ఐదేళ్లలో పరిశ్రమ, వ్యాపార వర్గాల డిమాండ్‌తో పలు వస్తువులపై జీఎస్టీ రేట్లను తగ్గించాల్సి వచ్చింది. దీంతో ఆదాయం తగ్గి రాష్ట్రాలకు లోటు ఏర్పడింది. తొలుత 28 శాతం పరిధిలో ఉన్న వస్తువుల సంఖ్య 228గా ఉండగా.. ఇప్పుడది 35కు తగ్గింది. ఈ నేపథ్యంలో రేట్లను హేతుబద్ధీకరించాలన్న డిమాండ్‌ పెరిగింది. దీంతో దీనిపై అధ్యయనం చేసి నివేదికను సమర్పించాలని కోరుతూ కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై నేతృత్వంలో జీఎస్టీ మండలి గత ఏడాది ఓ కమిటీని ఏర్పాటు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని