GST Council meet: జీఎస్‌టీ మండలి సమావేశం 22న

ఎనిమిది నెలల విరామం తర్వాత జీఎస్‌టీ మండలి సమావేశం ఈనెల 22న జరగనుంది.

Published : 14 Jun 2024 02:06 IST

 8 నెలల విరామం తర్వాత
ఆన్‌లైన్‌ గేమింగ్‌కు 28% పన్ను అమలుపై సమీక్ష

దిల్లీ: ఎనిమిది నెలల విరామం తర్వాత జీఎస్‌టీ మండలి సమావేశం ఈనెల 22న జరగనుంది. ఆన్‌లైన్‌ గేమింగ్‌ రంగానికి 28% జీఎస్‌టీ అమలుపై ఇందులో సమీక్షించే అవకాశం ఉంది. ‘కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నేతృత్వంలోని జీఎస్‌టీ మండలి 53వ సమావేశం జూన్‌ 22న దిల్లీలో జరుగుతుంద’ని జీఎస్‌టీ మండలి కార్యాలయం వెల్లడించింది. జీఎస్‌టీ మండలి 52వ సమావేశం 2023 అక్టోబరు 7న జరిగింది. 53వ సమావేశంలో చర్చించే అంశాల వివరాలు మండలి సభ్యులకు ఇంకా చేరాల్సి ఉంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత జీఎస్‌టీ మండలి తొలి సమావేశం ఇదే. 

ఆన్‌లైన్‌ గేమింగ్‌ రంగంపై 28% జీఎస్‌టీ 2023 అక్టోబరు 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఆరు నెలల తర్వాత అంటే 2024 ఏప్రిల్‌లో దీనిపై సమీక్ష జరుపుతామని అప్పట్లో జీఎస్‌టీ మండలి తెలిపింది. కానీ సార్వత్రిక ఎన్నికల కారణంగా ఏప్రిల్‌ నుంచి జీఎస్‌టీ మండలి సమావేశం జరగలేదు. అందువల్లే జూన్‌ 22న జరిగే సమావేశంలో దీనిపై సమీక్ష జరగొచ్చని భావిస్తున్నారు. ఇదే కాకుండా పన్ను రేట్ల హేతుబద్దీకరణ అంశం కూడా జీఎస్‌టీ మండలి వద్ద పెండింగ్‌లో ఉంది. రేట్ల హేతుబద్దీకరణపై సూచనలు ఇచ్చేందుకు ఉత్తరప్రదేశ్‌ ఆర్థిక మంత్రి సురేశ్‌ కుమార్‌ కన్నా నేతృత్వంలో ఒక కమిటీని గతంలో ఏర్పాటు చేశారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసేలా తుది నివేదిక సమర్పించేందుకు కమిటీకి తాజా సమావేశంలో గడువు నిర్దేశించే అవకాశాలున్నాయి. జౌళి, ఎరువులకు ఇన్‌వర్టెడ్‌ సుంకం (తుది ఉత్పత్తిపై కంటే ముడి సరుకు పైనే పన్ను రేట్లు ఎక్కువగా ఉండటం) అంశం పైనా చర్చించే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని