GST Collections: మే నెలలో జీఎస్టీ వసూళ్లు ఎంతో తెలుసా?

మే నెలకు సంబంధించిన వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లను కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. 2022 మే నెలలో దాదాపు......

Published : 01 Jun 2022 16:28 IST

దిల్లీ: మే నెలకు సంబంధించిన వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్ల వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. 2022 మే నెలలో దాదాపు 1.41లక్షల కోట్లు మార్కును చేరినట్టు ప్రకటించింది. ఆల్‌టైం రికార్డుగా నమోదైన ఏప్రిల్‌తో పోల్చి చూస్తే వసూళ్లు తగ్గినప్పటికీ.. క్రితం ఏడాది మే నెలతో (రూ.97,821కోట్లు) పోలిస్తే మాత్రం 44శాతం పెరిగినట్టు ఆర్థికశాఖ వెల్లడించింది. ఇదిలా ఉండగా.. జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి జీఎస్టీ వసూళ్లు రూ.1.40లక్షల కోట్ల మార్కును దాటడం ఇది నాలుగోసారి కావడం విశేషం. గతేడాది మేలో రూ.1,40,885 కోట్లు వసూలు కాగా.. ఆ తర్వాత 2022 జనవరిలో రూ.1,40,986 కోట్లు, మార్చిలో రూ.1,42,095 కోట్లు వసూలయ్యాయి. తాజాగా మే నెలలో రూ.1,40,885 కోట్లు వసూలైంది. మరోవైపు గత నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1.68లక్షల కోట్లతో ఆల్‌టైం రికార్డుగా నిలిచిన విషయం తెలిసిందే. 

మే నెలకుగాను వసూలైన మొత్తం జీఎస్టీ (రూ.1,40,885)లో సీజీఎస్టీ కింద 25,036 కోట్లు, ఎస్‌జీఎస్టీ కింద రూ.32,001 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ.73,345 కోట్లుగా ఉన్నట్టు కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది. ఇవికాకుండా సెస్‌ కింద మరో రూ.10,502కోట్లు వచ్చినట్టు పేర్కొంది. గతేడాది మే నెలలో 97,821 కోట్లు ఆదాయం లభించింది. ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్‌తో పోలిస్తే మే నెలలో ఎప్పుడూ వసూళ్లు తక్కువగానే ఉంటాయని తెలిపింది. అయితే, ఈ నెలలో కూడా మొత్తం జీఎస్టీ రాబడి రూ.1.40లక్షల కోట్లు మార్కును అధిగమించడం ప్రోత్సాహకరంగానే ఉన్నట్టు పేర్కొంది. మరోవైపు, ఏప్రిల్‌ నెలలో 7.4 కోట్ల ఈ-వేబిల్లులు ఉత్పత్తి అయ్యాయి. మార్చి నెలలో జనరేట్‌ అయిన 7.7కోట్ల ఈ-వేబిల్లులతో పోలిస్తే 4శాతం తక్కువ.

తెలుగు రాష్ట్రాల్లోనూ జీఎస్టీ వసూళ్లు పెరిగాయి. ఏపీలో 2021 మే నెల(2,074కోట్లు)తో పోలిస్తే ఈసారి (రూ.3047 కోట్లు) 47శాతం; తెలంగాణలో గతేడాది మే నెల(రూ.2,984కోట్లు)తో పోలిస్తే ఈసారి 33శాతం (రూ.3,982 కోట్లు) వసూళ్లు పెరిగాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని