Investments: ఈ అలవాట్లే మన సంపదను పెంచుతాయి!

మన ఆర్థిక లక్ష్యాలు SMARTగా ఉండాలి. వీటితో పాటు కొన్ని అంశాలను అలవర్చుకుంటే.. మన లక్ష్యాలను తొందరగా సాధించేందుకు అవకాశం ఉంటుంది.

Updated : 06 Jan 2023 12:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొత్త సంవత్సరం అంటే కొత్త ఆరంభం. సాధించాల్సిన లక్ష్యాలనూ కొత్తగా నిర్దేశించుకోవాల్సిన సమయం. డబ్బు విషయంలోనూ స్పష్టమైన టార్గెట్‌ను సెట్‌ చేసుకోవాలి. ఏదేమైనా కొత్త సంవత్సరం తీర్మానాలు (New Year Resolutions) చేసుకోవడం సులువే. కానీ, వాటిని సాధించడమే అసలైన సవాల్‌. మరి 2023లో మన ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి అలవాటు చేసుకోవాల్సిన కొన్ని అంశాలను చూద్దాం..

లక్ష్యాలు SMARTగా ఉండాలి...

2023లో మీరు అనుకున్న లక్ష్యాలను సాధించాలంటే అవి స్మార్ట్‌ (SMART)గా ఉండాలి. అంటే మన లక్ష్యాలు నిర్దిష్టంగా (Specific), లెక్కకు అందే పరిమితిగల (Measurable), సాధించదగిన (attainable), పొంతన కుదిరిన (relevant), కాలపరిమితి (Time-bound)తో కూడినవిగా ఉండాలి. విదేశీయానం, పిల్లల ఉన్నత చదువులు, రిటైర్‌మెంట్‌ నిధి.. ఇలా నిర్దిష్టమైన లక్ష్యాలను ఏర్పరచుకోవాలి. వాటిని సాధించడానికి ఎంత డబ్బు కావాలో కూడా అంచనా వేయగలగాలి. అవసరమయ్యే ఇతర ఏర్పాట్లను కూడా ఏర్పాటు చేసుకోగలగాలి. అలాగే మీ జీవితం, కుటుంబానికి సంబంధం లేని లక్ష్యాల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. పైగా ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక నిర్దిష్ట సమయాన్ని సెట్‌ చేసుకోవాలి. ఇలా గోల్స్‌ స్మార్ట్‌గా ఉంటే మనం ఒక సమగ్ర ఆర్థిక ప్రణాళికను వేసుకోగలుగుతాం. దాన్ని అమల్లో పెట్టి సాధించేందుకు ప్రయత్నం చేస్తాం. అలాగే వీటిని సాధించడానికి కావాల్సిన చర్యలను తీసుకుంటాం.

డబ్బే డబ్బును సంపాదిస్తుంది..

డబ్బు వృద్ధి చెందాలంటే ఇన్వెస్ట్‌ చేయడం ఒకటే మార్గం. ఇది మనందరికీ తెలుసు. అయితే, పెట్టుబడి విషయంలో అందరూ అనుసరిస్తున్న మార్గాన్ని గుడ్డిగా ఫాలో అయితే ఉపయోగం ఉండదు. మీరు ఎంత వరకు నష్టభయాన్ని భరించగలరో అంచనా వేసుకోవాలి. తదనుగుణంగా మీకు కావాల్సిన రాబడినిచ్చే మార్గాలేంటో చూసుకోవాలి. వాటిలో మదుపు చేయాలి. తక్కువ మొత్తంలో అయినా.. సిప్‌ వంటి సాధనాలతో ప్రారంభిస్తే దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో పోగేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకేసారి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేకుండా క్రమం తప్పని మార్గాలను ఎంచుకుంటే భారం కూడా ఉండదు. పైగా ఆర్థిక క్రమశిక్షణ అలవడుతుంది. దీర్ఘకాల లక్ష్యాల కోసం ద్రవ్యోల్బణాన్ని అధిగమించే మార్గాలను అన్వేషించాలి. ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లు, యులిప్స్‌.. అందుకు అనువుగా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. దీర్ఘకాలంలో స్టాక్‌ మార్కెట్‌ కూడా మంచి రాబడిస్తున్నప్పటికీ.. ఇది చాలా నష్టభయంతో కూడుకొన్న వ్యవహారం. దాన్ని భరించగలిగే స్తోమత ఉంటేనే ఆ దిశగా అడుగు వేయాలి.

ఖర్చులపై కచ్చితంగా ఉండాలి..

మీకు నెలకు ఎంత ఆదాయం వస్తోంది? దీంట్లో విద్యుత్తు, ఇంటర్నెట్‌, నిత్యావసరాలు, ఫోన్‌ బిల్లులకు ఎంత పోతుంది? నెలలో ఎన్నిసార్లు రెస్టరెంట్‌, సినిమాకు వెళతారు? ఆర్థిక లక్ష్యాలను అనుకున్న సమయంలోగా చేరుకోవాలంటే వీటన్నింటినీ ట్రాక్‌ చేయాలి. మీరు నెలకు ఎంత మిగులుస్తున్నారనే దానిపైనే.. మీరు ఎంత త్వరగా ఆర్థిక స్థిరత్వాన్ని సాధిస్తారనేది ఆధారపడి ఉంటుంది. మన ఖర్చులు, ఆదాయాన్ని ట్రాక్‌ చేయడానికి ఇప్పుడు అనేక మొబైల్‌ యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిని సమర్థంగా ఉపయోగించుకొని ఎక్కడ ఎక్కువ ఖర్చు చేస్తున్నారో తెలుసుకొని వాటిని తగ్గించుకోవచ్చు.

అప్పులను చెల్లించేయాలి..

చాలా మంది క్రెడిట్‌ కార్డు, వ్యక్తిగత రుణం, గృహరుణం, వాహన రుణం.. ఇలా ఏదో రకమైన లోన్‌ తీసుకుంటున్నారు. ఏ కొత్త రుణం తీసుకోవాలనుకున్నా.. మీ నెలవారీ వాయిదాల మొత్తం మీ ఆదాయంలో 40 శాతం మించకుండా చూసుకోవాలి. ఈ పరిమితి దాటితే అది మీకు భారంగా మారొచ్చు. ఫలితంగా భవిష్యత్తు ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి మీ చేతిలో సరిపడా డబ్బు ఉండకపోవచ్చు. అందుకే కొత్త సంవత్సరం వేళ వేసుకొని ఆర్థిక ప్రణాళికలోనే రుణాలను తిరిగి చెల్లించడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. వీలైనంత త్వరగా వాటిని ముగించుకోవడానికి ఉన్న మార్గాలను అన్వేషించాలి.

మీ పెట్టుబడులను తరచూ సమీక్షించుకోవాలి..

ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి కేవలం పెట్టుబడి పెట్టి ఊరుకుంటే సరిపోదు. వాటిని తరచూ సమీక్షించుకోవాలి. అవి సరైన ప్రతిఫలం ఇస్తున్నాయో.. లేదో.. ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలి. ఏమైనా మార్పులు అవసరమనుకుంటే అందుకు తగిన చర్యలు తీసుకోవాలి.

వీటన్నింటితో పాటు ఆర్థిక అంశాలపై అవగాహనను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకోవాలి. విపణిలోకి వస్తున్న కొత్త బీమా పథకాలు, మదుపు మార్గాలు, స్థిరాస్తి పోకడలు, స్టాక్‌ మార్కెట్‌ కదలికలు, బంగారం రేట్లు, ఇంధన ధరలు.. ఇలా అన్నింటిపై ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండాలి. అప్పుడే మన ఖర్చులు, ఆదాయం, పెట్టుబడి.. మన ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నాయో.. లేదో.. అర్థమవుతంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని