Adani Group: గౌతమ్‌ అదానీపై ఎంతో గౌరవం ఉంది: ఆస్ట్రేలియా మాజీ ప్రధాని అబాట్‌

Adani Group: హిండెన్‌బర్గ్‌ ఆరోపణల నేపథ్యంలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న తరుణంలో గౌతమ్‌ అదానీ, ఆయన కంపెనీలకు ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ అబాట్‌ మద్దతుగా నిలిచారు.

Published : 02 Mar 2023 19:26 IST

దిల్లీ: అదానీ గ్రూప్‌ (Adani Group) అధినేత గౌతమ్‌ అదానీ (Gautam Adani)తో పాటు ఆయన కంపెనీల పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ అబాట్ అన్నారు. హిండెన్‌బర్గ్‌ నివేదికలోని అంశాలు తనకు పూర్తిగా తెలియవని పేర్కొన్నారు. ఒకవేళ ఏమైనా అవతవకలు జరిగినా.. ఆ అంశాన్ని నియంత్రణా సంస్థలు చూసుకుంటాయని వ్యాఖ్యానించారు.

టోనీ అబాట్‌ తొలి నుంచి అదానీ గ్రూప్‌ (Adani Group) వ్యాపారాలకు మద్దతుగా నిలుస్తూ వస్తున్నారు. 2015లో ఆయన ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో ఆస్ట్రేలియాలోని అదానీ కార్మైకేల్‌ బొగ్గు గనుల ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు వెలువరించింది. అప్పట్లో ఆయన న్యాయస్థానం తీర్పును ఖండిస్తూ అదానీ కంపెనీకి అండగా నిలిచారు. ప్రస్తుతం ఆ బొగ్గు గనులే భారత్‌లో విద్యుదీకరణకు దోహదం చేస్తున్నట్లు అబాట్‌ అన్నారు.

‘‘అదానీ గనులకు నేను పూర్తి మద్దతునిస్తున్నాను. అదానీ, ఆయన బృందానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారు భారత్‌కు విద్యుత్‌ను.. ఆస్ట్రేలియాకు ఉద్యోగాలను అందిస్తున్నారు’’ అని అబాట్‌ అన్నారు. 2015లో స్థానిక న్యాయస్థానమొకటి అదానీ కార్మైకేల్‌ గనుల పర్యావరణ అనుమతులను రద్దు చేసింది. దీన్ని ఖండించిన అబాట్‌ ఇలాంటి పెద్ద ప్రాజెక్టులకు న్యాయపరమైన అడ్డంకులు సృష్టించడం వల్ల విస్తృతస్థాయి ప్రయోజనాలు దెబ్బతింటాయన్నారు. ఎట్టకేలకు 2019లో అదానీ గ్రూప్‌నకు తుది అనుమతులు లభించాయి. అక్కడి నుంచి వెలికితీసిన బొగ్గునే ఇప్పుడు అదానీ గ్రూప్‌ భారత్‌కు సరఫరా చేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని