Financial independence: ఆర్థిక స్వాతంత్య్రం సాధించామా?

వలసవాదం నుంచి మన స్వేచ్ఛను తిరిగి తీసుకునేందుకు ఎంతో కష్టపడ్డాం.. ఇప్పుడూ కొవిడ్‌-19 రూపంలో కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నాం.. ఆరోగ్యంగానూ.. ఆర్థికంగానూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారెందరో.. అయినప్పటికీ.. భవిష్యత్‌పై సానుకూల ఆశతో..స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించుకునేందుకు ఉత్సాహంగా ఉన్నాం..

Updated : 13 Aug 2021 10:02 IST

వలసవాదం నుంచి మన స్వేచ్ఛను తిరిగి తీసుకునేందుకు ఎంతో కష్టపడ్డాం.. ఇప్పుడూ కొవిడ్‌-19 రూపంలో కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నాం.. ఆరోగ్యంగానూ.. ఆర్థికంగానూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారెందరో.. అయినప్పటికీ.. భవిష్యత్‌పై సానుకూల ఆశతో..స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించుకునేందుకు ఉత్సాహంగా ఉన్నాం.. ఈ సమయంలో మనం ఆర్థికంగా స్వేచ్ఛ సాధించామా? అనే ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకోసం ఏం చేయాలో చూద్దామా!

ర్థిక స్వాంతంత్య్రం సాధించడం అంటే.. మీరు.. మీ ప్రియమైన కుటుంబ సభ్యులు ఆరోగ్యంగానూ.. ఆర్థికంగానూ ఎలాంటి ఇబ్బందులూ పడకుండా ఉండాలి. భవిష్యత్తు మీ నియంత్రణలో ఉండాలి. ఆర్థిక భద్రత లేకపోవడం, సంక్షోభంలాంటివి మీకు వినిపించకూడదు. మనందరం ఒకానొక సమయంలో పదవీ విరమణ చేస్తాం.. లేదా ముందస్తు పదవీ విరమణనూ ఎంచుకుంటాం.. ఆ తర్వాతా ఎలాంటి ఇబ్బందులూ లేని ప్రశాంత జీవితం సాధ్యం కావాలి. జీవితంలో ఎన్నో అవాంతరాలు వస్తుంటాయి. వీటన్నింటినీ తట్టుకొని నిలబడాల్సిందే. దానికీ ఆర్థికంగా మనం స్వేచ్ఛను సాధించాల్సిందే.

ఆలోచనతోనే మొదలు..

మనల్ని మనం పరిపాలించుకోవాలి.. అన్న ఆలోచనతోనే కదా.. స్వాతంత్య్ర పోరాటం మొదలయ్యింది. అంటే.. ఎంత పెద్ద సంఘటన అయినా.. చిన్న ఆలోచనతోనే ప్రారంభం అవుతుంది. ఆలోచన నుంచి వాస్తవ రూపం దాల్చేలోపు ఎన్నో సంఘర్షణలు. బలిదానాలు తప్పవు. ఆర్థిక స్వేచ్ఛ విషయంలోనూ ఇదే స్ఫూర్తి. ముందుగా పెట్టుబడులు పెట్టాలనే ఆలోచనకు అంకురార్పణ చేయండి. మీ ఆర్థిక లక్ష్యాల సాధనకు చిన్న మొత్తమైనా పెట్టుబడికి కేటాయించండి. నెలకు రూ.1,000, రూ.1,500లతోనూ మదుపు ప్రారంభించే అవకాశం ఉందని మర్చిపోకండి.  ఈ దశలో కొన్ని త్యాగాలు తప్పవు. అనవసర వృథా ఖర్చులను తగ్గించుకోవడం తప్పనిసరి. మీ ఆదాయాన్ని పొదుపు, ఖర్చులు, పెట్టుబడులు అనే మూడు రకాలుగా వర్గీకరించుకోండి. ఆదాయం పెరుగుతున్న కొద్దీ.. పొదుపు, పెట్టుబడులు పెంచుకుంటూ వెళ్లండి. వ్యయాలను కాదు.

కోరుకుంటేనే చాలదు..

స్వేచ్ఛ కావాలని అందరూ కోరుకున్నారు. కానీ, కొద్దిమంది మాత్రమే దాని కోసం పోరాడారు. అదే విధంగా ఆర్థికంగా ఉన్నత స్థానానికి చేరాలని అందరూ అనుకుంటారు. కానీ, దాన్ని నిజం చేసుకునేందుకు కొందరు మాత్రమే కష్టపడతారు. ఆకాంక్షలను గుర్తించి, వాటిని సాధించేందుకు ఒక కచ్చితమైన ప్రణాళిక ఉండాలి. ఆ తర్వాత దాన్ని సాధనకు పనిచేయాలి. క్రమానుగత పెట్టుబడులతో మీ కలలను నిజం చేసుకోవాలి. మీ అవసరాలకు సరిపోయే పథకాలేమిటి? వాటిని ఎంచుకోవడం వల్ల మీకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి.. ఇలాంటి వాటన్నింటిపైనా కాస్త అవగాహన పెంచుకోవాలి. ఏం చేయాలన్నది తెలియకుండా.. ప్రణాళిక వేసుకుంటే ఉపయోగం ఉండదు.

వైవిధ్యం ఉండేలా..

స్వాతంత్య్రం సాధనలో ఎన్నో రకాల పోరాటాలు జరిగాయి. పెట్టుబడుల్లోనూ ఇది వర్తిస్తుంది. ఒకే పథకం అందరికీ నప్పకపోవచ్చు. పెట్టుబడిని కాపాడుకునేందుకు ఉన్న మొత్తాన్ని వివిధ పథకాలకు కేటాయించడం ఎప్పుడూ మంచిది. ఈక్విటీ, డెట్‌, బంగారం, అంతర్జాతీయ మార్కెట్లు ఇలా అన్ని చోట్లా పెట్టుబడులు ఉండాలి. వ్యవధి, మీ లక్ష్యాలు, నష్టభయం భరించే సామర్థ్యం ఆధారంగా కేటాయింపులు ఉండాలి.

సమయం కోసం వేచి చూడొద్దు..

సమయం ఎప్పుడూ మన కోసం వేచి చూడదు. అదే విధంగా మంచి సమయం అంటూ ఏదీ ఉండదు. ఒక విషయంపై మనకు ఆలోచన వచ్చిన క్షణమే మంచి సమయం. ఎదురుచూస్తూ కూర్చుంటే ఎప్పుడూ మనం ఆర్థికంగా వృద్ధిలోకి వెళ్లలేం. ఉదాహరణకు ప్రస్తుతం స్టాక్‌ మార్కెట్‌ను గమనిస్తే.. జీవన కాల గరిష్ఠాలను చేరుకుంది. తగ్గినప్పుడు భయపడి.. పెరుగుతున్నప్పుడు.. తగ్గుతుందేమో చూద్దాం అనుకుంటూ ఉంటే ఇక మదుపు చేసేది ఎప్పుడు? అందుకే.. పెట్టుబడులకు సంబంధించిన మొదటి అడుగు వేసేందుకు సరైన సందర్భం కోసం చూడకండి.. వాటిని క్రమం తప్పకుండా కొనసాగిస్తూ.. సగటు ప్రయోజనం అందుకునేందుకు ప్రయత్నించాలి. మీ పెట్టుబడుల జాబితాను నిరంతరం పెంచుకుంటూనే ఉండండి. పెట్టుబడి వృద్ధి చెందేందుకు తగినంత సమయం ఇవ్వండి. అప్పుడే అవి మీ ఆర్థిక లక్ష్యాల సాధనకు ఉపయోగపడతాయి.

సమీక్షించుకుంటూ..

కనీసం ఆరు నెలలకోసారి మీ పెట్టుబడులను సమీక్షించుకోవడం ఉత్తమం. రాబడిని అందించడంలో ఏమాత్రం తేడా ఉన్నా.. ఆ పథకాలను వదిలించుకోండి. అవసరాన్ని బట్టి, మార్పులు చేర్పులు చేసుకోండి. ఆర్థిక స్వేచ్ఛను సాధించే దిశగా పెట్టుబడులు పెంచడం, లేదా కొంత మొత్తాన్ని వెనక్కి తీసుకోవడంలాంటివి సమయానుకూలంగా చేస్తుండాలి.

అత్యవసర నిధి.. బీమా...

జీవితం ఎంత అనిశ్చితితో ఉంటుందో మనకు కరోనా చూపించింది. ఎంత ప్రణాళికతో ఉన్నా.. అనుకోని ఆర్థిక అవసరం రావచ్చు. దీనిని తట్టుకునేందుకు ప్రతి వ్యక్తీ కొంత అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాల్సిందే. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కనీసం ఆరు నెలల ఖర్చులకు సరిపడా మొత్తం ఉండాల్సిందే. ఆరోగ్య, జీవిత బీమా పాలసీలు తప్పనిసరి అని గుర్తుంచుకోండి.

అప్పులకు దూరంగా...

ఆర్థిక స్వేచ్ఛకు తొలి శత్రువు అప్పులు. విలువ పెంచే అప్పులతో ఎప్పుడూ ప్రయోజనమే. అంటే.. గృహరుణం లాంటివి. కానీ.. కేవలం ఖర్చు పెట్టాలనుకొని తీసుకునే వ్యక్తిగత రుణాలు.. ఎప్పుడూ ప్రమాదమే. మనం అనుకున్న ఆర్థిక లక్ష్యాలను చేరకుండా.. అనవసర అప్పులు అడ్డుకుంటాయి. అందుకే, అప్పు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిందే. ఇప్పుడు కొంతమంది స్టాక్‌ మార్కెట్లో మదుపు చేసేందుకు  రుణాలు తీసుకుంటున్నారు. ఇది ఏమాత్రం క్షేమం కాదు. నష్టభయం అధికంగా ఉండే పథకాల్లో మన దగ్గరున్న మిగులు మొత్తాన్నే.. అదీ ఐదారేళ్ల దీర్ఘకాలం అవసరం లేదనుకుంటేనే పెట్టుబడులు పెట్టాలి.

- రాఘవ్‌ అయ్యంగార్‌, సీబీఓ, యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని