Credit Card: దీపావళికి క్రెడిట్‌కార్డుపై ఎక్కువ ఖర్చు చేసేశారా?

పండగ హడావుడిలో పడి క్రెడిట్‌ కార్డుపై ఎక్కువ ఖర్చు చేసి ఉంటే.. తిరిగి చెల్లించడానికి ఉన్న మార్గాలను ఇక్కడ చూద్దాం..!

Updated : 05 Nov 2021 10:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు, నో కాస్ట్‌ ఈఎంఐలు.. ఇలా ఆఫర్ల మోజులో పడి దీపావళికి క్రెడిట్‌ కార్డుపై ఎక్కువ ఖర్చుచేసేశారా? చెల్లింపులు ఏమాత్రం ఆలస్యమైనా.. వడ్డీ, అపరాధ రుసుములతో భారీ ఎత్తున ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. మరి ఇప్పటికే ఖర్చు చేసిన మొత్తాన్ని తిరిగి కట్టేయడం ఎలా? అందుకు ఉన్న కొన్ని మార్గాలేంటో చూద్దాం..!

ఈఎంఐ కిందకు మార్చుకోండి..

అధిక మొత్తంలో ఖర్చు చేశామని గుర్తించగానే.. మీ దగ్గర ఉన్న చిన్న మొత్తాలతో చెల్లింపులు ప్రారంభించండి. మీ నెలవారీ బిల్‌ జనరేట్‌ అయ్యే నాటికి కాస్తయినా భారం తగ్గుతుంది. అప్పటికీ.. ఇంకా మీరు కట్టలేనంత బిల్లు ఉన్నట్లయితే.. దాన్ని ఈఎంఐగా మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. అలా క్రమానుగతంగా భారాన్ని తగ్గించుకోండి. వీలైనంత వరకు చెల్లింపులను ఆటోమేట్‌ చేయించండి. తద్వారా చెల్లింపులు ఆలస్యం కాకుండా ఉంటాయి.

అత్యవసరమైతే స్వల్పకాల వ్యక్తిగత రుణం..

రెండు, మూడు క్రెడిట్‌ కార్డులను ఉపయోగించి ఎక్కువ మొత్తంలో ఖర్చు చేసినట్లయితే.. తిరిగి చెల్లించడం కాస్త కష్టమైన పనే. అలాంటప్పుడు స్వల్పకాల వ్యక్తిగత రుణం తీసుకొని అన్ని కార్డుల బిల్లులను సకాలంలో చెల్లించడం మేలని నిపుణులు సూచిస్తున్నారు. క్రెడిట్‌ కార్డుల బాకీలపై పడే వడ్డీ, అపరాధ రుసుములతో పోలిస్తే వ్యక్తిగత రుణంపై వర్తించే వడ్డీ తక్కువగానే ఉంటుంది. పైగా సిబిల్‌ స్కోర్‌ బాగుంటే వడ్డీరేటులోనూ బ్యాంకులు రాయితీ ఇచ్చే అవకాశం ఉంది.

రివార్డు పాయింట్లు, క్యాష్‌బ్యాక్‌ల రీడీమ్‌..

బిల్లింగ్‌ సైకిల్‌ పూర్తికాకముందే.. రివార్డు పాయింట్లు, క్యాష్‌బ్యాక్‌లు పెండింగ్‌లో ఉంటే వెంటనే రీడీమ్‌ చేసుకోండి. తద్వారా బిల్లు మొత్తంలో కొంత తగ్గుతుంది. అప్పుడు తిరిగి మీ చెల్లించే స్తోమతను బట్టి ఎలా తిరిగి కట్టేయ్యాలన్నది నిర్ణయించుకోండి.

వాయిదాలు తప్పొద్దు..

ఒకసారి క్రెడిట్‌ కార్డుపై ఖర్చు చేసిన తర్వాత తిరిగి చెల్లించాల్సిందే. ఈఎంఐగా మార్చుకుంటే ఎట్టిపరిస్థితుల్లో వాయిదాలు సకాలంలో కట్టడం మర్చిపోవద్దు. అందుకోసం అవసరమైతే రిమైండర్లు పెట్టుకోండి. మరోవైపు ఈ భారం ఇతర అప్పులు, రుణాలపై పడకుండా చూసుకోవాలి. అప్పుల్ని చెల్లించడానికి సరైన వ్యూహాన్ని ఎంచుకోండి. స్నో బాల్‌, అవలాంచే వంటి పద్ధతుల్ని అనుసరించి రుణాలను తిరిగి చెల్లించడం మేలు. లేదంటే అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని