Fixed Deposits: వ‌డ్డీ రేట్ల‌ను పెంచిన HDFC బ్యాంక్‌.. ఇప్పుడు ఎంతంటే?

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 15 నుంచి 25 బేసిస్ పాయింట్ల మేర వ‌డ్డీ రేటు పెంచింది. కొత్త వ‌డ్డీ రేట్లు జూన్ 15 నుంచి అమ‌ల‌వుతున్నాయి.   

Updated : 17 Jun 2022 16:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఖాతాదారుల‌కు గుడ్ న్యూస్‌. ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గ‌జం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై వ‌డ్డీ రేట్ల‌ను పెంచింది. రూ.2 కోట్ల లోపు వివిధ కాల‌ప‌రిమితులు గ‌ల డిపాజిట్ల‌పై 15 నుంచి 25 బేసిస్ పాయింట్ల మేర వ‌డ్డీ రేటు పెంచింది. కొత్త వ‌డ్డీ రేట్లు జూన్ 15 నుంచి అమ‌ల‌వుతున్నాయి.  

ఆరు నెల‌ల 1 రోజు నుంచి 9 నెల‌ల కాల‌పరిమితి గ‌ల డిపాజిట్ల‌పై 25 బేసిస్ పాయింట్లు మేర వ‌డ్డీ రేటుపెంచింది దీంతో 4.40 శాతంగా ఉన్న వ‌డ్డీ రేటు 4.65 శాతానికి పెరిగింది. అలాగే 9 నెల‌లు 1 రోజు నుంచి ఏడాది లోపు డిపాజిట్ల‌పై 15 బేసిస్ పాయింట్ల పెంచింది. దీంతో వ‌డ్డీ రేటు 4.50 శాతం నుంచి 4.65 శాతానికి చేరింది. ఒక సంవత్సరం, ఒక సంవ‌త్స‌రం 1 రోజు నుంచి రెండేళ్ల కాల‌ప‌రిమితి గ‌ల డిపాజిట్ల‌పై  25 బేసిస్ పాయింట్ల మేర వ‌డ్డీ పెంచింది. దీంతో ఈ కాల‌పరిమితి గ‌ల ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై ఇంత‌కు ముందు వ‌ర‌కు 5.10 శాతం వ‌డ్డీ వ‌ర్తిస్తుండ‌గా తాజాగా ఇది 5.35 శాతానికి చేరింది. 

మ‌రోవైపు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 7 రోజుల నుంచి 6 నెల‌ల లోపు వివిధ కాల‌ప‌రిమితులు గ‌ల ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై వ‌ర్తింప‌చేస్తున్న‌ వ‌డ్డీ రేట్ల (2.50 నుంచి 3.50 శాతం) లో ఎటువంటి మార్పూ చేయ‌లేదు. అలాగే, రెండేళ్ల 1 రోజు నుంచి మూడేళ్ల కాల‌ప‌రిమితి గ‌ల డిపాజిట్లు, మూడు సంవ‌త్స‌రాల ఒక రోజు నుంచి 5 ఏళ్ల లోపు, 5 సంవ‌త్స‌రాల ఒక రోజు నుంచి 10 ఏళ్ల లోపు డిపాజిట్ల‌పై ఎటువంటి మార్పు చేయ‌లేదు. ఈ కాల‌ప‌రిమితులు గ‌ల డిపాజిట్ల‌పై వ‌రుస‌గా 5.40 శాతం, 5.60 శాతం, 5.75 శాతం వ‌డ్డీ కొన‌సాగిస్తున్న‌ట్లు బ్యాంక్ తెలిపింది. 

సీనియ‌ర్ సిటిజ‌న్లు: బ్యాంక్ సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు ఇచ్చే వ‌డ్డీ రేటు కంటే సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు అధిక వ‌డ్డీ రేటు అందిస్తుంది. ఆరు నెల‌ల 1 రోజు నుంచి 9 నెల‌ల కాల‌పరిమితి గ‌ల డిపాజిట్ల‌పై 25 బేసిస్ పాయింట్లు మేర పెంచ‌డంతో 4.90 శాతంగా ఉన్న వ‌డ్డీ రేటు 5.15 శాతానికి పెరిగింది. అలాగే 9 నెల‌లు 1 రోజు నుంచి ఏడాది లోపు డిపాజిట్ల‌పై 15 బేసిస్ పాయింట్లు పెంచ‌డంతో వ‌డ్డీ రేటు 5.00 శాతం నుంచి 5.15 శాతానికి చేరింది. ఒక సంవత్సరం, ఒక సంవ‌త్స‌రం 1 రోజు నుంచి రెండేళ్ల కాల‌ప‌రిమితి గ‌ల డిపాజిట్ల‌పై  25 బేసిస్ పాయింట్ల మేర వ‌డ్డీ పెంచింది. దీంతో ఈ కాల‌పరిమితి గ‌ల ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై 5.60 శాతం వ‌డ్డీ వ‌ర్తిస్తుండ‌గా తాజాగా ఇది 5.85 శాతానికి చేరింది.

ఇదిలా ఉండ‌గా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సీనియ‌ర్ సిటిజ‌న్ల కోసం ‘హెచ్‌డీఎఫ్‌సీ సీనియ‌ర్ సిటిజ‌న్ కేర్’ పేరుతో స్పెష‌ల్ ఎఫ్‌డీ ప‌థ‌కాన్ని అందిస్తుంది. సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు సాధార‌ణంగా ఇచ్చే వ‌డ్డీ రేటు కంటే 25 బేసిస్ పాయింట్ల అద‌నంగా ఆఫ‌ర్ చేస్తోంది. సాధార‌ణ ప్ర‌జ‌ల‌ కంటే 75 బేసిస్ పాయింట్ల మేర‌ అధిక వ‌డ్డీ రేటును ఇస్తోంది. ఈ ప‌థ‌కాన్ని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 2020 మే 18న ప్రవేశపెట్టగా.. ఈ ఏడాది సెప్టెంబర్‌ 30తో గ‌డువు ముగియ‌నుంది. ఈ ప‌థ‌కం 5 ఏళ్ల కాల‌ప‌రిమితితో కొత్త‌గా చేసే డిపాజిట్లు, పున‌రుద్ధ‌ర‌ణ‌ల‌పై మాత్ర‌మే వ‌ర్తిస్తుంది. ఎన్నారైలకు ఈ ప‌థ‌కం వ‌ర్తించ‌దు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని