30 నిమిషాల `ఎక్స్‌ప్రెస్ కారు లోన్‌`ని ప్రారంభించిన `హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు`

ఆటోమోటివ్ డిజిట‌ల్ ప్ర‌క్రియ ద్వారా కేవ‌లం అర‌గంట‌లో కారు డీల‌ర్‌ ఖాతాలో రుణ మొత్తం జ‌మ అవుతుంద‌ని బ్యాంకు పేర్కొంది.

Updated : 10 May 2022 12:40 IST

ఇప్పుడు కార్లు కొనుగోలు చేసే వినియోగ‌దారుల‌కు బ్యాంకులు వారి అర్హ‌త‌లను బ‌ట్టి వేగంగా రుణాలిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే `హెచ్‌డీఎఫ్‌సీ` బ్యాంక్ అన్ని అర్హ‌త‌లు ఉన్న‌వారికి 30 నిమిషాల‌లోనే కారు రుణం ఇవ్వ‌డానికి ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసింది. `హెచ్‌డీఎఫ్‌సీ` బ్యాంక్ 30 నిమిషాల `ఎక్స్‌ప్రెస్ కారు లోన్స్‌`ని ప్రారంభించింది. ఆటోమోటివ్ డిజిట‌ల్ ప్ర‌క్రియ ద్వారా కేవ‌లం అర‌గంట‌లో కారు డీల‌ర్‌ ఖాతాలో రుణ మొత్తం జ‌మ అవుతుంద‌ని బ్యాంకు పేర్కొంది. ఈ ప్రాసెసింగ్ అంతా డిజిట‌ల్‌గా జ‌రుగుతుంది. ఈ రుణ స‌దుపాయంతో దేశంలో కారు ఫైనాన్సింగ్ విధానంలో విప్ల‌వాత్మ‌క మార్పులు వ‌స్తాయ‌ని బ్యాంకు భావిస్తోంది.

భార‌తీయ ఆటోమోబైల్ ప‌రిశ్ర‌మ వ‌చ్చే 5-7 సంవ‌త్స‌రాల‌లో సంవ‌త్స‌రానికి 3.5 కోట్ల కొత్త వాహ‌నాల యూనిట్ల విక్ర‌యాల‌తో ప్ర‌పంచంలోనే ఈ రంగంలో 3వ అతిపెద్ద‌దిగా అవ‌త‌రించ‌నుంది. ఈ కొత్త వాహ‌నాల రుణ విత‌ర‌ణ‌కు బ్యాంకులు కూడా రుణ సౌక‌ర్యం క‌ల్పించ‌డానికి భారీఎత్తున త‌మ ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నాయి. దీనిలో భాగంగానే `హెచ్‌డీఎఫ్‌సీ` బ్యాంక్ కూడా కొత్త అవ‌కాశాల‌ను అందిపుచ్చుకోవ‌డానికి `ఎక్స్‌ప్రెస్ కార్ లోన్స్‌`ని  ప్రారంభించింది. ప్ర‌స్తుత వినియోగ‌దారులు, కొత్త‌గా వ‌చ్చే వినియోగ‌దారుల కోసం ఎండ్‌-టు-ఎండ్ డిజిట‌ల్ కొత్త కారు రుణ సౌక‌ర్యాన్ని ఆరంభించింది. దేశ‌వ్యాప్తంగా ఉన్న ఆటోమొబైల్ డీల‌ర్‌ల‌తో బ్యాంకు త‌న రుణ సంబంధాల‌ను ఏకికృతం చేసింది.

`హెచ్‌డీఎఫ్‌సీ` బ్యాంకు కారు కొనుగోలుదారుల కోసం సౌక‌ర్య‌వంత‌మైన‌, వేగ‌వంత‌మైన డిజిట‌ల్ సౌక‌ర్యాన్ని సృష్టించింది. ఇది చిన్న ప‌ట్ట‌ణాలు, గ్రామీణ ప్రాంతాల‌తో స‌హా దేశ‌వ్యాప్తంగా కార్ల కొనుగోలు ప్ర‌క్రియ‌ను సుల‌భ‌త‌రం చేయ‌డానికి, కార్ల అమ్మ‌కాల‌లో వేగం పెంచ‌డానికి స‌హాయ‌ప‌డుతుంద‌ని బ్యాంకు తెలిపింది. `హెచ్‌డీఎఫ్‌సీ` బ్యాంకు డిజిట‌ల్ ఆవిష్క‌ర‌ణ‌ల‌లో అగ్ర‌గామిగా ఉంద‌ని బ్యాంకు ప్ర‌తినిధి తెలిపారు. ముందుగా 20% - 30% మంది ఈ బ్యాంకు వినియోగ‌దారులు రూ. 20 ల‌క్ష‌ల వ‌ర‌కు కారు రుణ‌ సౌక‌ర్యాన్ని పొందుతార‌ని భావిస్తుంది. ఈ రుణ స‌దుపాయం ప్ర‌స్తుతం 4 వీల‌ర్ వాహ‌నాల‌కు అందిస్తారు. క్ర‌మంగా ద్విచ‌క్ర వాహ‌న రుణాల‌కు త‌ర్వాత అందుబాటులోకి వ‌స్తుంది.

వాహ‌నాల త‌యారీ వేగం పుంజుకోవ‌డం, బ్యాంకుల రుణ సౌక‌ర్యాల కార‌ణంగా ఒక‌టి, రెండు ద‌శాబ్దాల‌లో 35 కోట్ల‌కు పైగా కార్లు, 25 కోట్ల‌కు పైగా ద్విచ‌క్ర వాహ‌నాలు రోడ్ల పైకి వ‌చ్చే అవ‌కాశ‌ముంద‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని