HDFC Bank: పొదుపు ఖాతా వ‌డ్డీరేట్ల‌ను స‌వ‌రించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌..

స‌వ‌రించిన వ‌డ్డీ రేట్లు ఏప్రిల్ 6, 2022 నుంచి అమలులోకి వ‌చ్చాయి.   

Updated : 07 Apr 2022 14:24 IST

దేశీయ అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకుల‌లో ఒక‌టైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తాజాగా పొదుపు ఖాతా వ‌డ్డీ రేట్ల‌ను స‌వ‌రించింది. బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ప్ర‌కారం..రూ. 50 ల‌క్ష‌ల లోపు బ్యాలెన్స్ ఉన్న పొదుపు ఖాతాల‌కు 3 శాతం, రూ. 50 ల‌క్ష‌ల పైన బ్యాలెన్స్ నిర్వ‌హిస్తున్న పొదుపు ఖాతాల‌కు 3.50 శాతం వ‌డ్డీ ల‌భిస్తుంది. ఈ సవ‌రించిన‌ వ‌డ్డీ రేట్లు ఏప్రిల్ 6, 2022 నుంచి అమ‌లవుతాయ‌ని తెలిపింది.

దేశీయ‌(డొమెస్టిక్), ఎన్ఆర్‌ఐ, ఎన్ఆర్ఈ డిపాజిట్లతో సహా అన్ని పొదుపు ఖాతాలకు ఏప్రిల్ 6, 2022 నుంచి పైన తెలిపిన విధంగా వడ్డీ రేట్లు వర్తిస్తాయి. ఖాతాదారుడు బ్యాంక్ ఖాతాలో నిర్వ‌హించే రోజువారి నిల్వ‌ల ఆధారంగా వడ్డీ లెక్కించి..  త్రైమాసికంగా (మూడు నెల‌ల‌కు) వ‌డ్డీ మొత్తాన్ని ఖాతాకు జ‌మ‌చేస్తారు.  

మరోవైపు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్.. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచింది. ఏడాది కాల‌ప‌రిమితి ఉన్న డిపాజిట్లు ఏడాది పైనా, రెండేళ్ల లోపు కాల‌ప‌రిమితి ఉన్న రూ. 2 కోట్ల లోపు డిపాజిట్ల‌పై వ‌డ్డీ రేటును 0.10% మేర పెంచింది. తాజా పెంపుతో ఈ కాల‌వ్య‌వ‌ధి గ‌ల డిపాజిట్ల‌పై 5 శాతంగా ఉన్న వ‌డ్డీ రేటు 5.10 శాతానికి చేరింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్ర‌స్తుతం 7 రోజుల నుంచి మొద‌లుకుని 10 సంవ‌త్స‌రాల వ‌ర‌కు వివిధ కాల‌ప‌రిమితుల‌తో ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌ను అందిస్తుంది. కాల‌ప‌రిమితికి అనుగుణంగా 2.50 శాతం నుంచి 5.60 శాతం వ‌డ్డీ రేటుని ఆఫ‌ర్ చేస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని