Rs.2,000 నోట్ల మార్పిడి.. ఖాతాదారులకు HDFC Bank సందేశం!

HDFC Bank : రూ.2000 నోట్ల మార్పిడిపై అనేక సందేహాలు నెలకొన్న నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ (HDFC Bank) తమ కస్టమర్లకు స్పష్టత ఇచ్చింది.

Published : 22 May 2023 11:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రూ.2000 నోట్లను (Rs.2000 notes) ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్‌బీఐ (RBI) ప్రకటించిన నేపథ్యంలో ఇవి క్రమంగా చలామణి నుంచి కనుమరుగు కానున్నాయి. ఈ నేపథ్యంలో వీటిని మార్చుకునేందుకు 2023 సెప్టెంబరు 30 వరకు గడువిచ్చింది. రేపటి నుంచి నోట్ల మార్పిడి ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే, దీనిపై అనేక సందేహాలు నెలకొన్న నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ (HDFC Bank) తమ కస్టమర్లకు స్పష్టత ఇచ్చింది.

ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం.. ఖాతాదారులు తమ వద్ద ఉన్న రూ.2,000 నోట్ల (Rs.2000 notes)ను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు (HDFC Bank)కు చెందిన ఏ బ్రాంచిలోనైనా మార్చుకోవచ్చని తెలిపింది. ఖాతాల్లో డిపాజిట్‌ చేసుకునే వెసులుబాటు కూడా కల్పిస్తున్నట్లు వెల్లడించింది. 2023 మే 23 నుంచి మొదలుకొని 2023 సెప్టెంబరు 30 వరకు ఈ మార్పిడి ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేసింది. కస్టమర్ల విశ్వాసం, సౌకర్యమే తమ తొలి ప్రాధాన్యమని చెప్పింది. ఈ నేపథ్యంలో కస్టమర్లకు నోట్ల మార్పిడి సమయంలో ఎటువంటి అసౌకర్యం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.

మరోవైపు రూ.2,000 నోటు చెల్లుబాటుపై ఎలాంటి సందేహాలు అవసరం లేదని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ (HDFC Bank) తెలిపింది. ఆర్‌బీఐ చెప్పే వరకు ఈ నోటును ఎలాంటి లావాదేవీలకైనా ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేసింది. బ్యాంకులో ఎంత మొత్తంలోనైనా రూ.2,000 నోట్లను డిపాజిట్‌ లేదా మార్పిడి చేసుకోవచ్చని తెలిపింది.

ఎస్‌బీఐ ఏం చెప్పిందంటే..

రూ.2,000 నోట్లను ఒక్కోసారి రూ.20 వేల విలువ వరకు ఎలాంటి పత్రాలు నింపకుండా, గుర్తింపు కార్డులు చూపకుండా నేరుగా బ్యాంకు శాఖల్లో ప్రజలు మార్చుకోవచ్చని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తెలిపింది. రూ.2,000 నోట్లను బ్యాంక్‌ ఖాతాలో జమ చేసుకునేందుకు గరిష్ఠ పరిమితిని ఆర్‌బీఐ వెల్లడించలేదు. అయితే, తమకు ఖాతా ఉన్న బ్యాంకు శాఖలో, ఇతర శాఖల్లో కేవైసీ, ఇతర నిబంధనల ప్రకారం.. ఎంతమేర గరిష్ఠంగా నగదు జమ చేసేందుకు అనుమతి ఉంటే, అంత విలువ వరకు రూ.2000 నోట్లను ఖాతాలో వేసుకోవచ్చని చెబుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని