హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ సిస్ట‌మాటిక్ రిటైర్‌మెంట్ ప్లాన్‌ ఫీచ‌ర్లు

యాన్యుటీ ప్లాన్‌, యాన్యుటి ప్లాన్ విత్ రిట‌ర్న్ ఆప్ష‌న్ల‌లో పాల‌సీదారులు త‌మ‌కు ఇష్ట‌మైన ఆప్ష‌న్ ఎంచుకోవ‌చ్చు.

Updated : 17 Dec 2021 15:04 IST

 

ఇంటర్నెట్‌ డెస్క్‌: హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ సిస్ట‌మాటిక్ రిటైర్‌మెంట్ ప్లాన్‌ పేరిట మరో కొత్త రిటైర్‌మెంట్‌ ప్లాన్‌ను హెచ్‌డీఎఫ్‌సి లైఫ్‌ ప్రారంభించింది. ప‌ద‌వీ విర‌మ‌ణ జీవితం కోసం ఈ ప్లాన్ ప‌నిచేస్తుంది. ఇది ఇండివిడ్యువ‌ల్‌, గ్రూప్‌, నాన్‌-పార్టిసిపేటింగ్‌, నాన్ లింక్డ్‌, సేవింగ్స్ డిఫ‌ర్డ్ యాన్యుటీ ప్లాన్‌.

ఈ ప్లాన్ ఎందుకు?
పెరుగుతున్న ఆయుర్ధాయం, ద్రవ్యోల్బణం వల్ల ప‌ద‌వీ విర‌మ‌ణ ప్ర‌ణాళిక అవ‌స‌రం పెరిగింది. ఉద్యోగాల కోసం వ‌ల‌స‌లు వెళ్ల‌డం, చిన్న కుటుంబాల సంస్కృతి పెర‌గ‌డం, పిల్ల‌ల విద్య‌, జీవ‌న‌శైలి అవ‌స‌రాలు పెర‌గ‌డంతో ప‌ద‌వీ విర‌మ‌ణ‌కు ప్రాముఖ్య‌త‌ ఇవ్వ‌డం లేదు. ఒక స‌ర్వే ప్ర‌కారం రిటైరైన భార‌తీయుల్లో చాలా మంది జీవిత కాలం పొదుపును మెరుగైన జీవ‌న శైలి కోసం ఖ‌ర్చు చేసేందుకు ఆలోచిస్తున్నారు. ఒక‌వేళ‌ ఎక్క‌వ కాలం జీవిస్తే.. పొదుపు మొత్తం ఖ‌ర్చ‌యిపోయి నిరాశ్ర‌యులుగా జీవించాల్సి వ‌స్తుంద‌నే భ‌యంతో చాలా విష‌యాల్లో రాజీ ప‌డుతున్నార‌ని తెలుస్తోంది. వ‌య‌సు పెరిగి, ఆదాయం త‌గ్గిన త‌ర్వాత కూడా వైద్య‌, ఆర్థిక అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల‌ను స‌మ‌ర్థ‌ంగా ఎదుర్కొనేందుకు, ఆర్థిక స్థిర‌త్వంతో మెరుగైన జీవ‌న శైలి కొన‌సాగించేందుకు అద‌న‌పు ఆదాయం ఏర్పాటు చేసుకోవ‌డం అవ‌స‌రం. ఇందుకు గొల్డెన్ ఇయ‌ర్స్‌లో కచ్చితంగా ప‌ద‌వీవిర‌మ‌ణ ప్ర‌ణాళిక ఉండాలి. యాన్యుటీ వంటి బీమా ప‌థ‌కాలు జీవిత‌కాలం పెరిగినా కచ్చిత‌మైన ఆదాయాన్ని అందిస్తాయి.

హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ సిస్ట‌మాటిక్ రిటైర్‌మెంట్ ప్లాన్.. యాన్యుటీ ప్రారంభంలోనే వ‌డ్డీ రేట్ల‌ను లాక్ చేస్తుంది. ప‌రిమిత కాల‌వ్య‌వ‌ధి వ‌ర‌కు క్ర‌మ‌ప‌ద్ధ‌తిలో ప‌ద‌వీవిర‌మ‌ణ నిధి కోసం ఆదా చేసేందుకు, ఆ త‌ర్వాత జీవితాంతం కచ్చిత‌మైన ఆదాయాన్ని పొందేందుకు వీలు క‌ల్పిస్తుంది. ఇందులో రెండు ఆప్ష‌న్లు ఉంటాయి. 1.యాన్యుటీ ప్లాన్‌, 2.యాన్యుటీ ప్లాన్ విత్ రిట‌ర్న్‌. ఇందులో పాల‌సీదారులు త‌మ‌కు ఇష్ట‌మైన ఆప్ష‌న్ ఎంచుకోవ‌చ్చు.

ఫీచ‌ర్లు..
* 45 నుంచి 75 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సు వారు పాల‌సీ తీసుకోవ‌చ్చు. ఒక‌వేళ 75 ఏళ్ల వ‌య‌సులో పాల‌సీ తీసుకుంటే ప్రీమియం చెల్లింపుల‌కు 5 ఏళ్ల స‌మ‌యం ఉంటుంది. 80 ఏళ్ల వయ‌సు నుంచి యాన్యుటీ ప్రారంభమ‌వుతుంది.
నెలవారీగా, త్రైమాసికంగా, అర్ధ-వార్షికంగా లేదా వార్షిక ప్రాతిపదికన ప్రీమియంల‌ను చెల్లించవచ్చు.
* ప్రీమియం చెల్లింపుల‌కు 5 నుంచి 15 సంవ‌త్స‌రాల కాలప‌రిమితిని ఎంచుకోవ‌చ్చు.
* 15 సంవ‌త్స‌రాల వ‌ర‌కు వాయిదా కాలాన్ని ఎంచుకోవ‌చ్చు.
* వైద్య‌, పూచీక‌త్తులు లేకుండానే అన్ని అవ‌స‌ర‌మైన డాక్యుమెంట్లు, ప్రీ క‌న్వర్ష‌న్ వెరిఫికేష‌న్ల‌ను చాట్ ద్వారా పూర్తి చేసి 24 గంట‌ల‌లోపు పాల‌సీని జారీ చేస్తారు.
* ప‌రిమిత కాలం పాటు ప్రీమియం చెల్లింపులు చేసి జీవితాంతం కచ్చిత‌మైన ఆదాయాన్ని పొందొచ్చు.
* పాల‌సీ ప్రారంభంలో యాన్యూటీ రేట్‌ను నిర్ణ‌యించి లాక్ చేస్తారు. పాల‌సీ కాల‌వ్య‌వ‌ధిలో ఈ రేటు మార‌దు.
* హామీ ఇచ్చిన ఆదాయం చెల్లించిన ప్రీమియంల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. ష‌ర‌తులు, నిబంధ‌న‌లు వ‌ర్తిస్తాయి.
* సేవ్ ది డేట్ ఫీచ‌ర్‌తో యాన్యూటీ చెల్లింపు తేదీని ఎంచుకోవ‌చ్చు. పుట్టినతేదీ, వార్షికోత్స‌వాలు, ఇత‌ర ప్రత్యేక రోజుల‌ను సేవ్ చేసుకుని ఆ రోజుల్లో చెల్లింపులు అందేలా ఏర్పాటు చేసుకోవ‌చ్చు.
* ఎల్ఏ-ఆర్‌వోపీ ఆప్ష‌న్‌తో మ‌ర‌ణంపై చెల్లించిన మొత్తం ప్రీమియంల‌ను వెనక్కి పొందొచ్చు.
* వాయిదాల చెల్లింపు పీరియ‌డ్‌లో పాల‌సీదారుడు మ‌ర‌ణిస్తే, రెండు ఆప్ష‌న్ల‌లోనూ మ‌ర‌ణ ప్ర‌యోజ‌నాలు అందిస్తారు. ఇవి యాన్యుటెంట్ చెల్లించిన మొత్తం ప్రీమియంల కంటే ఎక్కువ ఉంటాయి. (ఇక్క‌డ మొత్తం ప్రీమియం అంటే స్వీక‌రించిన మొత్తం ప్రీమియం నుంచి అద‌న‌పు ప్రీమియం, రైడ‌ర్ల‌కు చెల్లించిన ప్రీమియం, వ‌ర్తించే ప‌న్నులు తీసివేయ‌గా మిగిలిన ప్రీమియం). మొత్తం ప్రీమియంకు 6 శాతం వార్షిక కాంపౌండ్ వ‌డ్డీని జ‌త‌చేసి లేదా మొత్తం ప్రీమియంల‌కు స‌మాన‌మైన 105 శాతం మొత్తాన్ని చెల్లిస్తారు.
* వాయిదా వ్య‌వ‌ధి ముగిసిన త‌రువాత పాల‌సీదారుడు మ‌రిణిస్తే, లైఫ్ యాన్యుటీ ఆప్ష‌న్‌లో మ‌ర‌ణ ప్ర‌యోజ‌నం వ‌ర్తించ‌దు. ఇత‌ర ప్ర‌యోజ‌నాలు నిలిపివేసి పాల‌సీని ర‌ద్దు చేస్తారు. లైఫ్ యాన్యుటీ విత్ రిట‌ర్న్ ఆప్ష‌న్ ఎంచుకున్న వారికి మ‌ర‌ణ ప్ర‌యోజ‌నాల‌ను చెల్లించిన త‌ర్వాతే పాల‌సీ ర‌ద్దు చేస్తారు.

యాన్యుటీ ప్లాన్ కొనే ముందు అందులోని ఛార్జీలు లాంటివి కూడా పరిశీలించడం మంచిది. పదవీ విరమణ కోసం మీకు కొంత సమయం ఉంటే ఎన్పీఎస్ లాంటి పథకాలు కూడా ఎంచుకోవచ్చు. ఎన్పీఎస్ కార్పస్‌లో 60 శాతం మొత్తం వెనక్కి తీసుకోవచ్చు. 40 శాతం మొత్తంతో యాన్యుటీ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పదవీ విరమణ తీసుకున్న లేక త్వరలోనే తీసుకున్నట్లయితే యాన్యుటీ ప్లాన్స్ బదులు ఎల్ఐసి వయ వందన యోజన లేదా సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ పథకం లాంటివి పరిశీలించొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని