Health Insurance: కరోనా సంక్షోభం.. 3.5 రెట్లు పెరిగిన ఆరోగ్య బీమా క్లెయిమ్‌లు

గత రెండేళ్లుగా కరోనా సంక్షోభం కారణంగా ఆరోగ్య బీమా అనేది ఎంత అవసరమో దాదాపు అందరికీ తెలిసొచ్చింది. దీంతో ఈ బీమా చేయించుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది

Published : 24 Mar 2022 15:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గత రెండేళ్లుగా కరోనా సంక్షోభం కారణంగా ఆరోగ్య బీమా అనేది ఎంత అవసరమో దాదాపు అందరికీ తెలిసొచ్చింది. దీంతో బీమా చేయించుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇదే సమయంలో క్లెయిమ్‌లు కూడా భారీగానే పెరిగాయి. కరోనా తొలి దశతో పోలిస్తే రెండో దశ తీవ్రంగా ఉంది. డెల్టా విజృంభణ కారణంగా ఆసుపత్రిలో చేరికలు విపరీతంగా పెరిగాయి. దీంతో 2021లో ఆరోగ్య బీమా క్లెయిమ్‌లు కూడా 257 శాతం(3.5 రెట్లు) పెరిగినట్లు తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. ఒక్క కొవిడ్ క్లెయిమ్‌లే 178శాతం పెరిగాయని పేర్కొంది.

‘డిజిటల్‌ ఇన్స్యూరెన్స్‌’ అనే ప్రైవేటు జనరల్‌ ఇన్స్యూరర్‌.. 2020, 2021లో ఆరోగ్య బీమా దరఖాస్తులు, వాటి క్లెయిమ్‌ల పరిష్కారాలపై అధ్యయనం జరిపింది. దీని ప్రకారం.. 2020లో మెట్రో, మెట్రోయేతర నగరాల్లో కొవిడ్ క్లెయిమ్‌ల సంఖ్య దాదాపు ఒకేలా ఉంది. అయితే 2021లో మాత్రం మెట్రో నగరాలతో పోలిస్తే మెట్రోయేతర నగరాల్లో ఈ క్లెయిమ్‌ల సంఖ్య 17శాతం ఎక్కువగా ఉంది. మొత్తం ఆరోగ్య బీమా క్లెయిమ్‌ల(కొవిడ్‌తో పాటు ఇతర అనారోగ్యాలు) పరంగా చూసుకుంటే.. 2021లో మెట్రోల్లో కంటే మెట్రోయేతర నగరాల్లో 51శాతం అధికరంగా క్లెయిమ్‌లు నమోదయ్యాయి. 

ఇక, 2020లో మహిళల కంటే పురుషుల క్లెయిమ్‌లు 283శాతం ఎక్కువగా ఉండగా.. 2021లో అది 127 శాతానికి తగ్గినట్లు అధ్యయనంలో వెల్లడైంది. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌, తమిళనాడులో అత్యధిక ఆరోగ్య బీమా క్లెయిమ్‌లు నమోదయ్యాయి. 2020లో మాదిరిగానే 2021లోనూ 25-35, 36-45 ఏళ్ల వయసు ఉన్న పాలసీదారులే అత్యధికంగా క్లెయిమ్స్‌ చేసినట్లు అధ్యయనం తెలిపింది. 2020లో దాఖలైన మొత్తం ఆరోగ్య బీమా క్లెయిమ్స్‌లో 69 శాతం కొవిడ్ క్లెయిమ్‌లే కాగా.. గతేడాది వీటి సంఖ్య 54శాతంగా ఉంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని