అతి త‌క్కువ ప్రీమియంతో ఆరోగ్య బీమా

ఏదైన కంపెనీ ప్రారంభ ద‌శ మొద‌టి రోజు నుండి ఉద్యోగుల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల గురించి ఆలోచించ‌డం ఒక మంచి ప‌రిణామం. 

Updated : 23 Dec 2021 14:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చిన్న తరహా స్టార్ట‌ప్‌లు, కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసే కార్మికులు, సూక్ష్మ-చిన్న తరహా ప‌రిశ్ర‌మ‌ల‌లో ప‌నిచేసే వారికి ఆరోగ్య బీమా క‌ల్పించ‌డానికి కేవ‌లం నెల‌కు అతి త‌క్కువ రూ. 85 ప్రారంభ ప్రీమియంతో రూ. 5 ల‌క్ష‌ల వ‌ర‌కు గ్రూప్ ఆరోగ్య బీమాను ప్ల‌మ్ ఆరోగ్య బీమా ప్లాట్‌ఫామ్ అందిస్తోంది. అంతేకాకుండా అప‌రిమితంగా వైద్యుల అపాయింట్‌మెంట్స్‌, వారానికోసారి వెల్‌నెస్ సెష‌న్‌లు, డెంటల్‌, క‌ళ్ల ప‌రీక్ష‌లు, మాన‌సిక ఆరోగ్య నిమిత్తం డాక్ట‌ర్ కన్సల్టేషన్స్, కొవిడ్‌ చికిత్స మొద‌లైన వాటికి క్లెయిమ్ చేసుకోవ‌డానికి  ఈ ఆరోగ్య బీమాలో అనుమ‌తి ఉంటుంది. ఉద్యోగుల ఆరోగ్య బీమా ప్లాట్‌ఫామ్ ప్ల‌మ్ డిసెంబ‌ర్ 21, 2021న ప్రారంభ ద‌శ‌లో స్టార్ట‌ప్‌లు, సూక్ష్మ‌చిన్న త‌రహా ప‌రిశ్ర‌మ‌లు, గిగ్ (కాంట్రాక్ట్ పద్ధతి మీద ప‌నిచేసే) వ‌ర్క‌ర్లు, ఫ్రీలాన్స్ క‌న్స‌ల్టెంట్‌ల కోసం ప్ర‌త్యేకంగా స‌మ‌గ్ర గ్రూప్ ఆరోగ్య ప్ర‌యోజ‌నాల స‌భ్య‌త్వం అయిన ప్ల‌మ్‌-లైట్‌ను ప్రారంభించిన‌ట్లు ప్ర‌క‌టించింది.

ప్ల‌మ్‌-లైట్ స‌భ్య‌త్వం ఇద్ద‌రు స‌భ్యుల కంటే త‌క్కువ టీమ్‌ల‌ను క‌లిగి ఉన్న కంపెనీల‌కు కూడా వ‌ర్తిస్తుంది. ఏదైనా కంపెనీ ప్రారంభ ద‌శ మొద‌టి రోజు నుంచి ఉద్యోగుల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల గురించి ఆలోచించ‌డం ఒక మంచి ప‌రిణామం. ప్ర‌స్తుతం ఉద్యోగుల ఆరోగ్య ప్ర‌ణాళిక‌లు పెద్ద సంఖ్య‌లో అంటే క‌నీసం 10 మంది స‌భ్యులు ఉన్న గ్రూప్‌ల‌కు మాత్ర‌మే అందుబాటులో ఉన్నాయి. అయితే `ప్ల‌మ్` కొత్త ఆరోగ్య ప్ర‌యోజ‌నాల స‌భ్య‌త్వం కేవ‌లం ఇద్ద‌రు స‌భ్యుల‌తో ప్రారంభ‌మ‌య్యే చిన్న స్థాయి టీమ్‌లు క‌వ‌ర్ చేసుకోవ‌చ్చ‌ని తెలిపింది.

నెల‌కు రూ. 85 ప్రీమియంతో ప్రారంభ‌మ‌వ్వ‌డం అంటే ఒక పూట భోజ‌నం ఖ‌ర్చు, ఒకసారి వైద్యుని క‌న్స‌ల్టేష‌న్ కంటే కూడా ఈ ప్రీమియం త‌క్కువ‌. అందువ‌ల్ల చిన్న కంపెనీలు అధిక మొత్తంలో పెట్టుబ‌డిని ఆరోగ్య బీమా గురించి ఖ‌ర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఆరోగ్య బీమా స‌భ్య‌త్వ క‌వ‌ర్ రూ. 5 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉండ‌ట‌మే కాకుండా ఇది ఉద్యోగుల‌, జీవిత భాగ‌స్వామి, వారి పిల్ల‌ల‌ను కూడా ఆరోగ్య బీమా క‌వ‌ర్ చేస్తుంది. ఈ కొత్త ఆరోగ్య ప్ర‌యోజ‌న స‌భ్య‌త్వం ప్రారంభం గురించి `ప్ల‌మ్` ప్ర‌తినిధి మాట్లాడుతూ అత్యంత వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు అందుబాటులో ఉంచే ల‌క్ష్యంతో ఈ ఆరోగ్య బీమా ప‌థ‌కాన్ని ఏర్పాటు చేశామ‌ని, ఇది ఒక ప్ర‌యోగ‌మ‌న్నారు. 2024 నాటికి ఒక కోటి మందికి బీమా చేయాల‌నే `ప్ల‌మ్` ల‌క్ష్యాన్ని ఈ ప‌థ‌కం నెర‌వేస్తుంద‌ని, ఆరోగ్య బీమా ఖ‌ర్చు త‌ట్టుకోలేక బీమాకు ఎవ‌రూ దూరం కాకూడ‌ద‌ని త‌మ ఉద్దేశ‌మ‌ని తెలిపారు. భార‌త్‌లోని 6.3 కోట్ల సూక్ష్మ చిన్న త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌లు, 1 కోటి 50 ల‌క్ష‌ల కాంట్రాక్ట్ వ‌ర్క‌ర్ల‌లో ఆరోగ్య బీమా వ్యాప్తి చాలా త‌క్కువ ఉన్న‌ట్లు ఒక అంచ‌నా. వీరిని దృష్టిలో ఉంచుకునే ఈ ఆరోగ్య బీమా ఏర్పాటు చేయ‌డ‌మైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు