సీనియ‌ర్ సిటిజ‌న్స్! ఆరోగ్య పాల‌సీ కొంటున్నారా?

ప్ర‌త్యేకంగా సీనియ‌ర్ సిటిజ‌న్స్ కోస‌మే కొన్ని ఆరోగ్య పాల‌సీల‌ను బీమా సంస్థ‌లు అందిస్తున్నాయి. అలాంటివి కొనేముందు ఏయే అంశాలు ప‌రిశీలించాలో చూద్దాం.

Published : 19 Dec 2020 16:37 IST

స‌రిప‌డా బీమా తీసుకోన‌ప్పుడు వైద్య‌ప‌రంగా అత్య‌వ‌స‌ర ప‌రిస్థితులు ఏర్ప‌డితే ఆర్థికంగా కోలుకునేందుకు చాన్నాళ్లు ప‌డుతుంది. ముఖ్యంగా వ‌యోవృద్ధుల‌కు ఆరోగ్య సంర‌క్ష‌ణ ఎక్కువ‌గా అవ‌స‌రం, వారి విష‌యంలో ఖ‌ర్చులూ ఎక్కువే. ఇదే కార‌ణంతో వారి కోసం కొన్ని ప్ర‌త్యేక‌మైన పాల‌సీల‌ను బీమా సంస్థ‌లు అందిస్తున్నాయి.

ఏమేం చూడాలి?

సీనియ‌ర్ సిటిజ‌న్స్ కోసం కొన్ని విలువ జ‌త‌చేరిన సేవ‌లను పాల‌సీతో పాటు అందిస్తున్నారు. అవి ఇంటి వ‌ద్ద సంర‌క్ష‌ణ‌, వెల్‌నెస్ సంబంధిత సేవ‌లు లాంటివ‌న్న మాట‌. సీనియ‌ర్ సిటిజ‌న్స్ కోస‌మే ప్ర‌త్యేకంగా ఆరోగ్య పాల‌సీ ఎంచుకోవాలంటే అంత సుల‌భం కాదు. అయితే ఇలాంటిది ఒక‌టి కొనేముందు ఏమేం చూడాలో ఇప్పుడు తెలుసుకుందాం…

కొన్ని పాల‌సీలు ప్ర‌త్యేకంగా వ‌యో వృద్ధుల కోస‌మే కాక‌పోయినా… క‌వ‌రేజీ, ధ‌ర‌, పాల‌సీ జారీ విధానం వారికి అనుకూలంగా మారుస్తున్నారు.

సీనియ‌ర్ సిటిజ‌న్స్ ఇచ్చే పాల‌సీల్లో కొన్ని ప్ర‌త్యేక‌మైన‌ అనారోగ్యాల కోసం చెల్లించే ప‌రిహారంలో ప‌రిమితులు, ఉప‌-ప‌రిమితులు అనేకం ఉంటాయి.

ప్రీ-ఎగ్జిస్టింగ్ వ్యాధులు

  • సాధార‌ణంగా ఏదైనా ఆరోగ్య పాల‌సీ ప్రీ-ఎగ్జిస్టింగ్ వ్యాధుల‌కు నాలుగేళ్ల దాకా ఎలాంటి క‌వ‌రేజీని ఇవ్వ‌వు. అయితే సీనియ‌ర్స్ సిటిజ‌న్స్ కోసం కొన్ని బీమా సంస్థ‌లు ఈ వెయిటింగ్ పీరియ‌డ్‌ని త‌గ్గించేస్తున్నాయి.

  • డ‌యాబెటిస్‌, హైప‌ర్‌టెన్ష‌న్ లాంటి అనారోగ్య సమ‌స్య‌ల లాంటి వాటికి క‌నీసం 4 ఏళ్ల వెయిటింగ్ పీరియ‌డ్ ఉంటుంది. ఇలాంటి స‌మ‌స్య‌లున్న‌వారికి కొన్ని బీమా సంస్థ‌లు పాల‌సీని నిరాక‌రించ‌వ‌చ్చు. అయితే సీనియ‌ర్ సిటిజ‌న్స్ కోసం ఈ అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు కొన్ని బీమా సంస్థ‌లు క‌వ‌రేజీ ఇస్తున్నాయి.

  • క్యాట‌రాక్ట్‌, ఫ్రాక్చ‌ర్‌, జాయింట్ స‌ర్జ‌రీలు లాంటి కొన్ని ర‌కాల చికిత్స‌ల‌కు ప‌రిహారం అందించ‌డంలో కొన్ని ప‌రిమితులు ఉన్నాయి.

ప్రీమియం

  • వ‌య‌సు పెరిగే కొద్దీ ప్రీమియం రేట్లు పెరుగుతుంటాయన్న సంగ‌తి తెలిసిందే. అయితే సీనియ‌ర్ సిటిజ‌న్స్ కోస‌మే ఉద్దేశించిన పాల‌సీల‌ను సాధార‌ణ ఆరోగ్య పాల‌సీల‌కు చెల్లించే ప్రీమియంతో పోల్చి చూడ‌లేం.

  • సాధార‌ణ ఆరోగ్య పాల‌సీల్లో వ‌యో వృద్ధుల‌కు ప్రీమియం ఎక్కువ‌గా ఉంటుంది. అయితే సీనియ‌ర్స్ సిటిజ‌న్స్ కోస‌మే ప్ర‌త్యేకమైన వాటిలో ప్రీమియం త‌క్కువ‌గా ఉంటుంది.

  • పాల‌సీ కొనుగోలు చేసేందుకు ప్రోత్స‌హించే విధంగా బీమా సంస్థ‌లు కావాల‌నే ప్రీమియంలు త‌క్కువ‌గా ఉంచుతాయి.

  • ప్రీమియంలో ఈ త‌గ్గుద‌ల‌ను త‌ర్వాత క్లెయిం చేసుకునేట‌ప్పుడు బీమా సంస్థ‌లు కో-పే, ఉప‌-ప‌రిమితుల‌తో భ‌ర్తీ చేసుకుంటాయ‌న్న సంగ‌తిని గ‌మ‌నించాలి.

  • 60ఏళ్ల వ‌య‌సు త‌ర్వాత పాల‌సీ తీసుకునేవారికి ప్రామాణిక కో-పే ష‌ర‌తు పెడ‌తాయి బీమా సంస్థ‌లు. పాల‌సీ తీసుకునేవారు ఇది వ‌ర‌కు అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డితే వారికి కో-పే, ఉప‌-ప‌రిమితులు విధించ‌డం స‌ర్వ‌సాధార‌ణం.

కో-పే అంటే…

  • క్లెయిం చేసుకున్న త‌ర్వాత కొంత ఖ‌ర్చుల‌ను పాల‌సీదారు భ‌రించాలి. ఏ నిష్ప‌త్తిలో భ‌రించాల‌న్న విష‌యాన్ని పాల‌సీలో పేర్కొంటారు.

  • 10శాతం కో-పే అంటే క్లెయిం సొమ్ములో 10శాతాన్ని పాల‌సీదారే చెల్లించాలి. మిగ‌తాది బీమా సంస్థ ఇస్తుంది.

తీవ్ర రుగ్మ‌త‌ల‌కు

సీనియ‌ర్ సిటిజ‌న్స్‌కు ఉద్దేశించిన‌ ప్ర‌త్యేక పాల‌సీలు కీళ్ల నొప్పుల‌కు, ఉపిరితిత్తుల వ్యాధుల‌కు, గుండె సంబంధిత చికిత్స‌ల‌కు ప‌రిహారం ఇస్తున్నా పాల‌సీ కొనుగోలు చేసే ముందు ఎన్నో అంశాల‌ను గ‌మ‌నించాల్సి ఉంటుంది.
అవి…

  • వెయిటింగ్ పీరియ‌డ్‌

  • సుల‌భంగా కొన‌గ‌లిగేలా ఉండ‌డం

  • మెడిక‌ల్ స్క్రీనింగ్ కోసం ముంద‌స్తు అనుమ‌తి

  • ఔట్ పేషెంట్ సేవ‌ల‌కు క‌వ‌రేజీ

గ‌ది అద్దెపై ప‌రిమితులు

  • ఆసుప‌త్రిలో చికిత్స కోసం గ‌ది అద్దెకు తీసుకున్నప్పుడు అద్దెపై ప‌రిమితులున్నాయోమే చూసుకోవాలి.

  • సాధార‌ణంగా రూ.5ల‌క్ష‌ల‌పైన క‌వ‌రేజీ ఉన్న పాల‌సీల‌కు గ‌ది అద్దెపై ప‌రిమితులుండ‌వు.

ప‌ద‌వీ విర‌మ‌ణ దాకా వేచి చూడ‌కండి

ప్ర‌స్తుతం మీ కంపెనీ బృంద ఆరోగ్య పాల‌సీలో మిమ్మ‌ల్ని భాగం చేసిన‌ట్ల‌యితే మీ ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సు దాకా వేచిచూడాల్సిన అవ‌స‌రం లేదు. ముందుగా కొన్న‌ట్ల‌యితే ఏవైనా అనారోగ్య స‌మ‌స్య‌లకు వెయిటింగ్ పీరియ‌డ్ కూడా అయిపోయి మీ ప‌ద‌వీ విర‌మ‌ణ నాటికి ప‌రిమితులు లేని పూర్తి పాల‌సీ అందుబాటులోకి వ‌స్తుంది.

అనారోగ్య‌ ప‌రిస్థితులు ఉన్న‌ సీనియ‌ర్స్ సిటిజ‌న్స్ కు పాల‌సీ ఇచ్చేందుకే బీమా సంస్థ‌లు స‌ముఖత చూపిస్తాయి. ఆ వ‌య‌సులో సాధార‌ణ ఆరోగ్య పాల‌సీ కంటే ప్ర‌త్యేకంగా వారి కోస‌మే ఉన్న పాల‌సీ అందుబాటు ధ‌ర‌లో ఉంటుంది.

ఇంత వ‌ర‌కు ఎలాంటి ఆరోగ్య పాల‌సీ కొనుగోలు చేయ‌నివారు సీనియ‌ర్స్ సిటిజ‌న్స్ ప్ర‌త్యేక పాల‌సీని తీసుకునేందుకు ప‌రిశీలించ‌వ‌చ్చు. అయితే కొనేముందు పాల‌సీ నియ‌మ‌నిబంధ‌న‌లు క్షుణ్ణంగా తెలుసుకొని ఉండాలి.

(SourceLiveMint)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు