Health Insurance: ఆస్పత్రిలో 24గంటలు లేకున్నా.. ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ చేసుకోవచ్చా..!

ఆరోగ్య బీమా (Health Insurance) ఉన్న వారు అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి..  24గంటలలోపే డిశ్చార్జి అయినప్పటికీ ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌  (Medical Claim) పొందవచ్చని గుజరాత్‌లోని ఓ వినియోగదారుల ఫోరం వెల్లడించింది. ఈ కారణాలతో క్లెయిమ్‌ తిరస్కరించలేరని బీమా సంస్థకు స్పష్టం చేసింది.

Updated : 15 Mar 2023 18:54 IST

వడోదర: ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రుల్లో చేరే వారికి ఆరోగ్య బీమా (Health Insurance) ఉన్నప్పటికీ ఒక్కోసారి అవి తిరస్కరణకు గురవుతుంటాయి. రోగి ఆస్పత్రిలో చేరకపోవడం, ఒకరోజు మొత్తం ఆస్పత్రిలో ఉండలేదనే కారణాలతో బీమా కంపెనీలు మెడికల్‌ క్లెయిమ్‌లను (Medical Claim) తిరస్కరిస్తుంటాయి. అయితే, చికిత్స కోసం వెళ్లిన రోగులు ఆస్పత్రిలో చేరి 24 గంటలు పూర్తికాకున్నా, ఆస్పత్రిలో చేరకున్నా.. బీమా క్లెయిమ్‌ చేసుకోవచ్చని గుజరాత్‌లోని ఓ వినియోగదారుల ఫోరమ్‌ (Consumer Forum) తీర్పు వెలువరించింది. బీమా కంపెనీ క్లెయిమ్‌ తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన ఫోరం.. ప్రస్తుతమున్న సాంకేతిక పరిజ్ఞానంతో చికిత్సలు ఎంతో వేగంగా జరుగుతున్నాయని పేర్కొంటూ బాధితులకు క్లెయిమ్‌ చెల్లించాలని ఆదేశించింది.

గుజరాత్‌లోని వడోదరకు చెందిన రమేష్‌ చంద్రజోషి భార్య అనారోగ్యానికి గురై... 2016లో అహ్మదాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేరారు. చికిత్స అనంతరం మరుసటి రోజు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. వారికి ఇన్సూరెన్స్‌ ఉండటంతో క్లెయిమ్‌ కోసం దరఖాస్తు చేసుకోగా అది తిరస్కరణకు గురయ్యింది. అందుకు రోగి 24 గంటలపాటు ఆస్పత్రిలో లేరనే కారణాన్ని సదరు బీమా సంస్థ చూపించింది. దీనిని సవాలు చేస్తూ 2017లో వడోదరలోని వినియోగదారుల ఫోరం (CDRC)ను బాధితులు ఆశ్రయించారు. నవంబర్‌ 24 సాయంత్రం 5.38గంటలకు ఆస్పత్రిలో చేరి, మరుసటి రోజు సాయంత్రం 6.30కి డిశ్చార్జి అయ్యామని పేర్కొంటూ తగు ఆధారాలు అందించారు.

పిటిషన్‌ను పరిశీలించిన వడోదర వినియోగదారుల ఫోరం.. ‘కొత్తగా వస్తున్న సాంకేతికతతో ఆస్పత్రుల్లో చేరిన తక్కువ సమయంలోనే చికిత్స పూర్తికావడం లేదా ఒక్కోసారి ఆస్పత్రుల్లో చేరకుండానే రోగులకు చికిత్స పూర్తవుతోంది. ఇటువంటి సమయంలో బీమా కంపెనీ క్లెయిమ్‌ను తిరస్కరించలేదు’ అని వినియోగదారుల ఫోరం అభిప్రాయపడింది. దీంతో క్లెయిమ్‌తోపాటు బీమా చేయించుకున్న వ్యక్తిని మానసికంగా వేధించినందుకు రూ.3వేలు, వ్యాజ్యం ఖర్చులు రూ.2వేలు కలిపి చెల్లించాలని బీమా సంస్థను ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని