car sales: కార్ల రిటైల్‌ అమ్మకాలకు వడదెబ్బ

భారత్‌లో ప్రయాణికుల వాహనాల (పీవీ- కార్లు, ఎస్‌యూవీలు, వ్యాన్ల) రిటైల్‌ విక్రయాలు జూన్‌లో నెమ్మదించాయి.

Updated : 06 Jul 2024 02:27 IST

 జూన్‌లో 7% తగ్గిన రిటైల్‌ విక్రయాలు

దిల్లీ: భారత్‌లో ప్రయాణికుల వాహనాల (పీవీ- కార్లు, ఎస్‌యూవీలు, వ్యాన్ల) రిటైల్‌ విక్రయాలు జూన్‌లో నెమ్మదించాయి. తీవ్ర వేడి, ఉక్కబోత కారణంగా షోరూములకు ప్రజలు 15% తక్కువగా రావడమే ఇందుకు కారణమని వాహన డీలర్ల సమాఖ్య ఫాడా పేర్కొంది. 2023 జూన్‌లో 3,02,000 పీవీలకు ఆర్‌టీఏ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ జరగ్గా, గత నెలలో 7% తక్కువగా 2,81,566 పీవీలే రిజిస్టర్‌ అయ్యాయని తెలిపింది. దేశంలో 1700 ఆర్‌టీఏ కార్యాలయాలుండగా, 1567 కార్యాలయాల నుంచి సేకరించిన వివరాలతో ఫాడా ఈ నివేదిక రూపొందించింది.

వాహనాలు అందుబాటులోనే: గిరాకీకి తగ్గట్లుగా వాహనాల లభ్యత పెరిగింది. రాయితీలూ కొనసాగాయి. అయితే రుతు పవనాల రాక ఆలస్యం కావడం, ఎండ వేడిమి అధికంగా ఉండడంతో.. వాహన షోరూమ్‌లకు వచ్చే వారి సంఖ్య 15% తగ్గిందని ఫాడా అధ్యక్షుడు మనీశ్‌ రాజ్‌ సింఘానియా తెలిపారు.

‘పరిశ్రమ వృద్ధి నెమ్మదించొచ్చు’: వాహనం కోసం వినియోగదార్ల విచారణలు తగ్గడంతో పాటు, కొనుగోలు నిర్ణయాలను వాయిదా వేసుకోవడం వల్ల సవాళ్లు ఎదురవుతున్నాయని డీలర్ల నుంచి సమాచారం అందినట్లు ఆయన తెలిపారు. వాహన నిల్వల స్థాయి కూడా జీవనకాల గరిష్ఠమైన 62-67 రోజులకు చేరిందని వివరించారు. పండగ సీజనుకు ఇంకా సమయం ఉన్నందున, ఉత్పత్తిపై వాహన తయారీదార్లు జాగ్రత్తగా వ్యూహాలు రచించుకోవాలని; తద్వారా అధిక వడ్డీ వ్యయాల ఒత్తిడి తగ్గించుకోవాలని సూచించారు. వ్యవసాయ రంగం, మౌలిక ప్రాజెక్టుల మందగమనానికీ అధిక ఉష్ణోగ్రతలు కారణంగా నిలవడంతో, వాహన పరిశ్రమ వృద్ధి కూడా నెమ్మదించొచ్చని ఆయన అంచనా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని