GTRI: యూఏఈ నుంచి భారీగా పసిడి, వెండి దిగుమతి

యూఏఈ నుంచి భారత్‌కు పసిడి, వెండి దిగుమతులు 2023-24లో 210% పెరిగాయని ఆర్థిక మేధో సంస్థ గ్లోబల్‌ ట్రేడ్‌ రీసెర్చ్‌ ఇనీషియేటివ్‌ (జీటీఆర్‌ఐ) వెల్లడించింది.

Published : 18 Jun 2024 03:39 IST

2023-24లో 210% వృద్ధితో రూ.89,000 కోట్ల స్థాయికి: జీటీఆర్‌ఐ

దిల్లీ: యూఏఈ నుంచి భారత్‌కు పసిడి, వెండి దిగుమతులు 2023-24లో 210% పెరిగాయని ఆర్థిక మేధో సంస్థ గ్లోబల్‌ ట్రేడ్‌ రీసెర్చ్‌ ఇనీషియేటివ్‌ (జీటీఆర్‌ఐ) వెల్లడించింది. యూఏఈతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) అమలవుతున్నందున, సుంకాల్లో రాయితీలున్నాయని.. దీన్ని వినియోగించకుని గత ఆర్థిక సంవత్సరంలో పసిడి, వెండి కలిపి 10.7 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.89,000 కోట్ల) మేర భారత్‌లోని వాణిజ్య సంస్థలు దిగుమతి చేసుకున్నాయని నివేదిక తెలిపింది.  

  • యూఏఈ నుంచి వెండి ఎంత దిగుమతి చేసుకున్నా, దిగుమతి సుంకంలో భారత్‌ 7% రాయితీ ఇస్తోంది. 160 మెట్రిక్‌ టన్నుల పసిడి దిగుమతిపై 1% సుంకం రాయితీ ఇచ్చింది. ప్రైవేటు సంస్థలు గిఫ్ట్‌ సిటీలోని ఇండియా ఇంటర్నేషనల్‌ బులియన్‌ ఎక్స్ఛేంజ్‌ (ఐఐబీఎక్స్‌) ద్వారా యూఏఈ నుంచి పసిడి, వెండి దిగుమతి చేసుకునే అవకాశం ఉన్నందున వీటి దిగుమతులు బాగా పెరిగాయని జీటీఆర్‌ఐ తెలిపింది.
  • 2022-23లో యూఏఈ నుంచి మొత్తం దిగుమతులు 53.2 బి.డాలర్లు (సుమారు రూ.4.42 లక్షల కోట్లు) కాగా, 2023-24లో ఇవి 9.8% తగ్గి 48 బి.డాలర్ల (సుమారు రూ.3.98 లక్షల కోట్ల)కు పరిమితం అయ్యాయి. ఇదే సమయంలో పసిడి-వెండి దిగుమతులు మాత్రం 3.5 బి.డాలర్ల (సుమారు రూ.29,000 కోట్ల) నుంచి 210% పెరిగి 10.7 బి.డాలర్ల (సుమారు రూ.89,000 కోట్ల)కు చేరాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని