GST: జీఎస్‌టీ తొలగిస్తే.. అందుబాటు ధరకు హెల్మెట్లు

హెల్మట్లపై వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) తొలగిస్తే, వాటి ధరలు తగ్గి, మరింతమంది నాణ్యమైనవి వినియోగించుకుంటారని జీఎస్‌టీ మండలి - ఆర్థిక శాఖను ఇంటర్నేషనల్‌ రోడ్‌ ఫెడరేషన్‌ (ఐఆర్‌ఎఫ్‌) కోరింది.

Published : 13 Jun 2024 02:22 IST

ఐఆర్‌ఎఫ్‌ వినతి

దిల్లీ: హెల్మట్లపై వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) తొలగిస్తే, వాటి ధరలు తగ్గి, మరింతమంది నాణ్యమైనవి వినియోగించుకుంటారని జీఎస్‌టీ మండలి - ఆర్థిక శాఖను ఇంటర్నేషనల్‌ రోడ్‌ ఫెడరేషన్‌ (ఐఆర్‌ఎఫ్‌) కోరింది. ప్రస్తుతం హెల్మట్లపై 18% జీఎస్‌టీ విధిస్తున్నారు. ద్విచక్ర వాహనదార్లే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలకు గురవుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. జీఎస్‌టీని పూర్తిగా పరిహరిస్తే, హెల్మట్ల ధర తగ్గడమే కాకుండా, నాణ్యమైన ఉత్పత్తులు వాడేలా ప్రోత్సహించినట్లు అవుతుందని ఐఆర్‌ఎఫ్‌ తెలిపింది. ‘ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాద మరణాలో,్ల భారత్‌లోనే 12% చోటుచేసుకున్నట్లు’ వెల్లడించిన బాష్‌ నివేదికను ఐఆర్‌ఎఫ్‌ ఉటంకించింది. ఈ ప్రమాదాల వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు 15.71- 38.81 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 1.30- 3.22 లక్షల కోట్ల) మేర ఆర్థిక నష్టం వాటిల్లుతోందని తెలిపింది. ‘ద్విచక్ర వాహనదార్లే రోడ్డు ప్రమాదాలకు ఎక్కువగా గురవుతున్నారు. ముఖ్యంగా తలకు గాయం అవుతుండటం వల్ల, రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వాళ్లలో వీళ్ల సంఖ్యే సుమారు 31.4 శాతంగా ఉంటోంది. ద్విచక్ర వాహన ప్రమాదాలు, మరణాలు తగ్గించేందుకు చేపట్టాల్సిన ముఖ్య చర్యల్లో హెల్మట్లను వాడేలా ప్రోత్సహించడం కూడా ఒకటి’ అని ఐఆర్‌ఎఫ్‌ గౌరవ ప్రెసిడెంట్‌ కె కె కపిలా తెలిపారు. ద్విచక్ర వాహనదార్లలో చాలా మంది ఆర్థికంగా బలహీన వర్గాల వాళ్లే కావడంతో భారత్‌లో నాణ్యమైన హెల్మట్ల వాడకం తక్కువగా ఉన్నట్లు తాము గుర్తించామని వెల్లడించారు. పేదలు చౌకగా దొరుకుతున్న, నాణ్యత తక్కువగా ఉన్న హెల్మెట్లు వాడుతున్నందున, ప్రమాదాలు జరిగినప్పుడు వాటివల్ల ఉపయోగం ఉండటం లేదన్నారు. హెల్మెట్లపై జీఎస్‌టీని 0% చేస్తే, నాణ్యమైన హెల్మట్లు కూడా అందుబాటు ధరలో లభిస్తాయని, తద్వారా ద్విచక్ర వాహనదారుల ప్రాణాలు కాపాడొచ్చని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని