Updated : 28 Jan 2022 15:10 IST

Union Budget 2022 :గేర్‌ మార్చి.. స్పీడు పెంచాలి..!

 బడ్జెట్‌పైనే ఆటోమొబైల్‌ పరిశ్రమ ఆశలు

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

కరోనా ఫస్ట్‌వేవ్‌కు ముందు నుంచీ ఆటో మొబైల్‌ పరిశ్రమ కష్టాలను ఎదురొడ్డి ఇటీవల మెల్లగా పుంజుకొంటోంది. దాదాపు రూ.8లక్షల కోట్ల విలువైన ఈ పరిశ్రమ నుంచి దేశ జీడీపీకి దాదాపు 7 శాతం ఆదాయం సమకూరుతోంది. వాస్తవానికి అతిపెద్ద ఆటోమొబైల్‌ మార్కెట్లలో భారత్‌ ఒకటి. కానీ.. ఐరోపా సమాఖ్యతో  పోలిస్తే ఆటోమొబైల్‌ పరిశ్రమ తగినన్ని ఉద్యోగాలు కల్పించలేక పోతోందని గణాంకాలు చెబుతున్నాయి. కరోనా సమయంలో విక్రయాలు కుంగడంతో ఆటోమొబైల్‌ అనుబంధ పరిశ్రమల్లో దాదాపు 3.5లక్షల ఉద్యోగాలు పోయాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్‌-2022లో కేంద్రం తీసుకొనే నిర్ణయాలు ఆటోమొబైల్‌ పరిశ్రమను తీవ్రంగా ప్రభావితం చేయనున్నాయి. ముఖ్యంగా పన్ను మినహాయింపులు లభిస్తే విక్రయాలు పెరిగే అవకాశం ఉంది.

ఫేమ్‌-2 రాయితీలను పొడిగించాలి..

ఈ సారి బడ్జెట్‌లో అత్యధికంగా చర్చకు వచ్చే అంశం ఫేమ్‌-2 (ఫాస్టర్‌ అడాప్షన్‌ అండ్‌ మ్యానిఫ్యాక్చరింగ్‌ ఆఫ్‌ హైబ్రీడ్‌ అండ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్‌) అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా విద్యుత్తు వాహనాల తయారీ, ఛార్జీంగ్‌ సర్వీసుల ఏర్పాటును ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఫేమ్‌-2 పథకాన్ని 2023 తర్వాత కూడా కొనసాగించాలని పరిశ్రమ కోరుకుంటోంది. ముఖ్యంగా తక్కువ వేగంతో ప్రయాణించే విద్యుత్తు వాహనాల తయారీదారులకు ఈ పథకం ప్రయోజనాలను విస్తరించాలని కోరుకొంటున్నారు.

మరో పీఎల్‌ఐ పథకం అవసరం..

ఆటోమొబైల్‌ పరిశ్రమ వృద్ధికి పెట్టుబడులు ప్రాణవాయువు వంటివి. నిరంతర పరిశోధనలు, సరికొత్త ఉత్పత్తులను తీసుకురావడం వంటివి ఆటో మొబైల్‌ పరిశ్రమకు బలాన్ని చేకూరుస్తాయి. ఈ నేపథ్యంలో పీఎల్‌ఐ (ప్రొడక్షన్‌ లింక్డ్‌ ఇన్సెంటీవ్‌) స్కీమ్‌ను తీసుకురావాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది. రూ.25 కోట్లకు మించి  ప్లాంట్‌, మెషనరీ మీద చేసే వ్యయాలపై 15శాతం వరకు సంస్థకు ఇన్వెస్ట్‌మెంట్‌ అలవెన్స్‌గా ఇవ్వాలని కోరుతున్నారు. ఇది ముఖ్యంగా బీఎస్‌-6 వాహనాలను మరింత మెరుగుపర్చేందుకు, విద్యుత్తు వాహనల అభివృద్ధికి గణనీయంగా ఉపయోగపడుతుంది.

బయో ఫ్యూయల్‌ మెరుగుపర్చేందుకు..

ఈ సారి బడ్జెట్‌లో ప్రభుత్వం బయో ఫ్యూయల్‌ ఆధారిత వాహనాలను తీసుకొచ్చేలా ఆటోమొబైల్‌ పరిశ్రమను కోరే అవకాశం ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వ రంగ చమురు సంస్థలను దేశంలోని వివిధ ప్రాంతాల్లో రెండోతరం బయో ఫ్యూయల్‌ రిఫైనరీలను ఏర్పాటు చేయాలని కోరవచ్చు. 

వినియోగదారులకు పన్ను రాయితీలు..

తమ వాహనాల అరుగుదలను క్లెయిమ్‌ చేసుకొని వినియోగదారులు ఐటీ రిటర్నుల్లో క్లెయిమ్‌ చేసి పన్ను లబ్ధి పొందే అవకాశం ఇవ్వాలని ఎఫ్‌ఏడీఏ (ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోయేషన్‌) కోరుతోంది. ఈ రాయితీలు ఆటోమొబైల్‌ పరిశ్రమలో విక్రయాలను పెంచేందుకు గణనీయంగా ఉపయోగపడతాయి.  పరోక్ష మార్గంలో ప్రభుత్వానికి జీఎస్‌టీ ఆదాయం కూడా మెరుగుపడుతుంది. ప్రజలకు, ప్రభుత్వానికి, పరిశ్రమకు ప్రయోజనకరంగా ఉండే రాయితీపై బడ్జెట్‌లో నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

మరోసారి తరుగుదల పథకాన్ని ప్రవేశపెట్టాలని ఎఫ్‌ఏడీఏ కోరుతోంది. ఈ పథకాన్ని 2022-23 ఆర్థిక సంవత్సరంలో కొనసాగించాలని అభ్యర్థిస్తోంది. దీంతోపాటు 31 మార్చి 2020 వాహనాలపై తరుగుదల రేటును పెంచితే ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొంది.

సెమీకండెక్టర్లపై దృష్టి..

భారత్‌లో దాదాపు రెండేళ్ల తర్వాత 2021లో ఆటో మొబైల్‌ పరిశ్రమ కోలుకొంది. ప్రజలు కొవిడ్‌ కారణంగా వ్యక్తిగత వాహనాలకు ప్రాధాన్యమివ్వడం దీనికి ప్రధాన కారణం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఎనిమిది నెలల్లో విక్రయాలు 26 శాతం వృద్ధి చెందాయి. సెమీకండెక్టర్ల కొరతతో ఉత్పత్తిలో కోతలు విధించినా.. ఈ స్థాయిలో వాహనాలు అమ్ముడుపోయాయి. ఈ నేపథ్యంలో దేశీయంగా సెమీకండెక్టర్ల తయారీని వేగవంతం చేయాలని  పరిశ్రమ వర్గాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

జీఎస్‌టీ పై పరిశ్రమ పట్టు..

బీఎస్-6 నిబంధనలు అమల్లోకి వచ్చినప్పటి నుంచి ద్విచక్ర వాహన మార్కెట్‌ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు కొవిడ్‌ ఎఫెక్ట్‌ తాకడంతో ఈ పరిస్థితి నెలకొంది. నవంబర్‌ నాటికి విక్రయాలు 5.5 శాతం కుంగాయి. ఈ నేపథ్యంలో ద్విచక్ర వాహనాలపై జీఎస్‌టీ సవరించాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. దీనిని 18శాతానికి తీసుకురావాలనే డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉంది.

* ముడి సరుకుల ధరలు పెరగడంతో ప్రతి మూడు నెలలకు వాహన ధరలను పెంచాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో జీఎస్‌టీని తగ్గిస్తే .. అంతిమంగా ఆ ప్రయోజనం వినియోగదారుడికి చేరే అవకాశం ఉంది.

* సెకండ్‌ హ్యాండ్‌ కార్లపై జీఎస్‌టీని కూడా 5శాతం తగ్గించాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని