Hero MotoCorp: విడా వీ1 ప్రో ధర రూ.6,000 పెంపు

Hero MotoCorp: ఫేబ్‌-II రాయితీని ప్రభుత్వం తగ్గించిన నేపథ్యంలో విద్యుత్‌ ద్విచక్ర వాహన సంస్థలు ధరల్ని పెంచుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా హీరోమోటోకార్ప్‌ తమ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది.

Published : 04 Jun 2023 15:53 IST

దిల్లీ: హీరో మోటోకార్ప్‌ (Hero MotoCorp) తమ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ విడా వీ1 ప్రో ధర (VIDA V1 Pro Price)ను పెంచింది. ఇప్పటి వరకు విద్యుత్‌ ద్విచక్ర వాహనాలపై ప్రభుత్వం ఇచ్చిన రాయితీని తగ్గించిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. రాయితీ తగ్గింపు వల్ల పెరిగిన ధరల భారాన్ని కొంత వరకు మాత్రమే కస్టమర్లకు బదిలీ చేస్తున్నామని పేర్కొంది.

విడా వీ1 ప్రో ధర (VIDA V1 Pro Price) ఇప్పుడు రూ.1,45,900. ఫేమ్‌-II రాయితీ, పోర్టబుల్‌ ఛార్జర్‌ ధర కూడా దీంట్లో భాగమే. క్రితంతో పోలిస్తే ధర ఇప్పుడు రూ.6,000 పెరిగింది. ధర పెంపును ఓ కంపెనీ డీలర్‌ ధ్రువీకరించారు. కానీ, కంపెనీ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఫేమ్‌-II రాయితీ (FAME II subsidy) కింద గతంలో ప్రభుత్వం విద్యుత్‌ ద్విచక్ర వాహనాల ఎక్స్‌- ఫ్యాక్టరీ ధరపై 40 శాతం వరకు రాయితీ ఇచ్చింది. దాన్ని ఇటీవల కేంద్ర భారీ పరిశ్రమల శాఖ 15 శాతానికి కుదించింది. దీని వల్ల ఒక్కో యూనిట్‌పై దాదాపు రూ.32,000 రాయితీని కస్టమర్లు కోల్పోతున్నారని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

జూన్‌ 1 నుంచి తగ్గించిన రాయితీ అమల్లోకి వచ్చింది. దీంతో ఇప్పటికే పలు విద్యుత్‌ ద్విచక్ర వాహన (Electric two wheeler) తయారీ సంస్థలు ధరల్ని పెంచాయి. టీవీఎస్‌ మోటార్‌ తమ ఐక్యూబ్‌ స్కూటర్‌ ధరను రూ.17 వేల నుంచి వేరియంట్‌ను బట్టి రూ.22 వేల వరకు పెంచింది. ఏథర్‌, ఓలా సైతం తమ స్కూటర్ల ధరలను పెంచాయి. హీరో ఎలక్ట్రిక్‌ మాత్రం ధరలను పెంచడం లేదని ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని