Hero vida: మార్కెట్లోకి త్వరలో హీరో విడా ఎంట్రీ.. ఛార్జింగ్‌ కష్టాలకు చెక్‌..?

హీరో త్వరలో లాంచ్‌ చేయబోయే విద్యుత్‌ స్కూటర్‌లో స్వాపబుల్‌ బ్యాటరీ టెక్నాలజీని తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.

Updated : 23 Nov 2022 11:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విద్యుత్‌ స్కూటర్లు మన మార్కెట్లోకి ప్రవేశించి చాలా రోజులు అవుతున్నా.. వాటి అమ్మకాలు అంతంత మాత్రమే. ఇప్పటికీ పెట్రోల్‌తో నడిచే ద్విచక్ర వాహనాలదే హవా. దూర ప్రాంతాలకు విద్యుత్‌ వాహనాలు అనువుగా లేకపోవడం, ఛార్జింగ్‌కు కొన్ని గంటల సమయం తీసుకోవడం వంటివి వినియోగదారుల్ని నిరాశ పరుస్తున్నాయి. ఈ ఛార్జింగ్‌ సమస్యకు చెక్‌ పెట్టేందుకు హీరో మోటోకార్ప్‌ సిద్ధమవుతోంది. త్వరలో లాంచ్‌ చేయబోయే విద్యుత్‌ స్కూటర్‌లో స్వాపబుల్‌ బ్యాటరీ టెక్నాలజీని తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.

విడా బ్రాండ్‌ను అక్టోబర్‌ 7న హీరో మోటోకార్ప్‌ తీసుకొస్తోంది. స్కూటర్‌ లాంచ్‌ డేట్‌ దగ్గర పడిన నేపథ్యంలో ప్రచారం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ‘ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ వాహనాన్ని ఛార్జ్‌ చేసుకోండి’ అంటూ ఆ కంపెనీ ఓ ట్వీట్లో పేర్కొంది. ఇంటి వద్దైనా.. ఛార్జింగ్‌ స్టేషన్లలోనైనా మీ స్కూటర్‌ను ఛార్జ్‌ చేసుకోవచ్చని తెలిపింది. దీనిబట్టి స్వాపబుల్‌ బ్యాటరీ టెక్నాలజీతో ఈ స్కూటర్‌ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న విద్యుత్‌ స్కూటర్ల మాదిరిగా ఇంటి వద్ద కూడా ఛార్జింగ్‌ చేసుకునే విధంగా ఈ స్కూటర్‌ను తీర్చిదిద్దినట్లు అర్థమవుతోంది.

తైవాన్‌కు చెందిన గోగోరో అనే బ్యాటరీ స్వాపింగ్‌ ప్లాట్‌ఫాంతో హీరో మోటోకార్ప్‌ 2021 ఏప్రిల్‌లోనే వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ కంపెనీ దేశంలో హీరోకు బ్యాటరీ స్వాపింగ్‌ సదుపాయాన్ని కల్పిస్తుంది. స్వాపబుల్‌ బ్యాటరీ సదుపాయంతో ఇది వరకే బౌన్స్‌ ఇన్ఫినిటీ సంస్థ.. E1 స్కూటర్‌ను తీసుకొచ్చింది. మరి హీరో తీసుకొస్తున్న ఈ స్కూటర్‌లో ఇంకా ఏమేం సదుపాయాలు ఉన్నాయో తెలియాలంటే విడుదల వరకు వేచి చూడాల్సిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని