Hero MotoCorp: హీరో మోటోకార్ప్‌ కొత్త బ్రాండ్‌.. విద్యుత్తు వాహనాలు ఈ పేరుతోనే

భారత్‌లో అతిపెద్ద ద్విచక్రవాహన తయారీ సంస్థ హీరోమోటోకార్ప్‌ మరో కొత్త బ్రాండ్‌ను ఆవిష్కరించింది....

Updated : 04 Mar 2022 13:45 IST

దిల్లీ: భారత్‌లో అతిపెద్ద ద్విచక్రవాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌ మరో కొత్త బ్రాండ్‌ను ఆవిష్కరించింది. విద్యుత్తు వాహనాలు సహా రానున్న కొత్తతరం వాహన ఉత్పత్తులను ‘విడా’ పేరిట తీసుకురానున్నట్లు ప్రకటించింది. సంస్థ గౌరవ ఛైర్మన్‌ డాక్టర్‌ బ్రిజ్‌మోహన్‌ లాల్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని జులై 1, 2022న విడా బ్రాండ్‌ కింద తొలి విద్యుత్తు వాహనాన్ని ఆవిష్కరించనున్నట్లు కంపెనీ తెలిపింది. చిత్తూరులోని తయారీ కేంద్రంలో తొలి విద్యుత్తు మోడల్‌ను ఉత్పత్తి చేయనున్నారు. 2022 ఆఖరి నెలల్లో వినియోగదారులకు అందజేయనున్నారు.

విడా బ్రాండ్‌ను పరిచయం చేసిన సంస్థ ఛైర్మన్‌, సీఈఓ డాక్టర్‌ పవన్‌ ముంజల్‌ 100 మిలియన్‌ డాలర్ల ‘గ్లోబల్‌ సస్టైనబిలిటీ ఫండ్‌’ను ఆవిష్కరించారు. ప్రపంచవ్యాప్తంగా బ్రాండ్‌ బలోపేతంలో భాగంగా వివిధ భాగస్వామ్యాలు కుదుర్చుకునేందుకు ఈ నిధుల్ని వినియోగించనున్నారు. మొత్తం 10,000 ఎంటర్‌ప్రెన్యూర్‌లను ప్రోత్సహించనున్నారు.

‘‘విడా అంటే జీవితం. ప్రపంచంపై సానుకూల ప్రభావాన్ని సృష్టిస్తూ అందరినీ అర్థవంతమైన మార్గాల్లో ముందుకు తీసుకెళ్లడమే ఈ బ్రాండ్ ముఖ్య ఉద్దేశం. మన పిల్లలతో పాటు తరువాతి తరం కోసం మనం చేస్తున్న ఈ కృషికి విడానే సరైన పేరని విశ్వసిస్తున్నాం. ఒక కొత్త విశిష్టతకు ఇదొక ఉషోదయం. ఇప్పటి నుంచి కేవలం 17 వారాలలో మేం ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చడానికి మా విడా వేదిక, ఉత్పత్తులను ఆవిష్కరిస్తాం’’ అని పవన్ తన సందేశంలో వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని