Futures and Options: ఎఫ్‌అండ్‌ఓ ట్రేడ్‌లకు అధిక పన్ను!

అధిక నష్టముప్పుతో కూడిన ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్ల (ఎఫ్‌ అండ్‌ ఓ) విభాగంలో చిన్న మదుపర్లు దూకుడుగా పాల్గొనడాన్ని తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.

Updated : 21 Jun 2024 12:34 IST

చిన్న మదుపర్ల ప్రాతినిథ్యం తగ్గించడమే లక్ష్యం
హెచ్‌ఎఫ్‌టీ లావాదేవీలపై ఎస్‌టీటీ పెంచాలి

దిల్లీ: అధిక నష్టముప్పుతో కూడిన ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్ల (ఎఫ్‌ అండ్‌ ఓ) విభాగంలో చిన్న మదుపర్లు దూకుడుగా పాల్గొనడాన్ని తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగానే ఎఫ్‌అండ్‌ఓ ట్రేడ్‌ లావాదేవీలపై పన్ను పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఓ ఆంగ్ల వార్తా పత్రిక తెలిపింది. ఎఫ్‌అండ్‌ఓ విభాగాన్ని ‘వ్యాపార ఆదాయం’గా కాకుండా ‘స్పెక్యులేటివ్‌ ఆదాయం’గా పునఃవర్గీకరించే అవకాశం ఉందని పేర్కొంది. 

  • వ్యాపార ఆదాయానికి పన్ను చెల్లింపుదార్ల ఆదాయ శ్లాబ్‌ ఆధారంగా 5%, 20%, 30% పన్ను రేట్లు ఉంటాయి. 
  • స్పెక్యులేటివ్‌ ఆదాయాన్ని లాటరీ లేదా క్రిప్టో ట్రేడింగ్‌ కింద పరిగణించి అధిక పన్ను రేటు విధిస్తారు. 
  • స్పెక్యులేటివ్‌ ఆదాయం ద్వారా వచ్చిన లాభాలను ఆ కార్యకలాపాల ద్వారా వాటిల్లిన నష్టాలకు మాత్రమే మినహాయించి, చూపించుకునే వీలుంటుంది. ఇతర వ్యాపార ఆదాయాల ద్వారా వచ్చిన నష్టాలను అందులో కలిపే వీలుండదు. 

మార్కెట్‌ వర్గాల సూచన ఇలా

ఎఫ్‌అండ్‌ఓ ట్రేడ్‌లో చిన్న మదుపర్లను భారీ నష్టాల నుంచి రక్షించాలంటే ఆల్గో బేస్డ్‌ హెడ్జ్‌ ఫండ్స్‌ నిర్వహించే హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్‌పై సెక్యూరిటీల లావాదేవీల పన్ను (ఎస్‌టీటీ) పెంచాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు మార్కెట్‌ వర్గాలు సూచించినట్లు తెలుస్తోంది. రూ.1,000 కోట్లకు మించి ఎఫ్‌అండ్‌ఓ టర్నోవరు నిర్వహించే మదుపర్లకు అధిక ఎస్‌టీటీ విధింపునకు సిఫారసు చేశారని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌ పేర్కొంది. ‘అనూహ్యంగా ఆప్షన్ల ధరలు పెరగడం, స్టాప్‌ లాస్‌లు ట్రిగర్‌ అవ్వడం వెనక, పెద్ద మొత్తంలో ఆల్గో ట్రేడ్‌ లావాదేవీలే కారణం అవుతున్నాయి. దీని వల్ల చిన్న మదుపర్లు భారీగా నష్టపోతున్నారు. అధిక పన్ను విధింపుతో ఎచ్‌ఎఫ్‌టీ సంస్థల లావాదేవీల పరిమాణం తగ్గుతుంది. తద్వారా చిన్న మదుపర్లను భారీ నష్టాల నుంచి కాపాడే వీలుంటుంద’ని మంత్రికి మార్కెట్‌ వర్గాలు వివరించినట్లు సమాచారం.


ఇటీవలి హెచ్చరికలు గమనిస్తే..

ఎఫ్‌అండ్‌ఓ ట్రేడింగ్‌లో చిన్న మదుపర్లు అధికంగా పాల్గొంటూ, తీవ్రంగా నష్టపోతున్నారని సెబీ ఛైర్మన్, ఆర్థిక మంత్రి, ఆర్‌బీఐ గవర్నర్‌ పలు సందర్భాల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీర్ఘకాలిక దృక్పథంతోనే ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలని వారు సూచిస్తున్నారు. 

ఎఫ్‌అండ్‌ఓ ట్రేడ్‌లపై పన్ను రేట్లను పెంచనున్నట్లు వచ్చిన వార్తల ప్రభావంతో గురువారం ఎన్‌ఎస్‌ఈలో, బీఎస్‌ఈ షేరు 2.41% నష్టంతో రూ.2,644 వద్ద ముగిసింది. 


మౌలిక రంగానికి నిధుల కేటాయింపు కొనసాగించాలి 

రాబోయే బడ్జెట్‌లో సామాన్యులపై పన్ను భారాన్ని తగ్గించడంతో పాటు, మూలధన వ్యయాలను కొనసాగించాలని కేంద్ర ఆర్థిక మంత్రికి పరిశ్రమ సంఘాలు విజ్ఞప్తి చేశాయి. ఆహార పదార్థాల ధరల నియంత్రణకు చర్యలను ప్రకటించాలనీ కోరాయి. ముందస్తు బడ్జెట్‌ సంప్రదింపుల్లో భాగంగా గురువారం పరిశ్రమ సంఘాల ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధి జోరు కొనసాగాలంటే మౌలిక రంగ అభివృద్ధిపై ప్రభుత్వం మరింత దృష్టి సారించాలని వాళ్లు మంత్రికి తెలిపారు. ఉద్యోగ కల్పనలోనే కాకుండా భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఎంఎస్‌ఎమ్‌ఈ (సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల) రంగానికి ఊతమిచ్చే ప్రతిపాదనలు బడ్జెట్లో చేయాలని ఆకాంక్షించారు. తక్కువ ఆదాయపు పన్ను శ్లాబ్‌ రేట్లలో ఆదాయ పరిమితి పెంపు, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం మాదిరిగా ఉద్యోగకల్పన ప్రోత్సాహక పథకాన్ని తేవడం, వ్యాపార సరళీకరణ, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధిపై దృష్టి.. వంటి అంశాలను సమావేశంలో మంత్రి దృష్టికి సీఐఐ ప్రెసిడెంట్‌ సంజీవ్‌ పురి తీసుకెళ్లారు. మూలధన వ్యయాల కొనసాగింపు, పన్ను రేట్లు తగ్గింపు అంశాలపై ఫిక్కీ సూచనలు చేసింది.


కేపిటల్‌ మార్కెట్లకు సహకరించాలి

కేపిటల్‌ మార్కెట్ల వృద్ధికి ఊతమిచ్చేందుకు మూలధన లాభాలపై పన్నును సరళీకరించడంతో పాటు సెక్యూరిటీ లావాదేవీల పన్ను తగ్గించాలని మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఆర్థిక రంగ సంస్థలు కోరాయి. పన్ను విధానాలు స్థిరంగా, దీర్ఘకాలం దృక్పథంతో ఉండాలని మోర్గాన్‌ స్టాన్లీ ఇండియా కంపెనీ ఎండీ అరుణ్‌ కోహ్లి సూచించారు. కో- లెండింగ్, సేవా రుసుములకు జీఎస్‌టీ విధింపుపై స్పష్టత ఇవ్వాలని ఎన్‌బీఎఫ్‌సీల ప్రతినిధులు కోరారు.


ఎరువులకు జీఎస్‌టీ నుంచి మినహాయింపు!

ఎరువులను జీఎస్‌టీ విధింపు నుంచి మినహాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 22న జరిగే జీఎస్‌టీ మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఎరువులపై జీఎస్‌టీ తొలగించే ప్రతిపాదనను ఇప్పటికే మంత్రుల బృందానికి, సంబంధిత కమిటీ సిఫారసు చేసినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ వార్తల ప్రభావంతో ఎరువుల రంగ కంపెనీల షేర్లు గురువారమూ భారీ లాభాలతో ముగిశాయి. నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్, ఆర్‌సీఎఫ్, చంబల్‌ ఫెర్టిలైజర్స్‌ షేర్లు 20% వరకు పెరిగాయి. దీపక్‌ ఫెర్టిలైజర్స్, మద్రాస్‌ ఫెర్టిలైజర్స్, గుజరాత్‌ స్టేట్‌ ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్, పారాదీప్‌ ఫాస్ఫేట్స్, జువారీ ఇండస్ట్రీస్, కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ షేర్లు కూడా రాణించాయి.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని