Union Budget 2022: హైటెక్‌ వ్యవసాయం.. బడ్జెట్‌లో నిర్మలమ్మ ప్రోత్సాహం

ప్రపంచంలోని వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం అతి పెద్దది. అత్యధికమంది వ్యవసాయ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు.

Updated : 01 Feb 2022 16:52 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచంలోని వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం అతి పెద్దది. అత్యధికమంది వ్యవసాయ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఆధునిక పద్ధతుల ద్వారా వ్యవసాయరంగానికి ఊతం ఇచ్చేలా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తాజా బడ్జెట్‌లో కొన్ని కీలక ప్రకటనలు చేశారు. వరి- గోధుమ కొనుగోళ్లు, మద్దతు ధరల కోసం రూ.2.37లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. గంగా పరివాహక ప్రాంతం వెంబడి నేచురల్‌ ఫార్మింగ్‌ కారిడార్‌ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. వచ్చే 25 ఏళ్ల అమృత కాలానికి ఈ బడ్జెట్‌ పునాది అని చెప్పిన ఆర్థిక మంత్రి.. ఆధునిక పద్ధతుల్లో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించనున్నట్లు ప్రకటించారు.

జీరో బడ్జెట్‌ ఫార్మింగ్‌

ఒకప్పుడు సంప్రదాయ పద్ధతుల ద్వారా దేశంలో వ్యవసాయం జరిగేది. గత కొన్నేళ్లు వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ముఖ్యంగా పురుగు మందుల వినియోగం గణనీయంగా పెరిగిపోయింది. వాటిని వినియోగించి పండించే ఉత్పత్తుల వినియోగం ప్రజల ఆరోగ్యంపై దీర్ఘకాలంలో తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఈ క్రమంలో జీరో బడ్జెట్‌ ఫార్మింగ్‌, సేంద్రియ వ్యవసాయానికి ప్రోత్సాహకాలు అందించనున్నట్లు నిర్మలా సీతారామన్‌ తాజా బడ్జెట్‌లో ప్రకటించారు. ఎలాంటి ఎరువులు, పురుగుమందుల వినియోగం లేకుండా పంటలు పండించడమే ‘జీరో బడ్జెట్‌ ఫార్మింగ్‌’. ఇప్పటికే పలు రాష్ట్రాల్లోని రైతులు ఈ పద్ధతిలో పంటలను సాగుచేస్తున్నారు. ఇప్పుడు నిర్మలమ్మ ప్రకటనతో ఈ పద్ధతిలో సాగు చేసే రైతులకు మరింత ప్రోత్సాహం కల్పించినట్లు అవుతుంది.

అద్దె ప్రాతిపదికన వ్యవసాయ పనిముట్లు

వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యల్లో కూలీల కొరత ప్రధానమైంది. అదే సమయంలో చిన్న, సన్నకారు రైతులు భారీ మొత్తంలో వెచ్చించి యంత్రాలను సమకూర్చుకునే పరిస్థితి లేదు. ఈ క్రమంలో అద్దె ప్రాతిపదికన వ్యవసాయ పనిముట్లు అందించటం రైతులకు మేలు చేసే కార్యక్రమం. దీని ద్వారా వ్యవసాయ కూలీల కొరతను అధిగమించడంతో పాటు, రైతుకు పంటపై వచ్చే రాబడి సైతం పెరిగే అవకాశం ఉంది.

ఉత్పత్తుల విలువ పెంపుకోసం స్టార్టప్‌లు

వ్యవసాయ ఉత్పత్తుల విలువ పెంపు కోసం మరిన్ని స్టార్టప్‌లను ప్రోత్సహించనున్నట్లు  ఆర్థిక మంత్రి బడ్జెట్‌లో వెల్లడించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 600 నుంచి 700లకు పైగా అగ్రి స్టార్టప్‌లు ఉన్నాయి. వీటితో పాటు కొత్త స్టార్టప్‌లను ప్రోత్సహించే దిశగా తాజా బడ్జెట్‌లో ప్రకటన చేశారు. నాబార్డ్‌ సాయంతో వ్యవసాయ స్టార్టప్‌లకు ఆర్థికసాయం అందించనున్నట్లు తెలిపారు.

వ్యవసాయంలో ‘కిసాన్‌ డ్రోన్స్‌’

వ్యవసాయ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా ఈ రంగంలో యాంత్రీకరణ పెంచనున్నట్లు నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. డ్రోన్ల సహకారంతో పురుగు మందుల పిచికారీని ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం ‘కిసాన్‌ డ్రోన్స్‌’ను ఉపయోగించనున్నట్లు తెలిపారు. పంటల మదింపు, భూ రికార్డుల డిజిటలీకరణ కోసం ‘కిసాన్‌ డ్రోన్స్‌’ను వినియోగించనున్నట్లు వెల్లడించారు.

వ్యవసాయ వర్సిటీల్లో సిలబస్‌ మార్పులు

యువత వ్యవసాయ రంగంపై మరింత పట్టు సాధించే దిశగా ఆర్థిక మంత్రి మరో ప్రకటన చేశారు. వ్యవసాయ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులను సుశిక్షతులుగా తీర్చిదిద్దేందుకు అడుగులు వేయనున్నట్లు వివరించారు. ముఖ్యంగా ప్రస్తుతం వ్యవసాయ సంబంధిత పాఠ్యాంశ్యాల్లో మార్పులు చేయనున్నట్లు తెలిపారు. వ్యవసాయ వర్సిటీల్లో సిలబస్‌ను నేటి ఆధునిక వ్యవసాయ పద్ధతులకు అనుగుణంగా మార్పులు చేయనున్నట్లు ప్రకటించారు.

* నానాటికీ పెరిగిపోతున్న వంటనూనెల ధరలకు కళ్లెం వేసే దిశగా చర్యలు తీసుకోనున్నారు. ఇందుకోసం దేశీయంగా నూనె గింజల ఉత్పత్తులను పెంచి, దిగుమతులను తగ్గిస్తామని నిర్మలమ్మ తెలిపారు.

* 2023ను చిరుధాన్యాల సంవత్సరంగా ఆర్థిక మంత్రి ప్రకటించారు. దేశీయంగా చిరుధాన్యాల వినియోగాన్ని పెంచేందుకు ప్రజల్లో అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.

* అడవుల్లో వ్యవసాయం చేసే ఎస్సీ, ఎస్టీ రైతులకు ఆర్థికసాయం చేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని