SBI Chairman: కార్పొరేట్లకు రూ.5 లక్షల కోట్ల రుణాలు!

కార్పొరేట్‌ రుణాలకు గిరాకీ బాగా పెరుగుతోందని, రూ.5 లక్షల కోట్ల విలువైన రుణాలకు ఇప్పటికే ప్రతిపాదనలు అందాయని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఛైర్మన్‌ దినేశ్‌ కుమార్‌ ఖారా వెల్లడించారు.

Published : 14 Jun 2024 02:10 IST

ఎస్‌బీఐ ఛైర్మన్‌ దినేశ్‌ కుమార్‌ ఖారా 

దిల్లీ: కార్పొరేట్‌ రుణాలకు గిరాకీ బాగా పెరుగుతోందని, రూ.5 లక్షల కోట్ల విలువైన రుణాలకు ఇప్పటికే ప్రతిపాదనలు అందాయని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఛైర్మన్‌ దినేశ్‌ కుమార్‌ ఖారా వెల్లడించారు. గత కొన్నేళ్లుగా ప్రైవేటు సంస్థలు పెట్టుబడులను తగ్గించిన సంగతి విదితమే. అయితే ఇప్పుడు మళ్లీ  కార్పొరేట్‌ సంస్థలు వర్కింగ్‌ క్యాపిటల్, సామర్థ్య విస్తరణకు  రుణాల వేట ప్రారంభించాయని ఆయన తెలిపారు. ఆయా సంస్థల ఆస్తిఅప్పుల పట్టీ (బ్యాలెన్స్‌ షీట్ల)లో తగినంత నగదు నిల్వలు ఉన్నా, రుణాల కోసం అభ్యర్థనలు వస్తున్నాయని ఎస్‌బీఐ ఛైర్మన్‌ వెల్లడించారు. 

 అధిక వడ్డీ రేట్లు ఉన్నప్పటికీ.. రిటైల్, వ్యవసాయ, ఎంఎస్‌ఎంఈ రుణ విభాగాల్లో ఎస్‌బీఐ ఈ ఏడాది 16% వృద్ధి నమోదు చేస్తుందని ఖారా ధీమా వ్యక్తం చేశారు. 2023-24లోనూ ఈ విభాగ రుణాలు 16% వృద్ధితో రూ.21 లక్షల కోట్లకు చేరినట్లు గుర్తు చేశారు. ఈ రుణాల్లో నష్టభయాన్ని అంచనా వేయడాని బ్యాంక్‌ వద్ద విస్తృత నెట్‌వర్క్‌ ఉందని, ఈ రుణ పుస్తకం ప్రస్తుతం ఆరోగ్యకరంగా ఉందని ఆయన తెలిపారు. గృహ, వాహన రుణాలపై అసలు ఒత్తిడి లేదని, పూర్తి రిటైల్‌ పోర్ట్‌ఫోలియోలో స్థూల ఎన్‌పీఏలు 0.7 శాతమే ఉన్నాయని పేర్కొన్నారు. తాము పాటిస్తున్న ప్రమాణాలు, నాణ్యతతో కూడిన వ్యాపారం వల్ల ఎలాంటి సవాళ్లు ఎదురు కావడం లేదని ఖారా వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని