Nitin Gadkari: రోడ్లు సరిగా లేకపోతే.. టోల్‌ వసూలు చేయొద్దు: గడ్కరీ

Nitin Gadkari: సరిగా లేని రోడ్లపై టోల్‌ వసూలు చేయొద్దని నితిన్‌ గడ్కరీ అన్నారు. అలా చేస్తే ప్రజాగ్రహానికి గురవ్వాల్సి ఉంటుందని చెప్పారు.

Updated : 26 Jun 2024 18:15 IST

Nitin Gadkari | దిల్లీ: టోల్‌ ఛార్జీల వసూలు గురించి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. రోడ్లు సరిగా నిర్వహించలేనప్పుడు టోల్‌ వసూలు చేయొద్దని ఆయా ఏజెన్సీలకు సూచించారు. గుంతలతో కూడిన రోడ్లు, టోల్‌ ప్లాజాల వద్ద రద్దీ.. ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. శాటిలైట్‌ ఆధారిత టోల్‌ వసూలుపై నిర్వహించిన గ్లోబల్‌ వర్క్‌షాప్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘మీరు మంచి సేవలు అందించలేనప్పుడు టోల్‌ ఛార్జీ వసూలు చేయొద్దు. రోడ్లు బాగా లేకపోతే ప్రజలు హర్షించరు. చాలామంది ఇప్పటికే సోషల్‌మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. కాబట్టి మంచి రోడ్లు అందివ్వలేనప్పుడు టోల్‌ వసూలు చేయకూడదు. ఒకవేళ గుంతలతో కూడిన రోడ్లపై టోల్‌ వసూలు చేస్తే రాజకీయ నాయకులుగా మేం ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది’’ అని గడ్కరీ అన్నారు. టోల్‌ ప్లాజాల వద్ద ఆలస్యం కాకుండా  చూడాలని నేషనల్‌ హైవే ఫీల్డ్‌ ఆఫీసర్లకు సూచించారు.

సెక్షన్ 80సి పరిమితి ఈసారైనా పెరిగేనా?.. చివరిసారి ఎప్పుడు సవరించారు?

ఈ ఏడాదే శాటిలైట్‌ టోల్‌ ఛార్జీలు

శాటిలైట్ ఆధారిత టోల్‌ ఛార్జీల వసూలు విధానాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రారంభించనున్నట్లు గడ్కరీ తెలిపారు. తొలి దశలో 5 వేల కిలోమీటర్ల రహదారులపై ఈ టోల్‌ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. తొలుత కమర్షియల్‌ వాహనాలకు ఒక లేన్‌లో అనుమతిస్తారు. టోల్‌ వసూలుకు కీలకమైన వెహికల్‌ ట్రాకర్‌ సిస్టమ్‌ యూనిట్‌ను ఆయా వాహనాల్లో అమర్చాల్సి ఉంటుంది. ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తే వాహనాలు టోల్‌ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం ఉండదు. దశలవారీగా ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నారు. ఈ విధానం వల్ల ప్రభుత్వానికి రూ.10వేల కోట్లు అదనపు ఆదాయం సమకూరనుందని గడ్కరీ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని