Adani Group: హిమాచల్‌లో అదానీ కంపెనీలో సోదాలు!

అదానీ విల్మర్‌ (Adani Wilmar) తమ జీఎస్‌టీ ఇన్‌పుట్‌ను పూర్తిగా సర్దుబాటు చేసిన ట్యాక్స్‌ క్రెడిట్‌ ద్వారానే చెల్లించిందని ఎక్సైజ్‌ అధికారి తెలిపారు. నగదు రూపంలో ఎలాంటి చెల్లింపులు చేయలేదన్నారు.

Published : 09 Feb 2023 18:07 IST

శిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వ ఎక్సైజ్‌ అండ్‌ ట్యాక్సేషన్‌ విభాగం అదానీ గ్రూప్‌ (Adani Group)నకు చెందిన ఓ కంపెనీలో సోదాలు నిర్వహించింది. పర్వాణూలో ఉన్న అదానీ విల్మర్‌ (Adani Wilmar) గోదాములోని నిల్వలను తనిఖీ చేసినట్లు అధికారులు తెలిపారు. జీఎస్‌టీ ఉల్లంఘనల నేపథ్యంలోనే ఈ సోదాలు జరిగినట్లు తెలుస్తోంది.

హిండెన్‌బర్గ్‌ నివేదిక (Hindenburg Report) నేపథ్యంలో అదానీ గ్రూప్ (Adani Group) వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారానికి దారితీసిన విషయం తెలిసిందే. పైగా గ్రూప్‌ (Adani Group) కంపెనీల షేర్లు కూడా కుప్పకూలడంతో ప్రతిపక్షాలు దీన్ని అస్త్రంగా మార్చుకున్నాయి. పార్లమెంటులో ప్రతిపక్షాలు అధికార భాజపాపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ తరుణంలో కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రంలో అదానీ గ్రూప్‌ (Adani Group)నకు చెందిన కంపెనీలో సోదాలు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, ఇది తరచూ జరిపే సాధారణ తనిఖీల్లో భాగమేనని హిమాచల్‌ ఎక్సైజ్‌ అధికారి ఒకరు తెలిపారు. అదానీ విల్మర్‌ (Adani Wilmar) సైతం ఇదే తరహా ప్రకటన విడుదల చేసింది.

అదానీ విల్మర్‌ (Adani Wilmar) తమ జీఎస్‌టీ ఇన్‌పుట్‌ను పూర్తిగా సర్దుబాటు చేసిన ట్యాక్స్‌ క్రెడిట్‌ ద్వారానే చెల్లించిందని ఎక్సైజ్‌ అధికారి తెలిపారు. నగదు రూపంలో ఎలాంటి చెల్లింపులు చేయలేదన్నారు. అయితే, జీఎస్‌టీ నిబంధనల ప్రకారం.. పన్ను బకాయిలను కచ్చితంగా నగదు రూపంలోనే చెల్లించాల్సిన అవసరం లేదని అదానీ విల్మర్‌ (Adani Wilmar) తన ప్రకటనలో తెలిపింది. మరోవైపు ఈరోజు జరిపిన తనిఖీల్లో అధికారులు ఎలాంటి అవకతవకల్ని గుర్తించలేదని పేర్కొంది. తనిఖీలు పూర్తయిన తర్వాత గోదాములో కార్యకలాపాలు సాధారణంగానే నడుస్తున్నాయని తెలిపింది. అదానీ విల్మర్‌ (Adani Wilmar) షేరు ఈరోజు 4.99 శాతం పెరిగి రూ.439.70 వద్ద అప్పర్‌ సర్క్యూట్‌ని తాకింది.

హిమాచల్‌లో చిక్కుల్లో మరో అదానీ కంపెనీ..

అదానీ గ్రూప్‌ (Adani Group)నకు చెందిన మరో కంపెనీ సైతం హిమాచల్‌ ప్రదేశ్‌లో వార్తల్లో ఉంది. సోలన్‌, బిలాస్‌పూర్‌లో ఉన్న రెండు ‘అదానీ’ సిమెంట్‌ తయారీ ప్లాంట్‌లు డిసెంబరు 14 నుంచి మూతబడ్డాయి. స్థానిక లారీ డ్రైవర్లకు చెల్లించాల్సిన భత్యానికి సంబంధించిన వివాదమే దీనికి కారణం. కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ సమస్య పరిష్కరించేందుకు ప్రయత్నిస్తోంది.

అదానీ గ్రూప్‌ నుంచి నార్వే వెల్త్‌ ఫండ్‌ ఔట్‌..

నార్వేకు చెందిన 1.5 ట్రిలియన్‌ డాలర్ల సావరీన్‌ వెల్త్‌ ఫండ్‌ అదానీ గ్రూప్‌ కంపెనీల్లోని పెట్టుబడులను పూర్తిగా ఉపసంహరించుకుంది. గత కొన్నేళ్లుగా అదానీ కంపెనీల ఈఎస్‌జీ (environmental, social, and governance ) అంశాలను పరిశీలిస్తున్నామని తెలిపింది. 2014 నుంచి ఈ ఫండ్‌ అదానీ గ్రూప్‌ (Adani Group)నకు చెందిన ఐదు కంపెనీల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకుంది. 2022 ఆఖరు నాటికి అదానీ పోర్ట్స్‌ సహా మొత్తం మూడు కంపెనీల్లో వాటాలు ఉన్నాయి. అప్పటికి అదానీ గ్రీన్‌ ఎనర్జీలో ఈ ఫండ్‌కు 52.7 మిలియన్‌ డాలర్లు, అదానీ టోటల్‌ గ్యాస్‌లో 83.6 మిలియన్‌ డాలర్లు, అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌లో 63.4 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇప్పుడు వీటన్నింటినీ ఉపసంహరించుకుంటున్నట్లు తాజాగా నార్వే సావరీన్‌ వెల్త్‌ ఫండ్‌ ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని