Adani Group: ఎఫ్‌పీఓను భగ్నం చేయాలనే హిండెన్‌బర్గ్‌ ఆరోపణలు: గౌతమ్‌ అదానీ

Adani Group: అదానీ గ్రూప్‌ 32వ వార్షిక సమావేశంలో ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ మాట్లాడుతూ హిండెన్‌బర్గ్‌ ఆరోపణలు, తదనంతర పరిణామాలను గుర్తుచేశారు. ఆ ఉదంతాన్ని కుట్రపూరిత చర్యగా అభివర్ణించారు.

Published : 24 Jun 2024 15:06 IST

దిల్లీ: అమెరికా షార్ట్‌సెల్లర్ గత ఏడాది అదానీ గ్రూప్‌ (Adani Group)పై చేసిన ఆరోపణలు కుట్రపూరితమైనవని ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ (Gautam Adani) పునరుద్ఘాటించారు. తమ మలిదశ పబ్లిక్ ఆఫర్‌ (FPO)ను భగ్నం చేయాలనే ఉద్దేశంతోనే తప్పుడు ఆరోపణలు గుప్పించారని పేర్కొన్నారు. అదానీ గ్రూప్‌ 32వ వార్షిక సమావేశంలో మాట్లాడుతూ సోమవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

హిండెన్‌బర్గ్‌ ఆరోపణల వెనక రాజకీయ శక్తులు కూడా ఉన్నాయని అదానీ (Adani) ఆరోపించారు. వీటిని మీడియాలోని ఒక వర్గం మరింత ఎక్కువ చేసి చూపేందుకు ప్రయత్నించిందన్నారు. తద్వారా తమ గ్రూప్‌ (Adani Group ) ప్రతిష్ఠను దిగజార్చి కంపెనీల మార్కెట్‌ విలువను కుంగదీయాలని చూశారన్నారు. తమ కంపెనీలను అప్రతిష్ఠ పాల్జేసి ఆర్థికంగా హాని తలపెట్టాలనే ఉద్దేశంతోనే అలాంటి చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. తద్వారా తమ గ్రూప్‌పై మార్కెట్‌ వర్గాల్లో ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీయాలని చూశారని ఆరోపించారు.

హిండెన్‌బర్గ్‌ నిరాధార ఆరోపణలన్నింటినీ తాము సమర్థంగా ఎదుర్కొన్నామని అదానీ (Adani) తెలిపారు. రూ.17,500 కోట్ల రుణ వాయిదాలను ముందస్తుగా చెల్లించి మదుపర్లు, రుణదాతల విశ్వాసాన్ని నిలబెట్టుకోగలిగామని పేర్కొన్నారు. ఎఫ్‌పీఓ విషయంలోనూ తమ కంపెనీ నైతిక విలువలకు కట్టుబడి వ్యవహరించిందని తెలిపారు. రూ.20 వేల కోట్లు సమీకరించినప్పటికీ.. వాటన్నింటిని తిరిగి ఇచ్చేశామని గుర్తుచేశారు. ఇన్వెస్టర్ల ప్రయోజనాలు, విలువలతో కూడిన వ్యాపారంపై తమ నిబద్ధతకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు.

అదానీ వార్షిక వేతనం రూ.9.26 కోట్లు

తమ స్థానంలో ఇంకే కంపెనీ ఉన్నా.. తిరిగి కోలుకోవడం సాధ్యం అయ్యేది కాదని అదానీ (Adani) అభిప్రాయపడ్డారు. తమ వద్ద ఉన్న అధిక ద్రవ్య లభ్యతే తమని కాపాడిందని తెలిపారు. నగదు నిల్వలను మరింత పెంచుకోవడం కోసం రూ.40వేల కోట్లు అదనంగా సమీకరించినట్లు వెల్లడించారు.

ఇవీ హిండెన్‌బర్గ్‌ ఆరోపణలు..

అదానీ గ్రూప్‌ (Adani Group) తమ నమోదిత కంపెనీల షేర్ల ధరల్ని కృత్రిమంగా పెంచిందని 2023 జనవరి 23న వెలువడిన నివేదికలో అమెరికా షార్ట్‌సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ ఆరోపించిన విషయం తెలిసిందే. అలా విలువ పెరిగిన షేర్లను తనఖా పెట్టి రుణాలు పొందిందని ఆరోపించింది. అకౌంటింగ్ మోసాలకు పాల్పడినట్లు పేర్కొంది. పన్నుల విషయంలో స్నేహపూరితంగా ఉండే కరీబియన్‌, మారిషస్‌ల నుంచి యూఏఈ దేశాల్లో అదానీ కుటుంబం పలు డొల్ల కంపెనీలను నియంత్రిస్తోందని తెలిపింది. వీటిద్వారానే అవినీతి, అక్రమ నగదు బదలాయింపులకు పాల్పడుతోందని ఆరోపించింది. ఈ ఆరోపణల్ని అదానీ గ్రూప్‌ (Adani Group) తీవ్రంగా ఖండించింది. పలు దిద్దుబాటు చర్యలు చేపట్టింది.  దీంతో కంపెనీల షేర్లు తిరిగి భారీగా పుంజుకున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని