Hindenburg: మరో సంచలన నివేదికను బయటపెట్టిన హిండెన్‌బర్గ్‌

ట్విటర్‌ (Twitter) వ్యవస్థాపకుడు జాక్‌ డోర్సే (Jack Dorsey)కు చెందిన చెల్లింపుల సంస్థ బ్లాక్‌ (Block Inc) భారీగా అక్రమాలకు పాల్పడిందని హిండెన్‌బర్గ్‌ (Hindenburg) ఆరోపించింది.

Published : 23 Mar 2023 21:26 IST

వాషింగ్టన్‌: అమెరికన్‌ షార్ట్‌ సెల్లింగ్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌ (Hindenburg)  చెప్పినట్లుగానే మరో సంచలన నివేదికను బయటపెట్టింది. అదానీ గ్రూప్‌ నివేదిక తర్వాత మరో  పెద్ద నివేదికను విడుదల చేస్తామని ట్వీట్‌ చేసిన కొద్ది గంటల్లోనే దీన్ని బహిర్గతం చేసింది. ఈ సారి హిండెన్‌బర్గ్‌ విడుదల చేసిన నివేదిక ట్విటర్‌ (Twitter) వ్యవస్థాపకుడు జాక్‌ డోర్సే (Jack Dorsey)కు చెందిన చెల్లింపుల సంస్థ బ్లాక్‌ (Block Inc) భారీగా అక్రమాలకు పాల్పడిందని ఆరోపించింది. ఈ మేరకు బ్లాక్‌కు చెందిన నివేదికకు సంబంధించిన లింక్‌ను హిండెన్‌బర్గ్‌ తన ట్విటర్‌ ఖాతాలో ట్వీట్ చేసింది. 

ఈ సంస్థ తన వినియోగదారుల సంఖ్యను ఎక్కువగా చూపడంతోపాటు,  ఖర్చుల వివరాలను తక్కువ చేసి చూపి పెట్టుబడిదారులను మోసం చేసిందని ఆరోపించింది. తమ రెండేళ్ల పరిశోధనలో బ్లాక్‌కు సంబంధించిన పలు కీలక విషయాలను గుర్తించినట్లు తన నివేదికలో పేర్కొంది. ‘‘ బ్లాక్‌ సంస్థ ఒక క్రమ పద్ధతిలో పెట్టుబడిదారుల నుంచి సాయం పొందిందని మా రెండేళ్ల పరిశోధనలో గుర్తించాం. ఆవిష్కరణ పేరుతో వినియోగదారులను, ప్రభుత్వాన్ని సులభంగా మోసం చేయడమే బ్లాక్‌ వ్యాపారం వెనుకున్న అసలు ఉద్దేశం. నిబంధనలను అతిక్రమించడం, రుణాల పేరుతో దోపిడీ చేయడం, విప్లవాత్మక సాంకేతికత పేరుతో కంపెనీ గణాంకాలను పెంచి పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించడమే బ్లాక్‌ వ్యాపారం లక్ష్యం’’ అని నివేదికలో పేర్కొంది.

బ్లాక్‌ సంస్థలోని ఖాతాల్లో 40 నుంచి 75 శాతం ఖాతాలు నకిలీవని ఆ సంస్థ మాజీ ఉద్యోగులు తమతో వెల్లడించినట్లు హిండెన్‌బర్గ్ తెలిపింది. ఈ నివేదిక తర్వాత ప్రీమార్కెట్ ట్రేడింగ్‌లో  బ్లాక్ షేర్‌ ధర 18 శాతం పడిపోయింది. బ్లాక్ వినియోగదారుల్లో ఎక్కువ మంది నేరస్థులు, అక్రమ వ్యాపారాలు నిర్వహించే వారు ఉన్నారని వెల్లడించింది.  కరోనా సమయంలో జాక్‌ డోర్సే, మరో సహ-వ్యవస్థాపకుడు జేమ్స్ మాకెల్వేయ్‌ సుమారు ఒక బిలియన్‌ డాలర్‌ విలువైన షేర్లను విక్రయించినట్లు తెలిపింది. ఈ క్రమంలో బ్లాక్ సీఎఫ్‌వో అమృతా అహుజా, మేనేజర్‌ బ్రెయిన్‌ గ్రాస్సాడోనియా మిలియన్‌ డాలర్లు పెట్టుబడులు పెట్టినట్లు హిండెన్‌బర్గ్‌ నివేదికలో తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని