Adani Hindenburg Row: ‘నివేదికను హిండెన్‌బర్గ్‌ ముందే లీక్‌ చేసింది.. లాభాల్లో వాటా తీసుకుంది’

Adani Hindenburg Row: అదానీ గ్రూప్‌పై తయారు చేసిన నివేదికను హిండెన్‌బర్గ్‌ ముందే తమ క్లయింట్లకు లీక్‌ చేసిందని సెబీ ఆరోపించింది. తద్వారా ఆయా క్లయింట్లు పొందిన లాభాల నుంచి వాటా తీసుకుందని తెలిపింది.

Published : 07 Jul 2024 19:16 IST

Adani Hindenburg Row | దిల్లీ: అదానీ గ్రూప్‌ అవకతవకలకు పాల్పడుతోందంటూ రూపొందించిన నివేదికను అమెరికా షార్ట్‌సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ (Hindenburg) ముందే తమ క్లయింట్లతో పంచుకుందని సెబీ ఆరోపించింది. నివేదిక విడుదల తర్వాత ఆయా క్లయింట్లు షార్ట్‌ పొజిషన్ల ద్వారా ఆర్జించిన లాభాల్లో వాటా తీసుకుందని పేర్కొంది.

కింగ్డన్‌ అనే అమెరికా హెడ్జ్‌ ఫండ్‌ మేనేజర్‌తో హిండెన్‌బర్గ్‌ (Hindenburg) అనుబంధం 2022 చివర్లోనే మొదలైందని.. అంటే నివేదికకు ముందు ఇది జరిగిందని 46 పేజీల నోటీసులో సెబీ ఆరోపించింది. నివేదికను అధికారికంగా విడుదల చేయడానికి రెండు నెలల ముందే కింగ్డన్‌తో పంచుకున్నట్లు తెలిపింది. వాటి ఆధారంగా అదానీ (Adani Group) కంపెనీల షేర్లలో కింగ్డన్‌ షార్ట్‌ పొజిషన్లు తీసుకున్నట్లు పేర్కొంది. హిండెన్‌బర్గ్‌ (Hindenburg) నివేదిక విడుదల చేశాక షేర్ల విలువ పతనమైందని.. ఆ పొజిషన్లను వదిలించుకోవడం ద్వారా కింగ్డన్‌ సొమ్ము చేసుకుందని వివరించింది. ఈ లాభాల్లో నుంచి 30 శాతం ఇచ్చేలా కింగ్డన్‌తో హిండెన్‌బర్గ్‌ ఒప్పందం చేసుకున్నట్లు ఆరోపించింది. కానీ, లాభాలను బదిలీ చేయడంలో ఆలస్యం కావటంతో దాన్ని తర్వాత 25 శాతానికి తగ్గించినట్లు పేర్కొంది.

సెబీ నోటీసులను హిండెన్‌బర్గ్‌ (Hindenburg) అర్థంలేనివిగా కొట్టిపారేసిన విషయం తెలిసిందే. కేవలం తమను బెదిరించడానికే నోటీసులు జారీ చేసిందని ఆరోపించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని