Paramount Global-Skydance: స్కైడాన్స్‌ చేతికి హాలీవుడ్‌ ఐకాన్‌ పారామౌంట్‌ గ్లోబల్‌..!

హాలీవుడ్‌లో మరో భారీ డీల్‌ జరిగింది. ప్రఖ్యాత పారామౌంట్‌ సంస్థను స్కైడాన్స్‌ స్టూడియో కొనుగోలు చేసింది. 

Updated : 08 Jul 2024 13:42 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: హాలీవుడ్‌(Hollywood)కు చెందిన ప్రముఖ నిర్మాణసంస్థ పారామౌంట్‌ గ్లోబల్‌(Paramount Global)ను విక్రయించాలని ఆ సంస్థ ఛైర్మన్‌ శారీ రెడ్‌స్టోన్‌ నిర్ణయించారు. దీనిని మరో ఫిల్మ్‌ స్టూడియో స్కైడాన్స్‌ (Skydance) కొనుగోలు చేయనుంది. ఈ డీల్‌తో 1936 నుంచి పారామౌంట్‌పై ఉన్న రెడ్‌స్టోన్‌ కుటుంబ నియంత్రణ ముగిసిపోతుంది. ఈ విలీనం తర్వాత 28 బిలియన్‌ డాలర్ల విలువైన సరికొత్త కంపెనీ ఏర్పాటుకానుంది. పారామౌంట్‌ విక్రయం కోసం రెడ్‌స్టోన్‌ దాదాపు 8 నెలలపాటు వివిధ సంస్థలతో చర్చలు జరిపారు. వీటిలో అపోలో, సోనీ వంటి కంపెనీలు కూడా ఉన్నాయి. 

ఒరాకిల్‌ సహ వ్యవస్థాపకుడు లారీ ఎల్లీసన్‌ కుమారుడు డేవిడ్‌ ప్రస్తుతం స్కైడాన్స్‌ స్టూడియోను నిర్వహిస్తున్నారు. ఈ డీల్‌ కింద పారామౌంట్‌ స్టూడియో కూడా కొత్త సంస్థ చేతికి వెళుతుంది. గతంలో ఇది ది గాడ్‌ ఫాదర్‌, టైటానిక్‌, చైనా టౌన్‌, రైడర్స్‌ ఆఫ్‌ ది లాస్ట్‌ ఆర్క్‌ వంటి సూపర్‌ హిట్‌లను అందించింది. ఈ డీల్‌ కోసం రెడ్‌ స్టోన్‌ దాదాపు 8 బిలియన్‌ డాలర్లు వెచ్చించనుంది. వీటిల్లో 2.4 బిలియన్‌ డాలర్లను నేషనల్‌ అమ్యూజ్‌మెంట్స్‌ కంపెనీ కొనుగోలుకు వినియోగించనుంది. ప్రస్తుతం పారామౌంట్‌ కింద సీబీఎస్‌, కామెడీ సెంట్రల్‌, ఎంటీవీ వంటివి కూడా ఉన్నాయి. కంపెనీ టీవీ ఛానల్స్‌కు 180 దేశాల్లో 4.3 బిలియన్ల మంది చందాదారులు ఉన్నారు. 2025 నాటికి ఈ డీల్‌ పూర్తవుతుందని భావిస్తున్నారు. 

‘‘ప్రస్తుతం పరిశ్రమలో వేగంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా భవిష్యత్తు కోసం పారామౌంట్‌ మరింత బలపడాలని మేము కోరుకుంటున్నాం. స్కైడాన్స్‌ డీల్‌తో కొత్త వాతావరణంలో కూడా ఈ సంస్థ విజయాలు సాధిస్తుందని ఆశిస్తున్నాం’’ అని శారీ రెడ్‌స్టోన్‌ పేర్కొన్నారు. నేషనల్‌ అమ్యూజ్‌మెంట్స్‌ కంపెనీ ద్వారా రెడ్‌స్టోన్‌ కుటుంబం పారామౌంట్‌ను నియంత్రిస్తోంది. దానిలో 10శాతం వాటా.. 80శాతం ఓటింగ్‌ హక్కులు దీనికి ఉన్నాయి. ఇక స్కైడాన్స్‌ను ఎల్లిసన్‌ 2010లో ప్రారంభించారు. టాప్‌గన్‌, స్టార్‌ ట్రెక్‌ ఇంటూ డార్క్‌నెస్‌ వంటి భారీ చిత్రాలను నిర్మించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని