Union Budget 2024: ‘బడ్జెట్‌’లో సొంతిల్లు.. ప్రభుత్వ సహకారం అందేనా?

Union Budget 2024 : సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకునేవారు ప్రభుత్వం నుంచి పలు ప్రోత్సాహకాలను ఆశిస్తున్నారు. స్థిరాస్తి రంగం క్రమంగా పుంజుకుంటున్న నేపథ్యంలో ధరలూ అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ తరుణంలో రాబోయే బడ్జెట్‌లో పలు ప్రోత్సాహకాల ద్వారా సహకారమందించాలని పలువురు విన్నవిస్తున్నారు.

Published : 08 Jul 2024 12:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గృహ నిర్మాణరంగం కొవిడ్‌ ఒడిదొడుకులను తట్టుకొని సాధారణ స్థాయికి చేరుకుంది. కొత్త ప్రాజెక్టులు, కొనుగోళ్లు ఆశాజనకంగా జరుగుతున్నాయి. కొందరు మాత్రం సొంతింటి కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. పెరుగుతున్న ఇళ్ల ధరలు ఆయా వర్గాలకు ఇంటి కలను దూరం చేస్తున్నాయి. భూములు, ముడిసరుకుల ధరలు, జీఎస్‌టీతో కలిపి నిర్మాణవ్యయం పెరిగిపోతోంది. ఈనేపథ్యంలో సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకుంటున్నవారు రాబోయే కేంద్ర బడ్జెట్‌లో (Union Budget 2024) ప్రోత్సాహకాలను ఆశిస్తున్నారు. అవేంటో చూద్దాం.

పన్నుల రాయితీ పెంపు..

గృహరుణం తీసుకొని ఇల్లు కొనుగోలు చేసినవారికి సెక్షన్‌ 24(బి) ప్రకారం వడ్డీ చెల్లింపుపై రూ.2 లక్షల వరకు ఆదాయపు పన్నులో మినహాయింపు ఉంది. గృహరుణ వడ్డీరేట్లు, ఇళ్ల ధరలు పెరిగిన తరుణంలో    ఈ మొత్తాన్ని రూ.5 లక్షలకు పెంచాలని కోరుతున్నారు. లోన్‌ తీసుకొని తొలిసారి ఇల్లు కొనుగోలు చేసేవారు కట్టే వడ్డీ మొత్తానికి ఎలాంటి పరిమితి లేకుండా పన్ను నుంచి పూర్తి మినహాయింపు ఉండాలని డిమాండ్‌ చేస్తున్నారు.

అసలు పైన రూ.3 లక్షల వరకు..

ఆదాయపు పన్ను సెక్షన్‌ 80సీ కింద గృహరుణం అసలు చెల్లింపులపై రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంది. జీవిత బీమా ప్రీమియం చెల్లింపులు, పిల్లల ట్యూషన్‌ ఫీజులకు సంబంధించి పన్ను మినహాయిపులూ ఇందులోకే వస్తాయి. వాస్తవంగా సగటు వేతన జీవి ఖర్చులను పరిగణనలోకి తీసుకున్నా పైవన్నీ కలిపితే రూ.3 లక్షల వరకు అవుతోంది. మినహాయింపు రూ.లక్షన్నర వరకే ఉంటుంది. దీన్ని రూ.3 లక్షలకు పెంచాలనే డిమాండ్లు ఉన్నాయి. లేదా గృహ రుణం అసలును సెక్షన్‌ 80సీ నుంచి తొలగించి ప్రత్యేక రాయితీ ఇవ్వాలని కోరుతున్నారు.

అందుబాటు ధరల్లో..

అందుబాటు ధరల్లోని ఇళ్లపై ఉన్న పరిమితులు సడలించాలని గృహనిర్మాణ రంగం కోరుతోంది. ఈ విభాగంలో ఇంటి ధర గరిష్ఠంగా రూ.45 లక్షలుగా ఉంది. ఆరేళ్లుగా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. భూముల ధరలు పెరిగిన నేపథ్యంలో పరిమితిని రూ.65 లక్షల నుంచి రూ.75 లక్షలకు పెంచాలనే డిమాండ్‌ బలంగా వినిపిస్తోంది. ఈ పరిమితి పెంపుతో ఈ విభాగంలో నిర్మాణాలు చేపట్టేందుకు మరింతమంది ముందుకొచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా అందుబాటు ధరల్లో ఇళ్ల విభాగంలో నెలకొన్న డిమాండ్‌, సప్లయ్‌ల మధ్య వ్యత్యాసం తగ్గుతుంది.

కొత్త విధానంలోనూ రాయితీ..

2023-24 బడ్జెట్‌లో (Union Budget) కొత్త ఆదాయ పన్ను విధానంలో కీలక మార్పులు చేసిన విషయం తెలిసిందే. ట్యాక్స్‌ రిబేట్‌ను రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు పెంచారు. పన్ను శ్లాబులను ఆరు నుంచి ఐదుకు తగ్గించారు. ప్రామాణిక పన్ను మినహాయింపును రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచారు. ఈ క్రమంలో కొత్త విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చాల్సిన అవసరం ఉందని పలువురు కోరుతున్నారు. అందులోభాగంగా తొలిసారి రుణం తీసుకొని ఇల్లు కొనేవారికి వడ్డీపై కొత్త విధానంలోనూ మినహాయింపు ఇవ్వాలని విన్నవిస్తున్నారు.

సీఎల్‌ఎస్‌ఎస్‌ మళ్లీ తేవాలి..

2022 మార్చి 31 వరకు క్రెడిట్‌ ఆధారిత రాయితీ పథకం (CLSS) అందుబాటులో ఉండేది. ఆర్థికంగా వెనకబడిన, తక్కువ- మధ్యాదాయ వర్గాలకు బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి గృహ రుణాలపై వడ్డీ రేటులో రాయితీ లభించేది. తాజా బడ్జెట్‌లో (Union Budget 2024) దాన్ని తిరిగి పునరుద్ధరించాలని పలు వర్గాలు కోరుతున్నాయి.

80ఈఈఏ పునరుద్ధరణ..

తొలిసారి ఇల్లు కొనుగోలు చేసేవారికి సెక్షన్‌ 80ఈఈఏ కింద హోంలోన్‌పై చెల్లించే వడ్డీలో రూ.50,000 వరకు మినహాయింపు లభించేది. 2022 మార్చిలో దాన్ని ఉపసంహరించారు. తిరిగి దీన్ని పునరుద్ధరించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది.

మరికొన్ని డిమాండ్లు..

  • స్థిరాస్తి అమ్మకాలపై దీర్ఘకాల మూలధన లాభాలపై పన్నును 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గించాలి. గడువును 12 నెలలకు చేర్చాలి.
  • ప్రధాన నగరంలో ఇళ్ల ధరలు ఎక్కువ కాబట్టి కొనుగోలుదారులు శివార్ల వైపు, ద్వితీయ, తృతీయశ్రేణి నగరాల వైపు చూస్తారు. అక్కడ కనీస మౌలిక వసతుల కోసం ప్రత్యేక పథకాలు తీసుకురావాలి.
  • వ్యవసాయ భూములను, వ్యవసాయేతర భూమిగా మార్చుకొనే ప్రక్రియను సులభతరం చేయాలి. అందుబాటు ధరల్లో కట్టే ఇళ్లకు ఈ ఛార్జీలు మినహాయించాలి.
  • బడ్జెట్‌ ధరలో కట్టే ఇళ్లకు జీఎస్‌టీ 1 శాతమే ఉండాలి. ఇన్‌ఫుట్‌ టాక్స్‌ క్రెడిట్‌ పునరుద్ధరించాలి.

మూడోసారి అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్‌డీయే సర్కార్.. సొంతింటి కల సాకారానికి దన్నుగా నిలుస్తామని ఎన్నికల ప్రచారంలో ప్రకటించింది. మరో మూడు కోట్ల మందికి ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చింది. ఈనేపథ్యంలో గృహ నిర్మాణ, ఇంటి కొనుగోలుదారులకు బడ్జెట్‌లో (Union Budget 2024) ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వనుందో చూడాలి మరి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని